నా కాళ్లూ, చేతులు విరిగిపోయాయి.. ఎవరూ సాయం చేయలేదు.. ఇప్పుడిప్పుడే గిటార్ ప్లే చేస్తున్నా..: ఇండియన్ ఐడల్ విన్నర్
ఇండియన్ ఐడల్ 12 విన్నర్, స్టార్ సింగర్ పవన్‌దీప్ రాజ్ ఆరు నెలల కిందట జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం గురించి తొలిసారి మాట్లాడాడు. ఇప్పుడిప్పుడే పూర్తిగా కోలుకుంటున్న అతడు.. అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలిపాడు.
ఇండియన్ ఐడల్ 12 విజేత పవన్‌దీప్ రాజన్ దాదాపు ఏడు నెలల తర్వాత మళ్లీ ప్రజల ముందుకు వచ్చాడు. ఈ ఏడాది మే నెలలో ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం అతని జీవితాన్ని తలకిందులు చేసింది. ఆ ప్రమాదంలో రెండు కాళ్లు విరిగిపోవడంతో పాటు, కుడి చేయి, తలకు తీవ్ర గాయాలయ్యాయి. పలు సర్జరీలు చేసిన తర్వాత కోలుకున్న పవన్‌దీప్.. తాజాగా సలీం-సులేమాన్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొని ఆ భయానక క్షణాలను గుర్తు చేసుకున్నాడు. ఆ కష్టకాలాన్ని ఒక పాఠంగా ఎలా మలుచుకున్నాడో వివరించాడు.

కారులో మంటలు, సాయం కోసం ఎదురుచూపులు
ప్రమాదం జరిగిన తీరును వివరిస్తూ పవన్‌దీప్ భావోద్వేగానికి లోనయ్యాడు. “మొదట్లో మాకు ఎవరూ సహాయం చేయలేదు. ఆ తర్వాత పోలీసులు వచ్చారు. అప్పటికే కారులో మంటలు చెలరేగాయి. నేను ఆ మంటల్లో చిక్కుకున్న కారు లోపలే ఉన్నాను. వాళ్ళలో ఒకరు నన్ను బయటకు లాగారు” అని పవన్‌దీప్ చెప్పాడు.
"నేను ఎంతసేపు లోపల ఉన్నానో నాకు తెలియదు. కానీ కళ్ళు తెరిచేసరికి కారు బయట ఉన్నాను. ఆ తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లారు. నా రెండు కాళ్లు, ఒక చెయ్యి విరిగిపోయాయి. వెంటనే ఇంటికి ఫోన్ చేసి మా కుటుంబ సభ్యులను రమ్మని చెప్పాను. వీలైనంత త్వరగా చికిత్స తీసుకోవాలనే ఆలోచన మాత్రమే అప్పుడు నాలో ఉంది. ఇప్పుడు అంతా కుదుటపడింది" అని పవన్‌దీప్ తెలిపాడు.
ఆ విలువ ఇప్పుడే తెలిసింది..
ప్రస్తుతం తన ఆరోగ్యం మెరుగుపడుతోందని పవన్‌దీప్ చెప్పాడు. “మొదటి నెలలో కనీసం పక్కకు కదలడానికి కూడా నాకు సాధ్యం కాలేదు. కానీ ఇప్పుడు కొంచెం నడవగలుగుతున్నాను. అది నాకు ఎంతో సంతోషాన్నిస్తోంది. నడవగలగడం అనేది ఎంత గొప్ప వరమో ఈ అనుభవం నాకు నేర్పింది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వాటిని అంగీకరించి, సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలి” అని అతడు అన్నాడు.
"నెమ్మదిగా నడవడం ప్రారంభించాను. వచ్చే నెలలో నా కదలికలు మరింత మెరుగుపడతాయని ఆశిస్తున్నాను. ప్రమాదం తర్వాత మంచానికే పరిమితమయ్యాను. చికిత్స కోసం గాయపడిన కాలుతో ముంబై వెళ్లినప్పుడు కూడా మరో నెల రోజుల పాటు కదలకుండా ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు మెల్లగా నడుస్తున్నాను. మళ్లీ గిటార్ వాయించడం కూడా మొదలుపెట్టాను. నా చేతికి బలం వచ్చింది కానీ పూర్తిగా కోలుకోవడానికి ఇంకా సమయం పడుతుంది" అని వివరించాడు.
అసలేం జరిగింది?
ఈ ఏడాది మే 5న పవన్‌దీప్ రాజన్ లైవ్ షో కోసం అహ్మదాబాద్ వెళ్లేందుకు ఢిల్లీ విమానాశ్రయానికి కారులో బయలుదేరాడు. మొరాదాబాద్ సమీపంలో తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అతని కారు రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. మొదట దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ, మెరుగైన చికిత్స కోసం ఢిల్లీ ఎన్‌సీఆర్‌లోని ఆసుపత్రికి మార్చి పలు శస్త్రచికిత్సలు చేశారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


