కొత్త రాజకీయ పార్టీపై విజయసాయి రెడ్డి ప్రకటన.. సీఎం క్యాండిడేట్ మాత్రం వేరే వారు!
Vijayasai Reddy New Party : ఆంధ్రా రాజకీయాల్లో మరో కొత్త పార్టీ రాబోతోంది. విజయసాయిరెడ్డి కొత్త పార్టీని పెట్టనున్నట్టుగా ప్రకటించారు. తాను మాత్రం సీఎం క్యాండిడేట్ కాదని క్లారిటీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వైఎస్సార్‌సీపీ మాజీ నాయకుడు విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ స్థాపనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే తన నూతన పార్టీ జెండా, అజెండాలను ప్రజల ముందుకు తీసుకువస్తానని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల క్షేమమే ధ్యేయంగా ఈ కొత్త ప్రత్యామ్నాయ శక్తులు రూపుదిద్దుకుంటున్నాయని వెల్లడించారు.

రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాలుగా ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ చుట్టూనే రాజకీయం తిరుగుతోందని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఈ రెండు పార్టీలు ప్రజల సంక్షేమాన్ని పక్కనపెట్టి ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరతీశాయని విమర్శించారు. ఒక వైపు రెడ్ బుక్ పాలన సాగిస్తున్న టీడీపీ, మరోవైపు రప్పా రప్పా సంస్కృతిని ప్రోత్సహిస్తున్న వైసీపీల మధ్య యుద్ధం జరుగుతోందని దుయ్యబట్టారు.
అధికార మార్పిడి కేవలం ఈ రెండు పార్టీల మధ్యే మారుతుందన్న భావన ప్రజల్లో నెలకొందని, దీనివల్ల సామాన్యులు తీవ్రంగా నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై పోరాడే విషయంలో సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, బీజేపీ, జనసేన వంటి ఇతర పార్టీలు పూర్తిస్థాయిలో విఫలమయ్యాయని, అందుకే తాను కొత్త వేదికను సిద్ధం చేయాల్సి వస్తోందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఏ చిన్న పని జరగాలన్నా లంచాలు ఇచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. వ్యాపారాలు చేసుకోవాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా, ఇసుక, మట్టి లేదా ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసమైనా ప్రజాప్రతినిధులకు, అధికారులకు, రౌడీలకు మామూళ్లు చెల్లించాల్సి వస్తోందని ఆరోపించారు.
గత ఎన్నికల్లో రూ. 20 కోట్లు, రూ. 40 కోట్లు ఖర్చు పెట్టిన నాయకులు, ఆ సొమ్మును రికవర్ చేసుకోవడంతో పాటు రాబోయే ఎన్నికల కోసం కూడబెట్టుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. కక్షపూరిత రాజకీయాలను ఏపీకి తీసుకువచ్చి, అక్రమ కేసులు, అరెస్టులతో కాలం వెళ్లదీస్తున్నారని, ఏ ఒక్కరూ అభివృద్ధి ప్రాజెక్టుల గురించి మాట్లాడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని 6 కోట్ల మంది ప్రజలు కేవలం రెండు కుటుంబాల స్వార్థ రాజకీయాల కోసమే ఉన్నారా అని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. ఏపీలో రెడ్డి, కమ్మ వర్గాలే కాకుండా బీసీలు, కాపులు, వెలమలు, ముస్లింలు, క్రైస్తవులు పెద్ద సంఖ్యలో ఉన్నారని గుర్తుచేశారు.
'సమర్థత, అనుభవం ఉన్నప్పటికీ బీసీలు, కాపులు, వెలమలు ముఖ్యమంత్రులు కాకుండా ఈ రెండు వర్గాలు అణచివేస్తున్నాయి. అందుకే మా పార్టీ ద్వారా అర్హత ఉన్న ఏ కులానికి చెందిన నాయకుడైనా సీఎం అయ్యే అవకాశం కల్పిస్తాం.' అని విజయసాయిరెడ్డి అన్నారు.
తన రాజకీయ భవిష్యత్తు, కొత్త పార్టీలో తన పాత్రపై విజయసాయిరెడ్డి స్పష్టత ఇచ్చారు. తాను కొత్త పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేయనని వెంకటేశ్వరస్వామి సాక్షిగా వెల్లడించారు. మహారాష్ట్ర రాజకీయాల్లో బాల్ ఠాక్రే వహించిన పాత్ర తరహాలోనే, తాను కూడా పార్టీకి కేవలం ఒక మెంటార్‌గా మాత్రమే వ్యవహరిస్తానని తెలిపారు. దేశభక్తి, పరిపాలనా సామర్థ్యం, తెలివితేటలు కలిగిన నాయకులకు అధికార పగ్గాలు అప్పగించి, వెనుక ఉండి పార్టీని నడిపిస్తానని ప్రకటించారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


