బ్రహ్మముడి జులై 15 ఎపిసోడ్: శీనుగాడి కిడ్నాప్.. రేవతి ఇంటి దగ్గర రాజ్, కావ్యలకు దొరికిపోయిన ఇందిరాదేవి.. అప్పుకు శిక్ష!
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు మంగళవారం అంటే జులై 15 ఎపిసోడ్ ఆసక్తికర మలపులతో సాగింది. శీనుగాడి కిడ్నాప్ తోపాటు రేవతి ఇంటి దగ్గర ఇందిరాదేవిలను రాజ్, కావ్య చూడటంలాంటి సీన్లతో ఈ ఎపిసోడ్ రక్తి కట్టింది.
బ్రహ్మముడి సీరియల్ 774వ ఎపిసోడ్ ఎంతో ఆసక్తి రేపింది. అపర్ణ తన మనవడు స్వరాజ్ తో సరదాగా ఆడుకోవడం, ఇందిరాదేవి ఇచ్చిన డబ్బును రేవతి వద్దనడం, శీనుగాడి ఇంటికి రాజ్, కావ్య వెళ్లడం.. అతడు కిడ్నాప్ అయ్యాడని తెలుసుకోవడం, అటు రేవతి ఇంటి దగ్గరే ఇందిరా దేవిని రాజ్, కావ్య చూడటం లాంటి సీన్లతో ఎపిసోడ్ అంతా ఉత్కంఠ రేపేలా సాగింది.

డబ్బు కాదు బంధం కావాలన్న రేవతి
రేవతి ఇంటికి వెళ్లిన ఇందిరాదేవి వాళ్లతో మాట్లాడే సీన్ తోబ్రహ్మముడి సీరియల్ ఈరోజు (జులై 15) ఎపిసోడ్ ప్రారంభమవుతుంది. రేవతిని తల్లి, కుటుంబంతో కలిపే బాధ్యత తనది అని వాళ్లతో ఇందిరాదేవి హామీ ఇస్తుంది. తనను నమ్మి వచ్చిన రేవతిని సరిగా చూసుకోలేకపోతున్నానని, ఈ పేదరికమే తనకు ఇచ్చానని అటు జగదీశ్ బాధపడతాడు.
ఏమీ బాధపడొద్దని, కుటుంబానికి దగ్గర చేసే బాధ్యత తనదని వాళ్లతో ఇందిర చెబుతుంది. అయితే అంత వరకూ ఈ డబ్బు వాడుకోండని వాళ్లకు ఇందిరాదేవి డబ్బు ఇవ్వబోతోంది. కానీ రేవతి మాత్రం మీతో బంధం తప్ప ఈ డబ్బు కోరుకోవడం లేదని తిరస్కరిస్తుంది. తన ముని మనవడ ఎక్కడ, అతన్ని ముద్దు చేయాలని అనుకుంటున్నట్లు ఇందిర చెబుతుంది. స్కూల్ కు వెళ్లాడని, వచ్చేస్తాడని రేవతి అంటుంది.
మనవడితో అపర్ణ ఆటలు
అటు తన మనవడు అని తెలియకుండానే స్వరాజ్ తో అపర్ణ సరదాగా ఆడుకునే సీన్ కూడా ఈరోజు ఎపిసోడ్లో ఆసక్తి రేపుతుంది. రోడ్డుపై కారు ఆపి చూసుకోకుండా డోరు తెరుస్తుంది. అప్పుడే ఐస్ క్రీమ్ తింటూ వెళ్తున్న రేవతి కొడుకు స్వరాజ్ కు ఆ డోర్ తగిలి అతడు కింద పడిపోతాడు. తన చేతిలోని ఐస్ క్రీమ్ కింద పడిపోవడంతో అతడు అపర్ణతో గొడవ పడతాడు. ఆ పిల్లాడి మాటలు నచ్చి నీ పేరేంటని అడుగుతుంది అపర్ణ.
అతడు స్వరాజ్ అని చెప్పడంతో తన కొడుకు పేరు కూడా స్వరాజే అని అంటుంది. అంటే మీ అబ్బాయి పేరును తాను పెట్టుకున్నానని అంటున్నారా అని ఆ పిల్లాడు అడుగుతాడు. లేదు నీ పేరే మా అబ్బాయికి పెట్టాంలే అని అపర్ణ నవ్వుతూ చెబుతుంది. తనకు రెండు ఐస్ క్రీమ్ లు ఇప్పిస్తే నువ్వు చేసిన తప్పుకు క్షమిస్తానని అపర్ణతో ఆ పిల్లాడు అనడంతో అతనికి ఐస్ క్రీమ్స్ ఇప్పిస్తుంది. ఆ తర్వాత ఇద్దరూ అక్కడే కూర్చొని మాట్లాడుకుంటారు. ఫ్రెండ్స్ అయిపోతారు.
