చంద్రబాబుపై బండ్ల గణేశ్ అభిమానం మరువలేనిది - నారా భువనేశ్వరి

సినీ నిర్మాత బండ్ల గణేశ్ కుటుంబ సమేతంగా సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని కలిశారు. తిరుమలకు చేపట్టిన సంకల్ప యాత్ర గురించి భువనేశ్వరి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబుపై బండ్ల గణేశ్ అభిమానం మరువలేనిదంటూ.. భువనేశ్వరి ట్వీట్ చేశారు.

Feb 14, 2026, 19:05:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తిరుమలకు చేపట్టిన ‘సంకల్ప యాత్ర’ పూర్తి అయిన సందర్భంగా సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌… సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని కలిశారు. యాత్ర పూర్తి అయిన తర్వాత శ్రీవారిని దర్శినం చేసుకున్న బండ్ల గణేశ్… సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ను కూడా కలిశారు. వారికి శ్రీవారి ప్రసాదాన్ని అందజేశారు. అయితే శుక్రవారం నారా భువనేశ్వరిని కుటుంబసమేతంగా కలిశారు.

నారా భువనేశ్వరితో బండ్ల గణేశ్
నారా భువనేశ్వరితో బండ్ల గణేశ్

“నవ్యాంధ్ర నాయకుడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి శ్రీమతి భువనేశ్వరి గారిని కుటుంబ సమేతంగా కలిశాను. వారి నుంచి ఆశీర్వాదాలు తీసుకున్నాను. ప్రతి నిత్యం రాష్ట్ర ప్రజలకు అండగా, పార్టీ కార్యకర్తలకు అభిమానులకు నైతిక ధైర్యం అందించి తోడుగా నిలిచిన తల్లి భువనేశ్వరి నా సంకల్ప యాత్ర గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు” అంటూ బండ్ల గణేశ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.

అభిమానం మరువలేనిది - భువనేశ్వరి ట్వీట్

ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కూడా ఎక్స్ లో ఓ పోస్ట్ చేశారు. “సంకల్ప పాదయాత్ర విజయవంతంగా పూర్తి చేసి కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు తీసుకుని వచ్చిన సినీ నిర్మాత బండ్ల గణేష్ కుటుంబసమేతంగా కలవడం సంతోషం కలిగించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ఆయన చూపిన అభిమానం మరువలేనిది. ఆ దేవదేవుడి కరుణాకటాక్షాలు వారిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని పేర్కొన్నారు. నారా భువనేశ్వరి చేసిన ట్వీట్ కు బండ్ల గణేశ్ రిప్లే ఇచ్చారు. మీ అభిమానానికి సదా కృతజ్ఞుడిని, అమ్మా అంటూ రాసుకొచ్చారు.

సంకల్ప యాత్ర పూర్తి…

గత ప్రభుత్వ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. ఆయన జైలు నుంచి సురక్షితంగా బయటకు వస్తే హైదరాబాద్‌ నుంచి తిరుమల వస్తానని సినీ నిర్మాత బండ్ల గణేశ్ శ్రీవారికి మొక్కుకున్నారు.

తన మొక్కును చెల్లించుకోవటం కోసం జనవరి 19న షాద్‌నగర్ నుంచి సంకల్ప యాత్ర పేరుతో బండ్ల గణేశ్ పాదయాత్రను ప్రారంభించారు. 23 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగింది. పలు గ్రామాలు, పట్టణాలను దాటుకుంటూ తిరుమల శ్రీవారి సన్నిధికి చేరుకున్నారు. మార్గమధ్యంలో రాజకీయ నాయకులతో పాటు అభిమానులు ఆయనకు స్వాగతం పలికారు. కూటమిలో ఉన్న పార్టీల నాయకులు… తమ అనుచరులతో కలిసి కొంత మేర బండ్ల గణేశ్ తో కలిసి పాదయాత్ర కూడా చేశారు.

టాలీవుడ్ ప్రముఖ హీరో విశ్వక్ సేన్ కూడా…. బండ్ల గణేశ్ సంకల్ప యాత్రలో పాల్గొన్నారు. బండ్ల గణేశ్ తో కలిసి కొద్ది దూరం నడిచాడు. యాత్ర పూర్తి అయిన తర్వాత తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్నారు.

టీడీపీలోకి వెళ్తారా..?

ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్న బండ్ల గణేశ్.. గతంలో కాంగ్రెస్ లో యాక్టివ్ గా ఉన్నారు. షాద్ నగర్ నుంచి పోటీ చేయాలనుకున్నారు. కానీ పార్టీలోని సమీకరణాల మధ్య అవకాశం దక్కలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత….. కాంగ్రెస్ పార్టీకి దూరంగానే ఉంటన్నారు. అయితే తాజాగా చంద్రబాబు కోసం పాదయాత్ర చేయగా… ఆయన టీడీపీలో చేరే అవకాశం ఉందన్న వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. అయితే బండ్ల గణేశ్ నుంచి మాత్రం ఎలాంటి ప్రకటన అయితే ఇప్పటివరకు రాలేదు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More