Ananya Panday: దీనిని భరతనాట్యం అంటారా.. ఎందుకు ఖూనీ చేస్తావ్.. నటరాజు కూడా బాధపడతాడు: అనన్య డ్యాన్స్‌పై ట్రోలింగ్
Ananya Panday: కరణ్ జోహార్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ నిర్మించిన 'చాంద్ మేరా దిల్' (Chand Mera Dil) సినిమాలో నటి అనన్యా పాండే చేసిన భరతనాట్యం ఫ్యూజన్ డ్యాన్స్ క్లిప్ నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఈ డ్యాన్స్ స్టెప్పులపై ప్రముఖ శాస్త్రీయ నృత్యకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Ananya Panday: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కొన్ని గంటలుగా ఒక వీడియో క్లిప్ విపరీతంగా హల్చల్ చేస్తోంది. 'చాంద్ మేరా దిల్' మూవీలో హీరో లక్ష్య (Lakshya) ఎంతో ఆశ్చర్యంగా చూస్తుండగా.. నటి అనన్యా పాండే స్టేజ్ పైన భరతనాట్యం ఫ్యూజన్ డ్యాన్స్ ప్రదర్శిస్తుంది.

సినిమాలో హీరో ఆమె డ్యాన్స్‌కు ఫిదా అయిపోయినట్లు చూపించినప్పటికీ, బయట రియల్ లైఫ్‌లో మాత్రం నెటిజన్లు, ముఖ్యంగా క్లాసికల్ డ్యాన్స్ ఆర్టిస్టులు ఈ సీన్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అసలు ఆ సీన్ ఏంటి?
ఈ సినిమాలో అనన్యా పాండే 'చాందిని' అనే పాత్రను పోషించింది. కథ ప్రకారం ఆమె ఒక భరతనాట్యం డ్యాన్సర్ (చారు శంకర్) కూతురు. అయితే ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ సమయంలో సంప్రదాయ భరతనాట్యానికి బదులుగా.. ఆమె భరతనాట్యాన్ని హిప్-హాప్, లాకింగ్ స్టెప్పులతో మిక్స్ చేసి ఒక ఫ్యూజన్ డ్యాన్స్ రూపంలో ప్రదర్శిస్తుంది. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ఇదొక హాట్ టాపిక్‌గా మారింది.
‘నటరాజ స్వామి కూడా బాధపడుతుంటాడు’
ప్రముఖ నృత్యకారిణి, ప్రతిష్టాత్మక సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత అనితా ఆర్ రత్నం (Anita R Ratnam) ఎక్స్ వేదికగా అనన్య డ్యాన్స్‌పై అత్యంత ఘాటుగా స్పందించారు.
"ఈ క్లిప్ చూస్తుంటే భరతనాట్యం రూపాన్ని ఎవరో బందీగా మార్చి ఘోరంగా అవమానించినట్లు అనిపించింది. చేతులు విసిరేయడం, విచిత్రమైన కెమెరా కదలికల మధ్య అసలైన నృత్యం మూటముల్లే సర్దుకుని థియేటర్ నుండి బయటకు వెళ్ళిపోయింది. భరతనాట్యం అనేది సాంకేతికత, నియంత్రణ, సంప్రదాయం, జామెట్రీ, సంగీత పరిజ్ఞానం, భావోద్వేగాల కలయిక. కానీ ఈ సీన్ చూస్తుంటే ఏదో చిన్నపాటి భూకంపం వస్తున్నప్పుడు పెళ్లి సంగీత్‌లో డ్యాన్స్ చేసినట్లు ఉంది. ఇందులో 'అడవుస్' (Adavus - భరతనాట్య ప్రాథమిక అడుగులు) అనేవి ఆప్షనల్ కాదు. ఇదొక అల్గారిథమిక్ పానిక్ కొరియోగ్రఫీ.. ఆ నటరాజ స్వామి కూడా ఈ ఘోరానికి బాధపడుతుంటాడు" అని ఘాటుగా విమర్శించారు.
మరీ ఇంత చిన్న చూపా?
మరో ప్రసిద్ధ నృత్యకారిణి కృతిక శివస్వామి కూడా ఈ విషయమై స్పందిస్తూ, "బాలీవుడ్‌కు మన సాంప్రదాయ కళలపై ఎంత నిర్లక్ష్యం, అగౌరవం ఉందో అనన్యా పాండే 'భరతనాట్యం' నిరూపించింది. భారతదేశంలో ఇలా శాస్త్రీయ కళలను అవహేళన చేసేవారిపై కేసు వేసే చట్టపరమైన వ్యవస్థ లేకపోవడం దురదృష్టకరం. అందుకే ఎవరైనా వచ్చి ఇలాంటి చెత్త ప్రయోగాలు చేస్తున్నారు" అని తీవ్రంగా మండిపడ్డారు.
అనన్య అద్భుతంగా చేసింది: కొరియోగ్రాఫర్ సమర్థన
శాస్త్రీయ నృత్యకారుల నుండి ఇంత పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నప్పటికీ, ఈ సినిమాకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన అనన్య ఆర్ కురుప్ మాత్రం అనన్యా పాండేకు మద్దతుగా నిలిచారు. షూటింగ్‌కు సంబంధించిన బిహైండ్ ది సీన్స్ (BTS) ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఆమె ఇలా రాసుకొచ్చారు..
"అనన్యా పాండే చాలా స్వీట్ పర్సన్. తనకు భరతనాట్యం నేర్పించడం ఒక అద్భుతమైన అనుభూతిని ఇచ్చింది. చాంద్ మేరా దిల్ సినిమాలో ఆమె ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్‌ను ఎంతో అద్భుతంగా చేసింది" అని అన్నారు.
ఈ పోస్ట్‌కు నటి అనన్యా పాండే కూడా స్పందిస్తూ లవ్ ఎమోజీలను రిప్లైగా ఇచ్చింది. వివేక్ సోని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మే 22న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద మిశ్రమ సమీక్షలను అందుకుంటోంది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. 'చాంద్ మేరా దిల్' సినిమాలో వివాదాస్పదమైన సీన్ ఏంటి?
ఈ సినిమాలో హీరోయిన్ అనన్యా పాండే సంప్రదాయ భరతనాట్యాన్ని హిప్-హాప్, లాకింగ్ స్టెప్పులతో కలిపి ఒక 'ఫ్యూజన్ డ్యాన్స్' చేస్తుంది. ఈ స్టెప్పులు శాస్త్రీయ నృత్య రూపానికి విరుద్ధంగా ఉన్నాయంటూ వివాదం రేగింది.
2. అనన్యా పాండే డ్యాన్స్‌పై నృత్యకారిణి అనితా రత్నం ఏమని విమర్శించారు?
ఇది భరతనాట్యాన్ని బందీగా ఉంచినట్లు ఉందని, చిన్నపాటి భూకంపం వస్తున్నప్పుడు పెళ్లి సంగీత్‌లో డ్యాన్స్ చేసినట్లు ఈ సీన్ ఉందని ఆమె ఎద్దేవా చేశారు. ఇది కళను అవహేళన చేయడమేనని పేర్కొన్నారు.
3. చాంద్ మేరా దిల్ సినిమా దర్శకుడు, నిర్మాత ఎవరు?
ఈ చిత్రానికి వివేక్ సోని దర్శకత్వం వహించగా, కరణ్ జోహార్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ 'ధర్మ ప్రొడక్షన్స్' దీనిని నిర్మించింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