శీనుగాడి ఇంటికి రాజ్, కావ్య
అటు శీనుగాడిని వెతుక్కుంటూ రేవతి ఇంటికి వెళ్తారు రాజ్, కావ్య. ఆ సమయంలో ఇందిరా దేవి అక్కడే ఉంటుంది. వాళ్ల గొంతు విని కంగారు పడుతుంది. తనను ఇక్కడ చూస్తే ఇక అంతే అని భయపడుతుంది. దీంతో లోపలికి వెళ్లి దాక్కోవాలని రేవతి ఆమెకు చెబుతుంది. ఆ తర్వాత ఇంట్లోకి రాజ్, కావ్య వస్తారు. శీనుగాడి గురించి రేవతి దగ్గర ఆరా తీస్తూ.. వాడి వల్ల తన చెల్లి అప్పూ ప్రమాదంలో పడిందని కావ్య చెబుతుంది.
అంతకుముందే అతనితోనే గొడవ పడ్డామని, అతడే శీను అని తెలుసుకోలేదని తెలుసుకుంటారు. అతని ఇల్లు పక్కనే అంటూ అక్కడికి వాళ్లను తీసుకెళ్తుంది రేవతి. ఇంట్లో అతని తల్లి ఉంటుంది. ఆమెతో శీను చేసిన దారుణం గురించి ముగ్గురూ చెబుతారు. అతనికి వెంటనే ఫోన్ చేసి రప్పించాలని కావ్య అడుగుతుంది. ఒకవేళ అప్పూ బయటకు వస్తే శీనుగాడిని జీవితాంతం జైల్లోనే ఉంచేలా చేస్తుందని కూడా ఆమె తల్లిని కావ్య హెచ్చరిస్తుంది.
శీనుగాడు కిడ్నాప్
కావ్య మాటలతో భయపడిన శీను తల్లి వెంటనే అతనికి ఫోన్ చేస్తుంది. అప్పటికే అతడు యామిని చెప్పిన చోటుకి వెళ్తాడు. అక్కడ తన ఫోన్ మోగగానే పక్కనే ఉన్న వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. శీనుగాడిని కిడ్నాప్ చేశామని అంటాడు. దీంతో అతని తల్లి కంగారు పడుతుంది.
తాము ఎవరం అన్నది తర్వాత చెబుతామంటూ ఫోన్ కట్ చేసి స్విచ్ఛాఫ్ చేస్తాడు. ఇదే విషయం రాజ్, కావ్యలతో అతని తల్లి చెబుతుంది. ఇది కచ్చితంగా యామిని పనే అయి ఉంటుందని కావ్య లోలోపల సందేహిస్తుంది.
రాజ్, కావ్యలకు దొరికిపోయిన ఇందిరాదేవి
శీనుగాడు దొరక్కపోవడంతో రాజ్, కావ్య నిరాశపడుతూ అతని ఇంటి నుంచి బయటకు వచ్చేస్తారు. మరోసారి అతనికి ఫోన్ చేయాలని రేవతితో రాజ్ అంటాడు. తాను చేస్తూనే ఉన్నానని, స్విచ్ఛాఫ్ వస్తుందని చెబుతుంది. ఇంతలో రేవతి ఇంటి నుంచి ఇందిరాదేవి భయపడుతూ బయటకు వస్తుంది.
ఆ వీధి దాటితే వాళ్ల కంట పడకుండా వెళ్లిపోవచ్చని భావిస్తుంది. అప్పుడే రాజ్ ఆమెను చూస్తాడు. దొరికేసింది అని అంటాడు. ఎవరు శీనుగాడా అని కావ్య అంటుంది. కాదు నాన్నమ్మ అని రాజ్ అంటాడు. ఆమెను అక్కడ చూసి రేవతి షాక్ తింటుంది. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
అటు రేపటి ఎపిసోడ్ గురించి చివర్లో చూపించిన సీన్ చూస్తుంటే.. అప్పుకు శిక్ష తప్పేలా కనిపించడం లేదు. శీనుగాడి దగ్గరికి వెళ్లిన యామిని నిన్ను ఆ అప్పూయే దాచిందని చెబితే జడ్జి ఆమెకు రెండు శిక్షలు వేస్తాడని చెబుతుంది.

E-Paper












