గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: బాలు తప్పు చేయలేదని నిరూపించిన మీనా.. అన్నయ్యను కాపాడిన మౌనిక.. గుణ కుట్ర బట్టబయలు
గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (ఆగస్టు 20) ఎపిసోడ్ లో బాలు ఒంటరి వాడైపోవడం చూడొచ్చు. అతన్ని మీనా, సత్యం సహా అందరూ నిందిస్తారు. అయితే చివరికి తప్పు తెలుసుకున్న మీనా అసలు ఏం జరిగిందన్న నిజం వెలికి తీస్తుంది.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 492వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. బాలు తాగాడంటూ ఇంట్లో వాళ్లు అందరూ నిందిస్తారు. మీనా, సత్యం కూడా అతడు చెప్పిన మాట వినరు. అయితే బాలుని కాపాడుతుంది చెల్లి మౌనిక. ఆ తర్వాత ఏం జరిగిందో ఒకసారి చూద్దాం.

అత్తను నిలదీసిన మీనా
గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (ఆగస్టు 20) ఎపిసోడ్ మీనాను ప్రభావతి నిలదీసే సీన్ తో మొదలవుతుంది. భార్యగా అతన్ని కంట్రోల్ చేయలేదు కాబట్టే ఇలా తాగుబోతుగా మారాడని అంటుంది. దీంతో మీనా కోపం కట్టలు తెంచుకుంటుంది. ప్రభావతిపై విరుచుకుపడుతుంది. నేను తాగుబోతు భార్యనైతే మీరు తాగుబోతు తల్లా అని అడుగుతుంది. తాను ఇంట్లోకి వచ్చి కొంతకాలమే అయిందని, మీ కొడుకు తాగకుండా పెంచడం మీకు చేతకాలేదా అని నిందిస్తుంది. అటు సత్యం కూడా మీనాకు సపోర్ట్ చేస్తాడు. తప్పు చేసింది బాలు అయితే మీనాను ఎందుకు నిలదీస్తున్నావని ప్రభావతిని తిడతాడు.
ప్రభావతిని దెప్పిపొడిచిన శృతి తల్లి
అప్పుడే ప్రభావతికి శృతి తల్లి శోభ ఫోన్ చూసి దెప్పిపొడుస్తుంది. బాధలో ఉన్నారా? ఆనందంలో ఉన్నారా? ఆందోళనలో ఉన్నారా? అలాంటి కొడుకును ఎలా భరిస్తున్నారు? మీరే కాదు.. మీ ఇంటికి అమ్మాయిని ఇచ్చినందుకు తాము కూడా మాటలు పడాల్సి వస్తోందని శోభ నానా మాటలు అంటుంది. ఏం చేస్తాం.. అంతా నా తలరాత వదిన అంటూ ప్రభావతి బాధపడుతుంది. దీంతో శృతి ఫోన్ తీసుకొని తల్లికి క్లాస్ పీకుతుంది. ఇప్పటి వరకూ ఇంట్లో అయిన పంచాయితీ చాలదా నువ్వు ఫోన్ చేశావ్.. పెట్టెయ్ అంటూ సీరియస్ అవుతుంది.
బాలుపైకి చెయ్యెత్తిన సత్యం
ఆ తర్వాత బాలు ఇంటికి వస్తాడు. అందరూ అదోలా ఉండటం చూసి ఎవరు పోయారని తనదైన స్టైల్లో అడుగుతాడు. నువ్వు నా పార్క్ సీన్ చూపించినట్లే నీ బారు, కారు సీన్ చూపించినట్లు మనోజ్ చెబుతాడు. మనోజ్, రోహిణి కలిసి బాలుతో ఆడుకుంటారు. దీంతో బాలు కోపంగా అతన్ని కొట్టబోగా.. సత్యం అడ్డుకొని బాలుపైకి చెయ్యెత్తుతాడు. తాను తాగలేదని చెబుతున్నా ఎవరూ వినరు.
చిన్నప్పటి నుంచే వీడిని మీరు కొట్టి ఉంటే ఇలా అయి ఉండేవాడు కాదని ప్రభావతి రెచ్చగొడుతుంది. అందరి ముందూ నా పరువు తీశావంటూ బాలును సత్యం కూడా నానా మాటలు అంటాడు. కొట్టు నాన్న.. నీ మాటలతో నా గుండెల్లో అయిన గాయం కంటే ఇదేమీ ఎక్కువ కాదు అని బాలు అంటాడు. అటు మీనాకు కూడా తాను తాగలేదని చెప్పినా వినదు. రవి, శృతి కూడా చెప్పింది నమ్మకుండా వెళ్లిపోతారు. దీంతో బాలు ఒంటరి వాడైపోతాడు.
