YS Jagan Questions : చంద్ర‌బాబు గారూ…. మహిళలకు ఆ డ‌బ్బులు ఎప్పుడిస్తారు…? వైఎస్ జగన్ ప్రశ్నలు

సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు.మహిళలకు ఎన్నిక‌ల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని ఇప్ప‌టి వ‌ర‌కు అమ‌లు చేయ‌లేదన్నారు.పైగా రోజుకో డ్రామాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. పలు ప్రశ్నలు సంధిస్తూ... జగన్ ప్రకటన విడుదల చేశారు.

Published on: Mar 09, 2026 6:43 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.మహిళలకు ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ సూటిగా పలు ప్రశ్నలు సంధించారు. మ‌హిళాభ్యుద‌యానికి, మ‌హిళా సాధికార‌త‌కు చంద్ర‌బాబు పాల‌న చీక‌టి కాలమని చెప్పారు. రాష్ట్రంలో న‌డుస్తున్న‌దంతా దుశ్శాస‌న ప‌ర్వమంటూ ఆక్షేపించారు.

వైసీపీ అధినేత జగన్
వైసీపీ అధినేత జగన్

“నేరుగా సీఎం చంద్రబాబు గారిని అడుగుతున్నా…. అయ్యా! జ‌నాభాలో 50 శాతం ఉన్న అక్క చెల్లెమ్మ‌ల‌కు ఎన్నిక‌ల ముందు మీరిచ్చిన ఏ ఒక్క హామీని ఇప్ప‌టి వ‌ర‌కు అమ‌లు చేయ‌లేదు. కానీ అన్నీ చేసేసిన‌ట్లు విజ‌య‌వాడ‌లో , అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా, ప‌ట్ట‌ప‌గ‌లు ఇంకో డ్రామా మొద‌లు పెట్టిన మిమ్మ‌ల్ని నేరుగా అడుగుతున్నా.. మ‌హిళా సాధికార‌త అన్న ప‌దం ప‌లికే అర్హ‌త మీకుందా..?” అని జగన్ ప్రశ్నించారు.

సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ ప్రశ్నలు:

