Subscribe Now! Get features like
స్వప్రయోజనాల ముందు ప్రజల సమస్యలు, అవసరాలు పట్టవని విజయవాడ రాజకీయం రుజువు చేసింది. దేశంలోని అన్ని ప్రధాన నగరాలు తమకు వందే భారత్ రైళ్లను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తుంటే విజయవాడ కేంద్రంగా నడిచే రాజకీయం మాత్రం రైళ్లు రాకుండా అడ్డు పడుతున్నాయి. ఎప్పుడో రావాల్సిన వందే భారత్‌కు ఆటంకాలు సృష్టిస్తున్నాయి.

విజయవాడ నుంచి బెంగుళూరుకు డైరెక్ట్ ట్రైన్స్ లేవు. పైనుంచి వచ్చే రైళ్లలో విజయవాడ కోటా పెద్దగా ఉండదు. దీంతో టిక్కెట్లు దక్కడం దాదాపు అసాధ్యం. దీంతో విజయవాడ బెంగుళూరు మధ్య ట్రావెల్స్ వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతుంది. నిత్యం పెద్ద సంఖ్యలో ట్రావెల్స్ బస్సులు బెంగుళూరుకు నడుస్తుంటాయి. సాయంత్రం ఆరు నుంచి రాత్రి 9 గంటల మధ్యలో విజయవాడ వారధి నుంచి పెద్ద సంఖ్యలో బెంగుళూరుకు ట్రావెల్స్ బస్సులు నడుస్తుంటాయి. 12 -13 గంటల ప్రయాణ సమయమైనా ఈ బస్సుల్లో టిక్కెట్లకు ఎప్పుడు డిమాండ్ ఉంటుంది.
విజయవాడ నుంచి బెంగుళూరుకు వందే భారత్ రైలు వస్తే ట్రావెల్స్ వ్యాపారానికి గండి పడుతుంది. ప్రస్తుతం ఉన్న 13-14 గంటల ప్రయాణం 9 గంటలకు తగ్గిపోతుంది. ఇప్పటికే రైళ్ల రాకపోకల షెడ్యూల్‌ను కూడా ఖరారు చేశారు. గత మేలోనే వందే భారత్‌కు పాలనాపరమైన అనుమతులు లభించగా, ట్రైన్ సర్వీస్ జూన్‌లో మొదలు కావాల్సిఉంది. విజయవాడ నుంచి తిరుపతి మీదుగా 9గంటల్లోనే బెంగుళూరు చేరుకునేలా ప్రయాణ సమయాన్ని ఖరారు చేశారు.
వందే భారత్కు రైల్వే బోర్డు అనుమతించగానే ట్రావెల్స్ వ్యాపారులు రాజకీయ నేతల్ని ఆశ్రయించారు. తమ వ్యాపారాలు దెబ్బతింటాయని ఒత్తిడి చేయడంతో వందే భారత్‌కు అనుమతి రాలేదు. ప్రస్తుతం హైదరాబాద్-విశాఖపట్నం మధ్య విజయవాడ మీదుగా రెండు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. త్వరలోనే విజయవాడ నుంచి బెంగుళూరుకు మరో సర్వీసును ప్రారంభించేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది.ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను విజయవాడలో చేశారు.
విజయవాడ నుంచి బెంగుళూరు వందే భారత్ జాప్యం కావడంపై రైల్వే వర్గాల నుంచి విశ్వసనీయ సమాచారం ప్రకారం స్థానిక రాజకీయాలే కారణంగా తెలుస్తోంది. ఈ ఏడాది రైల్వే బడ్జెట్ రూపకల్పన సమయంలో జీఎంతో ఏపీకి చెందిన ఎంపీలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. డివిజన్ల వారీగా అందరి నుంచి ప్రతిపాదనలు స్వీకరించారు. ఈ క్రమంలో బెంగుళూరుకు డైరెక్ట్ రైళ్ల ఏర్పాటు అంశం కూడా ప్రస్తావనకు రావడంతో దానిని పక్కన పెట్టాల్సిందిగా ప్రజా ప్రతినిధులు సూచించడంతో రైల్వే అధికారులు విస్తుబోయారు.
