Gunde Ninda Gudi Gantalu Today Episode: నిండా మునిగిన మనోజ్, రోహిణి.. కొంప ముంచిన సత్యం కొబ్బరి బోండాం.. ఆడుకున్న బాలు
Gunde Ninda Gudi Gantalu Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ మే 6 ఎపిసోడ్ లో మనోజ్, రోహిని నిండా మునుగుతారు. విల్లా అసలు ఓనర్ వచ్చి వాళ్లను మెడపట్టుకొని బయటకు గెంటేస్తాడు. దీంతో బాలు మరోసారి మనోజ్ తో ఆడుకుంటాడు.
Gunde Ninda Gudi Gantalu Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో మనోజ్, రోహిణి అండ్ ఫ్యామిలీని విల్లా నుంచి తరిమేస్తాడు అసలు ఓనర్. దీంతో మరోసారి తాను రూ.30 లక్షలు మోసపోయానని మనోజ్ తెలుసుకుంటాడు. అదే అదునుగా బాలు, సత్యం అతనితో ఆడుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

విల్లా, మనోజ్ గురించి తెగ పొగిడేసిన ప్రభావతి
గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (మే 6) ఎపిసోడ్ ప్రభావతి, సత్యం మార్నింగ్ వాక్ చేసే సీన్ తో మొదలవుతుంది. ఆ సమయంలో విల్లా గురించి, మనోజ్ గురించి గొప్పగా మాట్లాడుతుంది ప్రభావతి. తమ సొంతింటి గురించి తక్కువ చేసి చూస్తుంది. సత్యం అలా మాట్లాడొద్దని చెప్పినా వినదు. మనోజ్ ఎంతో గొప్పవాడని అంటుంది. అది విన్న సత్యం.. నువ్వు వాడిని పొగిడినప్పుడల్లా తనకు భయం వేస్తుందని అంటాడు.
ఓనర్‌కు అసలు నిజం చెప్పేసిన కొబ్బరి బోండాం అమ్మే వ్యక్తి
ఆ తర్వాత ఇద్దరూ కొబ్బరి బోండాం తాగుదామని వెళ్తారు. ఈ ఏరియాలో మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదే అని అతడు అంటాడు. కొత్తగా వచ్చామని, వీధి చివరన ఉన్న విల్లా కొన్నామని సత్యం చెబుతాడు. రూ.3 కోట్లు పెట్టి కొన్నామని ప్రభావతి గొప్పగా చెప్పుకుంటుంది. అది విని కొబ్బరి బోండా అమ్మే వ్యక్తి అయోమయానికి గురవుతాడు. ఏదైనా సమస్యా అని సత్యం అడుగుతాడు. ఏమీ లేదని అతడు అంటాడు. వాళ్లు వెళ్లిపోయిన తర్వాత అసలు ఓనర్ కు ఫోన్ చేసి విషయం చెబుతాడు.
రిజిస్ట్రేషన్ ఆఫీసులో కల్పన.. మనోజ్, రోహిణి కూడా..
ఇటు కల్పనను బాలు రిజిస్ట్రేషన్ ఆఫీసుకు తీసుకెళ్తాడు. తాను పని చూసుకొని వస్తానని ఆమె లోనికి వెళ్తుంది. ఆ వెంటనే మనోజ్, రోహిణి కూడా ఆఫీసుకు వస్తారు. వాళ్ల వెంట మణికంఠ కూడా ఉంటాడు. అప్పుడే అతడు బాలుని చూస్తాడు. విల్లా రిజిస్ట్రేషన్ ఛార్జీల గురించి అడుగుదామని వచ్చినట్లు వాళ్లు చెబుతారు. తర్వాత లోనికి వెళ్తారు. అక్కడ కల్పన.. మనోజ్, రోహిణిలను చూస్తుంది. వెంటనే చిరాకు పడుతూ అక్కడి నుంచి బయటకు వెళ్లిపోతుంది.