  • "సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ లో భాగంగా 19-59 మ‌ధ్య వ‌య‌సున్న ప్ర‌తి ఒక్క అక్క‌చెల్లెమ్మ‌కు నెల‌కు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇస్తామ‌ని ఎన్నిక‌ల ముందు చెప్పారు. రాష్ట్రంలో 18 ఏళ్ల పైబడి, 60 ఏళ్ల లోపు ఉన్న మహిళలు ఎన్నికల కమిషన్‌ డేటా ప్రకారం కోటి 80 లక్షల మంది ఉన్నారు. వీరికి నెలకు రూ.1500 అంటే సంవత్సరానికి రూ.18 వేల చొప్పున ఒక్కో అక్కచెల్లెమ్మలకు మూడేళ్ల‌లో రూ.54 వేల చొప్పున బాకీ పడ్డారు. ఆ డ‌బ్బులు ఎప్పుడిస్తారు చంద్ర‌బాబు గారూ….?
  • మ‌రో హామీ 50 ఏళ్లకే పింఛన్‌. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్క‌చెల్లెమ్మ‌ల‌కు 50 ఏళ్లు వయస్సు దాటిన వారికి నెల‌కు రూ.4వేలు చొప్పున ఒక్కొక్కరికి రూ.48 వేలు ఇవ్వాలి. మూడేళ్లలో రూ.1.44 లక్షలు బాకీ పడ్డారు. ఆ డ‌బ్బులు ఎప్పుడిస్తారు….?
  • బడికి వెళ్లే ప్రతి పిల్ల వాడికి ఏడాదికి రూ.15 వేల చొప్పున ఎంత మంది పిల్లలుంటే అంత మందికి త‌ల్లికి వంద‌నం కింద‌ ఇస్తామన్నారు. మొద‌టి ఏడాది పూర్తిగా ఎగ‌నామం పెట్టారు. రాష్ట్రంలో యూడీఐఎస్ఈ (యూనిఫైడ్‌ డిస్ట్రిక్ట్ ఇన్‌ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌) ప్రకారం 2023–24 నాటికి బడికి పోయే పిల్లలు 87,41,885 మంది ఉంటే రెండో ఏడాది 20 ల‌క్ష‌ల మందికి ఎగ‌ర‌గొట్టారు. చివరకు 67.27 లక్షల మందికి మాత్రమే అది కూడా కొందరికి రూ.8 వేలు.. రూ.9 వేలు.. రూ.10 వేలు, మరి కొంత మందికి రూ.13 వేలు ఇచ్చారు. మ‌రి వీళ్లంద‌రికీ డ‌బ్బులు ఎప్పుడిస్తారు? ఎగ్గొట్టిన మొద‌టి ఏడాది డ‌బ్బులు ఎప్పుడిస్తారు….?
  • సూపర్‌ సిక్స్‌లో ఉచిత గ్యాస్‌ చిన్న హామీ. ఇక్కడా కూడా మోసాలే. రాష్ట్రంలో యాక్టివ్‌గా ఉన్న గ్యాస్‌ కనెక్షన్ల సంఖ్య 1.59 కోట్లు. వీరికి ఏటా మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. సిలిండర్ ధర రూ.855 చొప్పున మూడు సిలిండర్లకు ఏడాదికి రూ.3,990 కోట్లు కేటాయించాలి. మొదటి ఏడాది కేవలం రూ.786 కోట్లు, రెండో ఏడాది రివైజ్డ్‌ ఎస్టిమేట్స్‌ ప్రకారం బడ్జెట్‌లో రూ.2,199.99 కోట్లు కేటాయించారు. 2026–27లో బడ్జెట్‌లో ఈ పథకానికి పెట్టింది రూ.2,601 కోట్లు. అంటే మొత్తంగా రూ.6,143 కోట్లు బాకీ పడ్డారు. ఆ డ‌బ్బులు ఎప్పుడు ఇస్తారు చంద్ర‌బాబు గారూ…..?
  • ఉచిత బ‌స్సులో ఎక్క‌డి నుంచి ఎక్క‌డికైనా వెళ్ల‌వ‌చ్చ‌ని మ‌హిళ‌ల‌కు హామీ ఇచ్చారు. ఏపీఎస్ ఆర్టీసీలో 16 రకాల సర్వీసులుంటే.. కేవలం ఐదు సర్వీసులకు మాత్రమే పరిమితం చేశారు. ఈ పథకం అమలు చేయాలంటే ఏడాదికి రూ.3,200 కోట్లు ఖర్చు చేయాలి. మొదటి ఏడాది ఈ స్కీమ్‌ ఎగరగొట్టేశారు. రెండో ఏడాది ఆర్నెల్ల తర్వాత ఆగస్టులో అరకొరగా మొదలు పెట్టారు. చేసిన ఖర్చు రూ.1,040 కోట్లు. ఈ స్కీమ్‌ కోసం ఈ బడ్జెట్‌లో కేటాయించిన మొత్తం రూ.1,420 కోట్లు. అంటే మూడేళ్లలో రూ.9,600 కోట్లకు గాను రూ.2,460 కోట్లు కేటాయించారు. అంటే రూ.7,140 కోట్లు బాకీ పడ్డారు. ఆ డ‌బ్బులు ఎప్పుడిస్తారు చంద్ర‌బాబు గారూ…..?
