సాధారణంగా థియేటర్లలో విడుదలైన కొన్ని రోజులకు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంటాయి. మరికొన్ని సార్లు చాలా అరుదుగా ఓటీటీలో సూపర్ హిట్ అయిన సినిమాలను థియేటర్లలో విడుదల చేస్తుంటారు. ఇలా కాకుండా మొదట బుల్లితెరపై అంటే టీవీల్లో ప్రసారం చేసిన తర్వాత ఓటీటీరిలీజ్ చేస్తుంటారు.
ఆ ఓటీటీలోనే
కాకపోతే, ఓటీటీ ప్లాట్ఫామ్స్ నుంచి ఒరిజనల్ సినిమాలుగా, వెబ్ సిరీస్‌లుగా తెరకెక్కిన ఏదైనా సరే ఆ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థలోనే రిలీజ్ అవుతుంటాయి. కానీ, ఫర్ ది ఫస్ట్ టైమ్ ఓటీటీ సంస్థ ఒరిజినల్ సినిమాగా తెరకెక్కి ఆ ఓటీటీలో కాకుండా ముందుగా థియేటర్లలో విడుదల కానుంది ఓ సినిమా.
అత్యంత అరుదైన కాన్సెప్ట్
ఆ తెలుగు సినిమానే లిటిల్ హార్ట్స్. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్ ఈ అత్యంత అరుదైన కాన్సెప్ట్‌ను తీసుకొచ్చింది. ఈటీవీ విన్ ఒరిజినల్ సినిమాగా లిటిల్ హార్ట్స్ సినిమాను నిర్మించనున్నారు. కానీ, ఈ మూవీని నేరుగా ఓటీటీలో కాకుండా థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఆ తర్వాతే లిటిల్ హార్ట్స్ ఓటీటీ రిలీజ్ కానుంది.
ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్
అయితే, లిటిల్ హార్ట్స్ థియేట్రికల్ రిలీజ్, ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వివరాలు ఇంకా ప్రకటించలేదు. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ అంటూ లిటిల్ హార్ట్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తాజాగా సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఆ పోస్టర్‌కు "నో టచింగ్.. ఓన్లీ హార్ట్ టచింగ్.. నో పోస్టర్.. ఓన్లీ పేపర్" అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
హీరో హీరోయిన్స్
అలాగే, లిటిల్ హార్ట్స్ థియేటర్లలో విడుదల కానున్నట్లు పోస్టర్‌లో వెల్లడించారు. కాగా, 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ ఓటీటీ సిరీస్తో మంచి క్రేజ్ తెచ్చుకున్న యువ నటుడు మౌళి, అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ హీరోయిన్ శివానీ నాగారం ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
కోచింగ్ సెంటర్ల కోర్సులతో
ఈ ఇద్దరితోనే లిటిల్ హార్ట్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఉంది. ఆ పోస్టర్‌లో పలు కోచింగ్ సెంటర్ల కోర్సులతో నిండి ఉన్న ప్రాంప్లెట్స్ ఉన్నాయి. మౌళి, శివానీ నాగారం తమ చేతులతో లవ్ సింబల్ చూపిస్తూ పోజు ఇచ్చారు. అయితే, లిటిల్ హార్ట్స్ సినిమాను కోచింగ్ సెంటర్ల నేపథ్యంతో యూత్‌ఫుల్ అంశాలతో తెరకెక్కించినట్లు పోస్టర్ ద్వారా తెలుస్తోంది.