విజయవాడ నుంచి బెంగుళూరు వైపు పరిమిత సంఖ్యలో రైళ్లు ఉండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.విజయవాడ నుంచి ప్రస్తుతం యశ్వంతపూర్ రైలు మాత్రమే బెంగుళూరుకు ఉంది. విజయవాడ మీదుగా ప్రయాణించే ఇతర జోన్ల రైళ్లలో డివిజన్ కోటా సీట్లు ఉండవు. దీంతో విజయవాడ నుంచి బెంగుళూరు వెళ్లాలనుకునే సగటు ప్రయాణికులకు సీట్లు దక్కే పరిస్థితి లేదు.
దశాబ్దాలుగా విజయవాడ నుంచి బెంగుళూరుకు డైరెక్ట్ ట్రైన్ వేయకపోవడానికి ట్రావెల్స్ రాజకీయమే కారణమని రైల్వే వర్గాలు స్పష్టం చేశారు. ప్రైవేట్ ట్రావెల్ బస్సుల వ్యాపారాన్ని కాపాడేందుకే ప్రజా ప్రతినిధులు కొత్త రైళ్లను రాకుండా అడ్డుపడుతున్నట్టు తెలుస్తోంది. సుదీర్ఘ ప్రయత్నాలు, రైల్వే అధికారుల చొరవతో కొత్త రైలును తిరుపతి మీదగా బెంగుళూరుకు నడిపేందుకు రైల్వే శాఖ అనుమతించినా మళ్లీ రాజకీయం అడ్డుపడింది.
వందేభారత్ సిరీస్ రైళ్లు మొదలైన తర్వాత విజయవాడ- బెంగుళూరు మధ్య కొత్త రైలును ప్రారంభించాలని స్థానిక ప్రజల నుంచి డిమాండ్ వచ్చింది. తొలి దశలో సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య మొదటి రైలు ప్రారంభమైంది. ఆ తర్వాత విశాఖ నుంచి హైదరాబాద్‌కు మరో వందే భారత్ ప్రారంభించారు. రెండు రైళ్లు ఏకకాలంలో విశాఖపట్నం, సికింద్రాబాద్ నుంచి గమ్య స్థానాలకు బయల్దేరుతున్నాయి.
బెంగుళూరుకు వందే భారత్ రైలును నడిపేందుకు రైల్వే అధికారులు కొద్దినెలల క్రితమే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. విజయవాడ నుంచి బెంగుళూరుకు ప్రస్తుతం ప్రయాణ సమయం 12-14 గంటలకు పైగా పడుతోంది. వందే భారత్ రైలు అందుబాటులోకి వస్తే తొమ్మిది గంటల్లోనే గమ్య స్థానాన్ని చేరుకోవచ్చు. దాదాపు మూడు నుంచి ఐదు గంటల ప్రయాణ సమయం ఆదా అవుతుంది.
వందే భారత్ రైలుతో బెంగళూరు వెళ్లే వారితో పాటు తిరుపతి వెళ్లే భక్తులకు కూడా అనువుగా ఉంటుంది. మొత్తం 8 బోగీల్లో 7 ఏసీ చైర్ కార్ బోగీలు, ఒక ఎగ్జిక్యూటివ్ చైర్ కార్‌తో ఈ సర్వీస్ నడుపుతారు. వారంలో మంగ ళవారం మినహా ఆరు రోజులు నడిచేలా షెడ్యూల్ ఖరారు చేశారు.ట్రైన్ నంబర్ 20711 విజయవాడ- బెంగుళూరు వందే భారత్ విజయవాడలో ఉదయం 5.15 బయలుదేరి తెనాలి 5.39కు చేరుతుంది. ఒంగోలు 6.28, నెల్లూరు 7.43, తిరుపతి, 9.45, చిత్తూరు 10.27, కాట్పాడి 11.13, కృష్ణరాజపురం 13.38, ఎస్ఎంవీటీ బెంగళూరు మధ్యాహ్నం 14.15 గంటలకు చేరుతుంది.
