Casting Couch: టాలీవుడ్‌లో మళ్లీ 'కాస్టింగ్ కౌచ్' కలకలం.. ఎన్ఆర్ఐ యువతి సంచలన ఆరోపణలు.. రంగంలోకి దిగిన యాంకర్ ఝాన్సీ!
Casting Couch: టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అవకాశాల పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యానంటూ న్యూయార్క్‌కు చెందిన ఓ ఎన్ఆర్ఐ యువతి చేసిన ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఈ వ్యవహారంపై నటి, యాంకర్ ఝాన్సీ తక్షణమే స్పందించి బాధితురాలికి అండగా నిలిచారు.
సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు చర్చకు వచ్చే 'కాస్టింగ్ కౌచ్' (Casting Couch) భూతం మరోసారి టాలీవుడ్‌ను కుదిపేస్తోంది. గతంలో ఎందరో నటీమణులు తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకోగా, తాజాగా ఒక తెలుగు ఇన్‌ఫ్లుయెన్సర్ చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో దావానంలా వ్యాపిస్తున్నాయి. అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో ఒక ప్రముఖ నిర్మాత పేరుతో తనకు ఎదురైన వేధింపుల గురించి ఆమె వీడియో విడుదల చేయడం చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.

న్యూయార్క్ అమ్మాయికి చేదు అనుభవం
న్యూయార్క్‌లో ఉంటున్న 'పికు నెమలి' (Piku Nemali) అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్, తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ చేదు అనుభవాన్ని వీడియో రూపంలో పంచుకున్నారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. తనకు తెలిసిన వారి ద్వారా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పరిచయం అయ్యారు. సినిమాల్లో నటించాలనే ఆసక్తితో ఆమె తన వివరాలను అతనికి పంపారు.
ఆ తర్వాత జరిగిన ఫోన్ సంభాషణలో కమిట్‌మెంట్ గురించి అడిగితే.. పని పట్ల తనకు ఉన్న నిబద్ధత గురించి అడుగుతున్నారేమో అనుకున్నట్లు చెప్పింది. అయితే ఆ వ్యక్తి కొద్దిరోజుల తర్వాత ఆమెకు ఫోన్ చేసి, టాలీవుడ్‌కు చెందిన ఒక ప్రముఖ నిర్మాతను కలవాలని, అందుకోసం ఇండియాలోని ఒక రిసార్ట్‌కు రావాలని ఆహ్వానించారు.
ఆ ఆహ్వానం వెనుక ఉన్న అసలు ఉద్దేశం, సదరు నిర్మాత కోరుతున్న లైంగిక వేధింపుల గురించి తెలుసుకున్న ఆ యువతి షాక్‌కు గురయ్యారు. వెంటనే ఆ వ్యక్తిని బ్లాక్ చేసినట్లు ఆమె తెలిపారు. ఇలాంటి దిగజారిన సంస్కృతి వల్లే ఎంతోమంది ప్రతిభావంతులైన తెలుగు అమ్మాయిలు టాలీవుడ్‌లోకి రావడానికి భయపడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
అండగా నిలిచిన యాంకర్ ఝాన్సీ
ఈ వీడియో వైరల్ కావడంతో టాలీవుడ్ సీనియర్ నటి, యాంకర్ ఝాన్సీ వెంటనే స్పందించారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోని 'లైంగిక వేధింపుల పరిష్కార కమిటీ' (Sexual Harassment Redressal Panel) సభ్యురాలిగా ఉన్న ఆమె.. బాధితురాలిని సంప్రదించారు. ఈ ఘటనపై అధికారికంగా ఫిర్యాదు చేయాలని కోరుతూ, మహిళా కమిటీ తరపున పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. అవకాశాల వేటలో ఇలాంటి వేధింపులు ఎదురైతే కమిటీ కచ్చితంగా చర్యలు తీసుకుంటుందని ఝాన్సీ భరోసా ఇచ్చారు. బాధితురాలికి అండగా నిలిచిన ఝాన్సీ చొరవను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
అయితే ఈ ఆరోపణల వెనుక ఉన్న ఆ 'ప్రముఖ నిర్మాత' ఎవరు? ఆ అసిస్టెంట్ డైరెక్టర్ పేరును బయటపెడతారా? అనే విషయాలపై ఉత్కంఠ నెలకొంది. చట్టపరమైన చిక్కుల వల్ల తాను ఆ నిర్మాత పేరును బయటకు చెప్పడం లేదన్న ఆమె.. క్యాప్షన్ లో మాత్రం పాపులర్ నిర్మాతే అని చెప్పడం గమనార్హం. కమిటీ విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటుందో లేదో వేచి చూడాలి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