  • ఇవేకాదు అక్కచెల్లెమ్మల పేరిట వాళ్లకు మంచి చేస్తూ ఏకంగా 31 లక్షల ఇళ్లపట్టాలిచ్చాం. అందులో 21 లక్షల ఇళ్లు మంజూరు చేయించాం. అందులో 10 లక్షల పైచిలుకు ఇళ్లు పూర్తి చేశాం. చంద్రబాబునాయుడు అక్కచెల్లెమ్మలకు ఇచ్చే ఇంటి స్థలాలకు సంబంధించి చేసిన ప్రామిస్‌ ఏంటి? పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామనిమేనిఫెస్టోలో చెప్పారు. 3 బడ్జెట్లు అయిపోయాయి. ఈరోజుకు కూడా ఒక్క కుటుంబానికి ఒక్క పట్టా ఇవ్వలేదు. ఒక్క గజం కూడా స్థలం దీనికోసం కొనలేదు. ఉన్న ఇళ్ల‌నిర్మాణాల‌ను గాలికొదిలేశారు. మ‌రి ఆ ఇళ్ల నిర్మాణాల‌ను అక్క‌చెల్లెమ్మ‌ల‌కు ఎప్పుడు పూర్తి చేసి ఇస్తారు….?
  • డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ. ఈ పథకానికి మూడు బడ్జెట్లలో అతీగతీ లేదు. మా హయాంలో కోటి మంది మహిళలకు వడ్డీ లేని రుణాల కింద రూ.4,969 కోట్లు ఇచ్చాం. మీరు వ‌చ్చి మూడు బ‌డ్జెట్లు పెట్టారు. ఇప్ప‌టికి ఒక్క పైసా కూడా సున్నా వ‌డ్డీ కింద ఇవ్వ‌లేదు. ఈ డ‌బ్బులు ఎప్పుడు ఇస్తారు….?
  • వైయ‌స్ఆర్‌ చేయూత పథకం ద్వారా 26,98,931 మంది అక్కచెల్లెమ్మలకు రూ.19,189 కోట్లు ఇచ్చాం. వైయ‌స్ఆర్‌ ఆసరా కింద 78,94,169 మంది అక్కచెల్లెమ్మలకు రూ.25,570 కోట్లు ఇచ్చాం. వైయ‌స్ఆర్‌ కాపు నేస్తం ద్వారా 3,58,613 మంది అక్కచెల్లెమ్మలకు రూ.2,029 కోట్లు ఇచ్చాం. వైయ‌స్ఆర్‌ ఈబీసీ నేస్తం ద్వారా 4,95,269 మంది అక్కచెల్లెమ్మలకు మరో రూ.1876 కోట్లు ఇచ్చాం. నిజంగా స్త్రీ శక్తి ఎక్కడైనా లభించింది అంటే, వారి సాధికారత ఎక్కడైనా జరిగింది అంటే అది వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలోనే అని గర్వంగా చెప్పగలుగుతాం. ఈ ప‌థ‌కాల‌న్నీ మీరు అధికారంలోకి వ‌చ్చాక ర‌ద్దు చేశారు క‌దా.. మరి మీకు మ‌హిళా సాధికార‌త గురించి మాట్లాడే అర్హ‌త ఉందా,,,,,?
  • అక్క‌చెల్లెమ్మ‌ల కాపురాల్లో చిచ్చుపెట్టేలా వీధికో బెల్టుషాపు, ఊరికో మ‌ద్యం షాపు, బారు తెర‌వ‌ట‌మే మీకు తెలిసిన మ‌హిళా సాధికార‌త‌, అదే మీకు తెలిసిన మ‌హిళా భ‌ద్ర‌తా…?
  • దిశ పోలీస్ స్టేష‌న్ల‌ను, దిశ యాప్ ను కూడా నిర్వీర్యం చేశారు. చివ‌రికి రాష్ట్రాన్ని మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, మీ టీటీడీ ఛైర్మ‌న్‌.. ఇలా ప్ర‌తి ఒక్క‌రూ అత్యాచార‌ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను నిర్మించారు.
  • చ‌రిత్ర‌లోనే క‌నీవినీ ఎరుగ‌ని విధంగా ఎక్కువ మంది మ‌హిళ‌ల‌కు ఎమ్మెల్సీలు, క్యాబినెట్ మంత్రులుగా అవ‌కాశం ఇచ్చిన‌ది కూడా మా అయిదేళ్ల పాల‌న‌లోనే. ఇలా చేశాం కాబ‌ట్టే మా పాల‌న మ‌హిళా సంక్షేమ చ‌రిత్ర‌లో సువ‌ర్ణ అధ్యాయం అని గ‌ర్వంగా చెప్పుకోగ‌లుగుతున్నాం.
  • ఇప్ప‌టి ప‌రిస్థితి ఏమిటంటే.. మ‌హిళాభ్యుద‌యానికి, మ‌హిళా సాధికార‌త‌కు చంద్ర‌బాబుగారి పాల‌న చీక‌టి కాలం. రాష్ట్రంలో న‌డుస్తున్న‌దంతా దుశ్శాస‌న ప‌ర్వం" అంటూ వైఎస్ జగన్ ప్రశ్నాస్త్రాలను సంధించారు.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More