ఎవరీ మాస్టర్ మైండ్, మోస్ట్ వాంటెడ్ హిడ్మా.. మావోయిస్ట్ పార్టీ ఇక కోలుకోలేదా?
మావోయిస్ట్ అగ్రనేత మడవి హిడ్మా ఎన్‌కౌంటర్‌లో మరణించారు. ఆయన భార్యతోపాటుగా మరికొందరు కూడా మృతి చెందారు. ఇంతకీ ఈ మావోయిస్ట్ టాప్ నేత హిడ్మా ఎవరు? ఎక్కడ నుంచి వచ్చారు?
కొంతకాలంగా మావోయిస్టు పార్టీ కోలుకోలేని ఎదురుదెబ్బలు తగుతున్నాయి. మావోయిస్టు అగ్రనేతల మరణం ఒకవైపు ఉద్యమాన్ని బలహీనపరుస్తుంటే.. మరోవైపు లొంగుబాట్లు కూడా జరిగాయి. దీంతో పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగిలాయి. మావోయిస్టు అగ్రనేతలైన ఆశన్న, మల్లోజుల వేణుగోపాల్‌లాంటి కీలక నేతలు లొంగిపోయారు. తర్వాత ఎక్కడా చూసినా హిడ్మా పేరు ఎక్కువగా వినిపించింది. ఏదైనా ఉంటే హిడ్మా చూసుకుంటాడులే అన్నట్టుగా మారిపోయింది. కానీ తాజాగా హిడ్మా కూడా ఎన్‌కౌంటర్‌లో మరణించారు. ఆయన ఎక్కడ నుంచి వచ్చారు?

1981లో సుక్మాలో పూర్వటి గ్రామంలో జన్మించిన హిడ్మా, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్‌కు నాయకత్వం వహించాడు. సీపీఐ మావోయిస్టు సెంట్రల్ కమిటీలో అతి పిన్న వయస్కుడైన సభ్యుడయ్యాడు. బస్తర్ ప్రాంతం నుండి కేంద్ర కమిటీలో ఉన్న ఏకైక గిరిజన సభ్యుడు ఆయన. మురియా తెగకు చెందిన హిడ్మాకు హిందీ, తెలుగు, గోండి, బెంగాలీ, కోయ భాషతోపాటుగా మరికొన్నింటిలో ప్రావీణ్యం ఉంది.
దండకారణ్యంలో హిడ్మాకు చాలా పట్టు ఉంది. పార్టీ శ్రేణులను ముందు ఉండి నడిపించేవాడు. హిడ్మా ప్లాన్ వేస్తే పక్కాగా జరగాల్సిందేనని పేరు ఉంది. గెరిల్లా దాడులు చేయడంలో దిట్ట. భారీ దాడులకు వ్యూహం వేయాలంటే హిడ్మా అక్కడ ఉండాల్సిందే అంటారు. ఈ క్రమంలోనే మిలటరీ దాడులకు మారు పేరైన పీఎల్‌జీఏలో ఒకటో బెటాలియన్‌కు హిడ్మా సారథ్యం వహించారు.
ఏడో తరగతి వరకే హిడ్మా చదువుకున్నాడు. 17 ఏళ్ల వయసులో మావోయిస్టు పార్టీలో చేరాడు. మావోయిస్టు పార్టీ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పీఎల్‌జీఏ) 1వ బెటాలియన్‌కు కమాండర్‌గా, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో సభ్యుడిలాంటి కీలక బాధ్యతలు హిడ్మా చేతిలో ఉండేవి. మావోయిస్టుల టాక్టికల్ కౌంటర్ అఫెన్సివ్ క్యాంపెయిన్ కూడా హిడ్మా నేతృత్వంలోనే దాడులు చేసేది.
కొత్తగా ఏ బెటాలియన్ పెట్టినా.. హిడ్మా ఆధ్వర్యంలో పూర్తి స్థాయి శిక్షణ ఉంటుందని చెబుతారు. ఫైరింగ్ శిక్షణ కూడా ఇచ్చేవాడు. 26కు పైగా కీలక ఘటనలకు సూత్రధారి హిడ్మానే. అంతేకాదు మావోయిస్టు పార్టీలో పరిశోధన, అభివృద్ధి విభాగం కూడా అతడి కనుసన్నల్లోనే పని చేస్తుందంటారు.
హిడ్మా ఆధ్వర్యంలో కొన్ని దాడులు
కూంబింగ్ ఆపరేషన్ చేసే పోలీస్ బలగాలపై, సీఆర్‌పీఎఫ్ క్యాంపుల మీద మెరుపు వేగంతో దాడులు చేయడంలో హిడ్మాది కీలక పాత్ర. హిడ్మా నేతృత్వంలో అనేక కీలక ఘటనలు జరిగాయి. 2010 ఏప్రిల్‌లో సుక్మా జిల్లా తాడిమెట్లలో 74 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. ఈ కాల్పుల ఘటన హిడ్మా ఆధ్వర్యంలోనే జరిగింది. 2013లో చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ నేతల కాన్వాయ్‌పై మావోయిస్టులు భారీ దాడి చేశారు. ఈ దాడిలో మాజీ మంత్రి మహేంద్ర కర్మ, కాంగ్రెస్ నేత నందకుమార్ పటేల్, ఇతర నేతలు, భద్రతా సిబ్బంది సహా 30 మంది మృతి చెందారు.
2017 మార్చి 12న సుక్మా జిల్లా బెజ్జి పోలీస్‌స్టేషన్ సమీపంలో రోడ్డు నిర్మాణ పనులకు భద్రతగా వెళ్తున్న జవాన్లపై మందుపాతర దాడి జరిగింది. 12 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు చనిపోయారు. 2017 ఏప్రిల్‌లో చింతగుఫా పోలీస్ స్టేషన్ పరిధిలో బుర్కాపాల్ సమీపంలో రోడ్డు పనులు భద్రతాగా వెళ్లే.. సీఆర్‌పీఎఫ్ జవాన్లపై దాడిలో 24 మంది మరణించారు. 2018 మార్చిలో సుక్మా జిల్లా కాసారం అటవి ప్రాంతంలో మందుపాతర పేల్చిన ఘటనలో 12 మంది జవాన్లు చనిపోయారు. ఇలాంటి అనేక ఘటనల్లో హిడ్మా ఉన్నారు.
కొన్ని రోజులుగా కీలక నేతలు దూరమవుతున్న నేపథ్యంలో మావోయిస్టు పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా హిడ్మా మృతితో పార్టీకి కోలుకోలేని దెబ్బ అని పలువురు అభిప్రాయపడుతున్నారు. అన్నింటిలో చురుకుగా, కీలకంగా వ్యవహరించే హిడ్మా ఎన్‌కౌంటర్ మావోయిస్టు పార్టీకి తీరని నష్టం అని చెబుతున్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


