James Cameron: ఓటీటీలో సీక్రెట్స్ ఆఫ్ ది బీస్- తేనెటీగల రహస్యాలపై జేమ్స్ కామెరాన్ డాక్యుమెంటరీ- స్ట్రీమింగ్ ఎక్కడంటే?
James Cameron Documentary Series Secrets Of The Bees: ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్ కామెరాన్ నిర్మాణంలో రూపొందిన డాక్యుమెంటరీ సిరీస్ 'సీక్రెట్స్ ఆఫ్ ది బీస్'. తేనెటీగల జీవనశైలి, వాటి సామాజిక నిర్మాణం వెనుక ఉన్న విస్తుపోయే నిజాలను ఈ ఓటీటీ సిరీస్ ప్రపంచానికి పరిచయం చేస్తోంది.
తేనెటీగ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది తేనె, లేదా అది కుడితే కలిగే మంట. కానీ, వాటికి కూడా మనుషుల తరహాలోనే ఒక సంక్లిష్టమైన నాగరికత, సంస్కృతి ఉంటాయని మీకు తెలుసా? 'అవతార్', 'టైటానిక్' వంటి అద్భుత దృశ్యకావ్యాలను అందించిన జేమ్స్ కామెరాన్ ఇప్పుడు మన కంటికి కనిపించని తేనెటీగల అంతరంగిక ప్రపంచాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు.
నేషనల్ జియోగ్రాఫిక్ రూపొందించిన 'సీక్రెట్స్ ఆఫ్ ది బీస్' అనే డాక్యుమెంటరీ సిరీస్‌కు ఆయన నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అవార్డు విన్నర్ వైల్డ్ లైఫ్ ఫిల్మ్ మేకర్ బెర్టీ గ్రెగొరీ ఈ అద్భుత యాత్రకు హోస్ట్‌గా వ్యవహరించారు.
తేనెటీగల కళ్లతో ప్రపంచం: ఒక వింత అనుభవం
ఈ ఓటీటీ సిరీస్ గురించి జరిగిన ఒక ప్రత్యేక చర్చా కార్యక్రమంలో జేమ్స్ కామెరాన్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. "నేను గతంలో తిమింగలాలు, ఆక్టోపస్‌ల జీవనశైలి గురించి తెలుసుకున్నప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. కానీ, ఈ తేనెటీగల ప్రపంచం అంతకు మించి ఉంది" అని ఆయన పేర్కొన్నారు. సాధారణంగా మనం ప్రకృతిని మన కోణంలో చూస్తాం. కానీ, ఈ డాక్యుమెంటరీ 'తేనెటీగ కంటి చూపు' (Bees-eye view) ద్వారా ప్రపంచం ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది.
ముఖ్యంగా మగ తేనెటీగలకు ఉండే భారీ కళ్ల వెనుక ఉన్న సైన్స్ గురించి కామెరాన్ వివరిస్తూ, "మగ తేనెటీగలు తమ జీవితంలో ఒకే ఒక్కసారి మాత్రమే ఆడ తేనెటీగతో జతకడతాయి. ఆ తర్వాత అవి మరణిస్తాయి. అందుకే ఆ ఒక్క అవకాశాన్ని తప్పు చేయకుండా ఉండటానికి, ఆడ ఈగల కంటే మగ ఈగలకు రెట్టింపు పరిమాణంలో కళ్లు ఉంటాయి. వాటి రెటీనాలో కణాల సంఖ్య కూడా ఎక్కువే" అని జేమ్స్ కామెరాన్ వివరించారు.
తేనెటీగలకు కూడా 'సంస్కృతి' ఉంటుందా?
సాధారణంగా తేనెటీగలు అంటే కేవలం ప్రోగ్రామ్ చేసిన రోబోల్లాగా (Roombas) పని చేస్తాయని అందరూ అనుకుంటారు. కానీ జేమ్స్ కామెరాన్ పరిశోధనలో మరో సంచలన విషయం బయటపడింది. తేనెటీగలు కేవలం సహజత్వంతోనే కాకుండా, తోటి ఈగల నుంచి పనులు నేర్చుకుంటాయట. ఒక పనిని ఎలా చేయాలో నేర్చుకుని, దాన్ని మళ్లీ చేసి చూపించే సామర్థ్యం వీటికి ఉంది.
"ఒక తరం నుంచి మరో తరానికి లేదా ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సమాచారం చేరడాన్ని మనం 'సంస్కృతి' (Culture) అంటాం. ఈ లెక్కన చూస్తే తేనెటీగలకు కూడా ఒక ప్రత్యేకమైన సంస్కృతి ఉంది" అని కామెరాన్ అభిప్రాయపడ్డారు. మనుషుల నాగరికతకు ఏమాత్రం తీసిపోని విధంగా ఇవి ఒక క్రమశిక్షణ కలిగిన సమాజంగా జీవిస్తాయి. మన చుట్టూ ఉండే పర్యావరణ వ్యవస్థలో ఇవి ఎంత కీలకమో ఈ ఓటీటీ సిరీస్ స్పష్టం చేస్తోంది.
ప్రకృతి రహస్యాల కోసం జేమ్స్ కామెరాన్ తపన
సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, జేమ్స్ కామెరాన్ ఇలాంటి డాక్యుమెంటరీల కోసం సమయం కేటాయించడం విశేషం. "నేను కేవలం ఈ సిరీస్‌ను ప్రమోట్ చేయడానికి మాత్రమే పనిచేయడం లేదు, నాలోని జిజ్ఞాస నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది. ఈ డాక్యుమెంటరీ ద్వారా నేను ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను. నిజానికి ఇలాంటి జ్ఞానం పొందుతున్నందుకు నేనే నేషనల్ జియోగ్రాఫిక్‌కు డబ్బులు చెల్లించాలి" అంటూ సరదాగా వ్యాఖ్యానించారు జేమ్స్ కామెరాన్.
ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో
కాగా, ప్రకృతి ప్రేమికులకు ఈ 'సీక్రెట్స్ ఆఫ్ ది బీస్' ఒక సరికొత్త అనుభూతిని కలిగిస్తుందని మేకర్స్ అభిప్రాయపడుతున్నారు. కాగా, ఈ సీక్సెట్స్ ఆఫ్ ది బీస్ డాక్యుమెంటరీ సిరీస్ ఓటీటీ కంటెంట్ సైతం అందించే టీవీ ఛానెల్ నేషనల్ జియోగ్రఫీలో ప్రసారం అవుతోంది. దీంతోపాటు జియో హాట్‌స్టార్, హులు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో కూడా ఈ సిరీస్ అందుబాటులో ఉంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