తిరుగు ప్రయాణంలో అదే రోజు ట్రైన్ నంబర్ 20712 బెంగ ళూరులో మధ్యాహ్నం 14.45 గంటలకు ప్రారంభం అవుతుంది. కృష్ణరాజపురం మధ్యాహ్నం 2.58,కాట్పాడి 5.23, చిత్తూరు సాయంత్రం 5.49, తిరుపతి 6.55, నెల్లూరుకు రాత్రి 8.18, ఒంగోలుకు రాత్రి 9.29, తెనాలి రాత్రి 10.42, విజయవాడ 11.45కు చేరుతుంది. ఇప్పటికే వందే భారత్ రైలు రాకపోకలు మొదలు పెట్టాల్సి ఉన్నా స్థానిక నాయకుల ఒత్తిళ్లతో ర్యాక్స్ విజయవాడ చేరుకోలేదని రైల్వే వర్గాలు చెబుతున్నాయి.
విజయవాడ నుంచి ప్రధాన నగరాలకు నేరుగా వందే భారత్ రైళ్లను నడపాలనే ఉద్దేశంతో మూడేళ్ల క్రితమే రైల్వే శాఖ ఏర్పాట్లు ప్రారంభించింది. ఇందులో భాగంగా అప్‌యార్డ్ కాలనీ సమీపంలో పాలఫ్యాక్టరీ వెనుక భాగంలో రూ.140కోట్ల రుపాయల వ్యయంతో వందే భారత్ కోచింగ్ డిపో, ర్యాక్ మెయింటెయినెన్స్ సెంటర్ నిర్మించారు. ఇందులో ఏకకాలంలో మూడు ర్యాక్స్ ( మూడు పూర్తి స్థాయి రైళ్లు) మెయింటెయిన్ చేసేలా డిపోను నిర్మించారు. ఈ డిపో నిర్మాణ సమయంలో సాంకేతిక అంశాలను విజయవాడ డివిజన్ రైల్వే ఉన్నతాధికారులు విస్మరించినట్టు తెలుస్తోంది.
మరోవైపు బెంగుళూరుకు రైళ్లను నడపడంలో జాప్యానికి గుంతకల్లు-ధర్మవరం-బెంగుళూరు మార్గంలో రైల్వే విద్యుదీకరణ పనుల్లో జాప్యం జరగడం కారణమని అధికారులు చెబుతున్నారు. గుంతకల్లు, ధర్మవరం సెక్షన్ పనులు ఇప్పటికే పూర్తైనా, ధర్మవరం-బెంగుళూరు సెక్షన్ పనులు పూర్తి కాలేదు. ధర్మవరం-పెనుకొండ మధ్య పనులు సాగుతున్నాయి.43 కిలోమీటర్ల మార్గాన్ని విద్యుదీకరించడానికి టెండర్లు పూర్తైనా పనులు పూర్తికాలేదు. ఏపీ - కర్ణాటక మధ్య రాకపోకలు వేగంగా జరగడంతో పాటు రాయలసీమ ప్రాంతాలకు ఏపీ రాజధానితో అనుసంధానించవచ్చని చెబుతున్నారు,.
విజయవాడ రైల్వే స్టేషన్ పది ప్లాట్‌ఫామ్‌ల నుంచి అప్‌యార్డ్‌లో నిర్మించిన కొత్త కోచింగ్ డిపోకు రైళ్లు చేరుకునేలా కనెక్టివిటీ ఇవ్వడం అధికారులు మరిచారు. ప్రస్తుతం పదో నంబర ప్లాట్‌ఫాంకు వచ్చిన రైళ్లు మాత్రమే కొత్త కోచింగ్ డిపోకు వెళ్లే అవకాశం ఉంది. మిగిలిన తొమ్మిది ప్లాట్‌ఫామ్‌లతో ఈ డిపోకు కనెక్టివిటీ లేనట్టు చెబుతున్నారు.
ఇటీవల రైల్వే బోర్డు అధికారుల తనిఖీల్లో ఈ అంశం వెలుగు చూసింది. రూ.140 కోట్లు ఖర్చుతో నిర్మించిన డిపోకు ఇంటర్ లాకింగ్ కనెక్టివిటీ లేకపోవడంపై బాధ్యులైన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మరోవైపు విజయవాడ నుంచి బెంగుళూరుకు డైలీ సర్వీస్ నడపడానికి రెండు వైపులా ప్రయాణించే రెండు ర్యాక్స్ మంజూరు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని రైల్వే వర్గాలు చెబుతున్నాయి.







