మలయాళం సూపర్ హిట్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులో ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..
మలయాళం థ్రిల్లర్ మూవీ తెలుగులో ఓటీటీలోకి వస్తోంది. గత నెల థియేటర్లలో రిలీజై మంచి రివ్యూలు సంపాదించిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. ప్రముఖ నటుడు రోషన్ మాథ్యూ లీడ్ రోల్లో నటించాడు.
మలయాళ మూవీ 'రోంత్' (Ronth) త్వరలో డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమవుతోంది. ఈ ఆసక్తికరమైన థ్రిల్లర్ వచ్చే వారం నుండి ఐదు భాషలలో స్ట్రీమింగ్ కానుంది. ఇదో డిఫరెంట్ థ్రిల్లర్ సినిమా. నైట్ ప్యాట్రోలింగ్ చేసే ఇద్దరు పోలీసుల చుట్టూ తిరుగుతూ ఒక రాత్రిలో జరిగే స్టోరీ ఇది. మలయాళంలో రోంత్ అంటే గస్తీ అని అర్థం.

'రోంత్' ఓటీటీ రిలీజ్ డేట్
మలయాళం స్టార్ నటులైన రోషన్ మాథ్యూ, దిలీష్ పోతన్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ రోంత్. ఈ పోలీస్ డ్రామా, థియేట్రికల్ రన్ విజయవంతం అయిన తర్వాత ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియోహాట్స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. వచ్చే మంగళవారం (జులై 22) నుండి 'రోంత్' మూవీ జియోహాట్‌స్టార్ లోకి వస్తోంది. ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో కూడా అందుబాటులో ఉంటుంది. “గస్తీ ప్రారంభం కానుంది. రోంత్ జులై 22 నుంచి జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది” అనే క్యాప్షన్ తో ఆ ఓటీటీ శుక్రవారం (జులై 18) ట్వీట్ చేసింది.
థియేటర్లలో ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఓటీటీలో మరింత ఆదరణ దక్కే అవకాశాలు ఉన్నాయి. అందులోనూ తెలుగు సహా ఐదు భాషల్లో రానుండటంతో జియోహాట్‌స్టార్ లో హిట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక 'రోంత్'తో పాటు థియేటర్లలో విడుదలైన మరో మూవీ 'వ్యాసనాసమేతమ్ బంధుమిత్రాదిగల్' కూడా త్వరలో మనోరమ మ్యాక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
'రోంత్' మూవీ స్టోరీ, మిగతా వివరాలు
షాహీ కబీర్ దర్శకత్వం వహించిన మూవీ ఈ 'రోంత్'. అతడు గతంలో 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' 'ఎలా వీళా పూంచీరా' వంటి ప్రముఖ మలయాళీ పోలీస్ డ్రామాలను రూపొందించాడు. చాలా మంది ఈ రోంత్ సినిమాను "ఇప్పటివరకు షాహీ కబీర్ ఉత్తమ చిత్రాలలో ఒకటి" అని ప్రశంసిస్తున్నారు. 'రోంత్' మూవీ సీపీవో దిన్నాతన్ (రోషన్ మాథ్యూ) చుట్టూ తిరుగుతుంది. ఇతను సీనియర్ అధికారి యోహన్నన్ (దిలీష్ పోతన్)తో కలిసి రాత్రి గస్తీకి వెళ్తాడు.
ఆ రాత్రి వారు ఎదుర్కొనే సంఘటనలే ఈ సినిమా ప్రధాన కథాంశం. ఆదర్శవంతమైన పోలీసు అధికారి అయిన దిన్నాతన్‌కు ఆ రాత్రి తన పని గురించి మరింత నేర్పిస్తుంది. యోహన్నన్ అతని భావోద్వేగాలను నియంత్రించుకోవాలని కోరుకుంటాడు. 'రోంత్' స్క్రీన్‌ప్లేను దర్శకుడే స్వయంగా రాశారు. ఈ పోలీస్ డ్రామాలో అరుణ్ చెరుకావిల్, లక్ష్మి మీనన్, క్రిషా కురుప్, సుధీ కోపా సహాయక నటీనటులుగా ఉన్నారు. వినీత్ జైన్, రతీష్ అంబాట్, రంజిత్, జోజో జోస్ 'రోంత్'ను నిర్మించారు.

E-Paper