మౌనికకు వీడియో చూపించిన సంజూ
అటు బాలు ఎదుర్కొంటున్న పరిస్థితి చూసి సంజూ తెగ ఆనందిస్తాడు. ఆ వీడియోను మౌనికకు కూడా చూపిస్తాడు. మీ అన్నయ్య ఏదో ఉత్తముడు అని చెబుతావు కదా.. చూడు ఏం చేశాడో అని అంటాడు. అయినా మౌనిక మాత్రం నమ్మదు. కళ్లతో చూసేవన్నీ నిజం కాదు అని వాదిస్తుంది. తన అన్నయ్య ఎలాంటి తప్పు చేయడు అని సంజూతో స్పష్టం చేస్తుంది.
బాలు చెప్పినా వినని మీనా
ఇటు మీనా దగ్గరికి మరోసారి వెళ్లి బాలు తాను తాగలేదని చెబుతాడు. అయినా మీనా నమ్మదు. అన్ని విషయాల్లో మారినా.. ఈ విషయంలో మాత్రం మీరు మారలేదని మీనా అంటుంది. అబద్ధాలు చెప్పొద్దని బాలుని నిందిస్తుంది. అప్పుడు శివ చేయి విరగ్గొట్టినప్పుడు కూడా అబద్ధమే చెప్పారని అంటుంది. ఆ విషయం వదిలెయ్ మీనా.. ఇప్పుడు మాత్రం తాను తాగలేదు అని బాలు ఎంత బతిమాలినా మీనా వినదు. సరే ఎవరు నమ్మినా నమ్మకపోయినా తానేంటో తనకు తెలుసని బాలు వెళ్లిపోతాడు. అయితే మీనాలో సందేహం మొదలవుతుంది.
బాలుని ఓదార్చిన ఫ్రెండ్స్, మౌనిక
అటు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లిన బాలు ఇంట్లో జరిగిన విషయం చెబుతాడు. తన తండ్రి కొట్టబోయాడని, మీనా కూడా తాను చెప్పింది వినడం లేదని అంటాడు. ఫ్రెండ్స్ అతన్ని ఓదారుస్తారు. నువ్వు ట్రిప్ కు వెళ్లినప్పుడు, పగటి సమయంలో తాగవని మాకు తెలుసు అంటారు. మీరైనా నన్ను నమ్మినందుకు థ్యాంక్స్ అని బాలు అంటాడు. అప్పుడే మౌనిక అతనికి ఫోన్ చేస్తుంది.
నువ్వు కూడా మీ వదినలాగే నన్ను అనుమానిస్తున్నావా అని బాలు అనడంతో.. నీ మీద నమ్మకం ఉందన్నయ్యా.. నువ్వు తప్పు చేయవని తెలుసు అని బాలుని మౌనిక ఓదారుస్తుంది. ఫోన్ పెట్టేసిన తర్వాత నా ఇంట్లో ఒక్కరైనా నా మాట నమ్మినందుకు సంతోషంగా ఉందని ఫ్రెండ్స్ తో బాలు అంటాడు. నీ విషయంలో ఏదో కుట్ర జరిగిందనిపిస్తోంది.. అసలు ఆ వీడియో ఎవరు తీశారో కనిపెట్టాలని ఫ్రెండ్స్ అంటారు.
మీనాను రెచ్చగొట్టిన గుణ
పూలు డెలివరీ చేయడానికి వెళ్లిన మీనాను చూసి ఆగుతాడు గుణ. నువ్వు గ్రేట్ అక్క.. మీ ఆయన వీడియో అంత వైరల్ అవుతున్నా ఏమీ జరగనట్లు నీ బిజినెస్ నువ్వు చేసుకుంటున్నావని అంటాడు. అతన్ని కొట్టడానికి వెళ్తుంది మీనా. నేను తాగుబోతు అని.. శివను నాతో తిరగొద్దని చెప్పావు.. ఆ విషయం నాకు కాదు.. వెళ్లి మీ ఆయనకు చెప్పు అంటూ మీనాను గుణ దెప్పి పొడుస్తాడు.
ఇంతలో మౌనిక మీనాకు ఫోన్ చేసి బాలు అన్నయ్య అలా చేయడని చెప్పడంతో ఆమెలో అనుమానం మరింత ఎక్కువవుతుంది. దీంతో బాలు విషయంలో అసలు ఏం జరిగిందో తెలుసుకోవానికి బయలుదేరుతుంది. బార్ కు కూడా వెళ్తుంది. అక్కడి వాళ్లతో మాట్లాడి అసలు నిజం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. దీంతో గుణ కుట్ర బయటపడేలా కనిపిస్తుంది. అంతటితో ఇవాళ్టి ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper



