Podarillu September 25 Episode: పొదరిల్లు.. గోపికకు చక్రి లవ్ ప్రపోజ్.. చూసేసిన మహా.. ఇంట్లో పంచాయితీ.. ఇరుక్కున్న చక్రి

Podarillu Serial September 25 Episode: పొదరిల్లు సీరియల్ సెప్టెంబర్ 25 ఎపిసోడ్ లో చక్రి అడ్డంగా ఇరుక్కుంటాడు. గోపిక బర్త్ డే ఆమెకు రోజ్ ఇస్తూ మహాకు దొరికిపోతాడు. దీంతో ఇంట్లో పెద్ద పంచాయితీకి అందరూ సిద్ధమవుతారు.

Published on: Sep 25, 2026, 07:43:15 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ చాలా వరకు చక్రి, గోపిక చుట్టూ తిరిగింది. మొదట కేశవ, శైలుల పంచాయితీ తీర్చి వాళ్లను కలిపిన చక్రి.. తర్వాత మహా ముందు తానే అడ్డంగా దొరికిపోతాడు. దీంతో ఇంట్లో వాళ్లందరూ అతనికి క్లాస్ పీకడానికి సిద్ధమవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

Podarillu September 25 Episode: పొదరిల్లు.. గోపికకు చక్రి లవ్ ప్రపోజ్.. చూసేసిన మహా.. ఇంట్లో పంచాయితీ.. ఇరుక్కున్న చక్రి
Podarillu September 25 Episode: పొదరిల్లు.. గోపికకు చక్రి లవ్ ప్రపోజ్.. చూసేసిన మహా.. ఇంట్లో పంచాయితీ.. ఇరుక్కున్న చక్రి

కేశవ, శైలు పంచాయితీ విని ఇద్దరినీ కలిపిన చక్రి

చక్రి ముందు కేశవ గురించి శైలు ఫిర్యాదు చేసే సీన్ తో సీరియల్ శుక్రవారం (సెప్టెంబర్ 25) ఎపిసోడ్ మొదలైంది. ముంగిస తనతో మాట్లాడటం లేదని, తన వల్లే మీ అన్నయ్య బలవంతంగా పెళ్లికి ఒప్పుకున్నాడని, తనను ఏవేవో మాటలు అన్నాడని చక్రితో శైలు చెప్పి బాధపడుతుంది. మీరు కేశవకు అన్నయ్యే కదా.. మీరే మా పంచాయితీ తీర్చాలి అని అనడంతో అతడు సరే అంటాడు. దీంతో శైలు జరిగిన విషయం చెబుతుంది. అదృష్టవశాత్తూ అన్నయ్య నిశ్చితార్థం తప్పిపోయిందని లేదంటే జీవితాంతం బాధపడేవాడని కేశవ అంటాడు.

అన్నయ్య విషయంలో ఎవరు ఏం చేసినా తాను క్షమించనని తెగేసి చెబుతాడు. దీంతో శైలు అతనిపై తనకున్న ప్రేమ గురించి చెబుతుంది. తమ ఇంట్లో వాళ్లతో గొడవ పడి మరీ కేశవను ప్రేమిస్తున్నానని, మీకు మద్దతుగా తాను నిలబడలేదా అని చక్రిని అడుగుతుంది. దీంతో ఇద్దరి వాదనలు విన్న చక్రి.. కేశవకు సర్ది చెబుతాడు. ఒకరి చేతుల్లో మరొకరి చేయి వేసి వాళ్లను కలుపుతాడు.

గోపిక దగ్గరికి చక్రి.. బర్త్‌డేకి ఇన్వైట్ చేసిన గోపిక

అప్పుడే చక్రికి గోపిక ఫోన్ చేస్తుంది. అర్జెంటుగా రావాలని పిలుస్తుంది. దీంతో కేశవ, శైలుకి చెప్పి చక్రి వెళ్లిపోతాడు. మహాను ఉడికించడానికి ఈమెతో పెట్టుకుంటే ఇలా ఇరుక్కుపోయానేంటి.. ఈమె మరీ తనపై ఆశలు పెంచేసుకుంటోంది.. ఇది ఎక్కడి వరకూ వెళ్తుందో అని కారులో వెళ్తూ అనుకుంటాడు. తర్వాత గోపిక దగ్గరికి వెళ్లి ఎందుకు పిలిచారు అని అడిగితే.. ఇవాళ తన బర్త్ డే అని ఆమె చెబుతుంది. అతడు హ్యాపీ బర్త్ డే అని చెబుతాడు.