మనోజ్‌ను చూసి వెళ్లిపోయిన కల్పన.. బాలు, మీనాకి గిఫ్ట్
బయటకు వచ్చిన తర్వాత బాలుని కారు తీయమని అంటుంది. త్వరగా వచ్చేశారేంటి అని బాలు అడిగితే.. అక్కడ కొన్ని చూడకూడని ముఖాలు చూశానని చెబుతుంది. తర్వాత ఆమెను ఇంటికి తీసుకెళ్తాడు బాలు. అప్పుడు తాను విదేశాల నుంచి తీసుకొచ్చిన కూలింగ్ గ్లాస్ లను బాలుకి ఇస్తుంది కల్పన. మీ ఆవిడకు కూడా తీసుకొచ్చానని మీనా కోసం కూడా ఇస్తుంది. అవి చూస్తే అంత ఖరీదైనవి ఎందుకని మా ఆవిడ తిడుతుందని, మీరు గిఫ్ట్ గా ఇచ్చినట్లు ఓ సెల్ఫీ తీసుకుంటానని కల్పనతో బాలు సెల్ఫీ తీసుకుంటాడు.
మనోజ్, రోహిణికి దిమ్మదిరిగే షాకిచ్చిన ఓనర్..
ఇటు విల్లా బయట నేమ్ ప్లేట్ ఆర్డర్ గురించి మనోజ్, రోహిణి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అసలు ఓనర్ వస్తాడు. పోలీసులకు ఫోన్ చేసి తమ ఇంటిని ఎవరో కబ్జా చేశారని, వెంటనే వచ్చి ఖాళీ చేయించాలని చెబుతాడు. ఆ ఓనర్ ను చూసి మనోజ్, రోహిణి మొదట నేమ్ ప్లేట్ తీసుకు వచ్చిన వ్యక్తి అనుకుంటారు.
ఆ తర్వాత అతడే అసలు ఓనర్ అని తెలుసుకొని షాక్ తింటారు. మీకు ఇల్లు అమ్మిన వ్యక్తి ఈ ఇంట్లో అద్దెకు ఉండేవాడని, తనకు రెండు నెలలుగా అద్దె ఇవ్వలేదని చెబుతాడు. తమకు ముందు నుంచీ డౌట్ గానే ఉందని బాలు, రవి అంటారు. ఆ మాట విని మనోజ్, రోహిణి షాక్ తింటారు.
పోలీసులను పిలిచి ఇల్లు ఖాళీ చేయించిన ఓనర్
ఇక మీ డబ్బులు మీకు తిరిగి రావని, వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్లాలని ఓనర్ స్పష్టం చేస్తాడు. దీంతో రోహిణి కళ్లు తిరిగి పడిపోయినంత పని చేస్తుంది. వాళ్లతో గొడవ పడే బదులు వెంటనే వెళ్లిపోదాం అని మీనా అంటుంది. రూ.30 లక్షలు మునిగామని మనోజ్, రోహిణి బాధపడతారు. అందరూ కలిసి బాధతో విల్లా నుంచి బయటకు వెళ్తారు.
మనోజ్, ప్రభావతి పరువు తీసిన బాలు
తమ ఇంటికి తిరిగి రాగానే మనోజ్ పరువు తీస్తాడు బాలు. ఇంత చిన్న ఇంట్లో మీరు ఉండగలా.. మీ విల్లా కిచెనే ఈ ఇల్లంత ఉంటుంది కదా అని దెప్పిపొడుస్తాడు. అటు ప్రభావతి, రోహిణిలతోనూ ఆడుకుంటాడు. ఇంట్లోకి వెళ్లిన తర్వాత మనోజ్ కు సత్యం క్లాస్ పీకుతాడు. మమ్మల్ని నిండా ముంచడానికే పుట్టావు కదరా అని మండిపడతాడు. ఆశకుపోయి లక్షలకు లక్షలు తగిలేస్తున్నావని తిడతాడు. అంతటితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