సాయంత్రం ఇంట్లో పార్టీ ఉందని, తప్పకుండా రావాలని ఆమె పిలుస్తుంది. తనకు పని ఉందని చెప్పినా ఆమె వినదు. కాసేపైనా వచ్చి వెళ్లాలని అంటుంది. తర్వాత తనను ఇంటి దగ్గర డ్రాప్ చేయమని అనడంతో తప్పనిసరి పరిస్థితుల్లో చక్రి ఆమెను తీసుకెళ్తాడు. కారులోనూ సిగ్గు పడుతూ కూర్చుంటుంది. ఆమెను చూసి చక్రి తనను తాను తిట్టుకుంటాడు. ఇది ఎక్కడికో వెళ్తోందని భయపడతాడు.

చక్రి, మహా గొడవ.. విక్కీ విషయంలో మాటామాట.. గోపిక గురించి చెప్పి..

ఆ తర్వత ఇంటికి వచ్చిన చక్రి.. కన్నాతో కలిసి మొబైల్లో వీడియో గేమ్ ఆడుతుంటాడు. అది చూసి ఇద్దరినీ కలిపి కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెడగొట్టిందట అని మహా అంటుంది. చేసే వాళ్లను చూసే గాడిద వచ్చి చెడగొట్టిందని చక్రి అంటాడు. అంటే నేను గాడిదనా అని మహా అంటే.. మీ బాస్ గాడిద అని చక్రి తిడతాడు.

మధ్యలో ఆయనేం చేశారు.. నేను ప్రాజెక్ట్ బాగా చేశానని కాఫీకి ఇన్వైట్ చేశాడు కానీ వెళ్లలేదు.. అక్కడికి వెళ్లినా బాగుండేది అని అంటుంది. దీంతో చక్రి కూడా ఆమెను ఉడికించడానికి గోపిక బర్త్ డేకు పిలిచింది.. నేను వెళ్లాలి.. ఏ షర్ట్ వేసుకుంటే బాగుంటుంది అని అడుగుతాడు.

కుళ్లకున్న మహా.. చక్రి షర్ట్ బటన్స్ తీసేసి ప్రతీకారం

ఓ షర్ట్ సెలెక్ట్ చేసుకొని దానిని ఐరన్ చేసుకుంటాడు చక్రి. మొహం కడుక్కొస్తానని చక్రి వెళ్తాడు. అదే అదునుగా వెళ్లి షర్ట్ బటన్స్ అన్నీ పీకేస్తుంది మహా. తర్వాత వచ్చి చూసిన చక్రి షాకవుతాడు. ఎవరో కుళ్లుబోతు కావాలని బటన్స్ పీకేసినట్లుందని అంటాడు. అయినా సరే తనను ఎవరూ ఆపలేరని, మరో షర్ట్ వేసుకొని వెళ్తానని అని చక్రి అలాగే చేస్తాడు. మంచిగా రెడీ అయి గోపిక బర్త్ డేకు బయలుదేరుతాడు.

గోపిక బర్త్‌డే పార్టీకి చక్రి.. ఫ్రెండ్స్‌కి పరిచయం చేసిన గోపిక

అటు చక్రి కోసం గోపిక ఎదురు చూస్తూ ఉంటుంది. చక్రి రాగానే ఆమె మొహం వెలిగిపోతుంది. ఆమెను గుమ్మం దగ్గర చూడగానే.. అసలు రావద్దని అనుకున్నాను.. ఆమెను ఉడికించడానికి వచ్చాను.. ఇక్కడేం జరగుతుందో అని చక్రి అనుకుంటాడు.

ఆ తర్వాత చక్రిని లోనికి తీసుకెళ్లిన గోపిక.. తన ఫ్రెండ్స్ కు ఓ స్పెషల్ పర్సన్ అంటూ చక్రిని పరిచయం చేస్తుంది. తర్వాత కేక్ కట్ చేసే సమయంలోనే తన పక్కనే ఉండాలని చక్రిని లాక్కెళ్తుంది. కేక్ కట్ చేసి మొదట చక్రికే పెడుతుంది. తర్వాత చక్రి కూడా ఓ రోజ్ ఇచ్చి బర్త్ డే విషెస్ చెబుతాడు. దీంతో గోపిక సిగ్గు పడుతుంది. చక్రి ఇబ్బంది పడతాడు.

వీడియో వైరల్.. ఇంట్లో మహా పంచాయితీ

ఆ వీడియోను గోపిక ఫ్రెండ్స్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తారు. గోపికకు చక్రి లవ్ ప్రపోజ్ చేస్తున్నాడంటూ ఆ వీడియోలో ఒకరు అంటారు. ఆ వీడియోను ఇంట్లో ఉన్న మహా చూస్తుంది. అప్పుడూ అందరూ భోజనానికి కూర్చుంటుండగా చక్రి వస్తాడు. అతన్ని చూడగానే మహాకు మండిపోతుంది. అక్కడితో పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More