Ramayana Review: 'రావణుడిగా' యశ్ నెక్ట్స్ లెవెల్.. ఆ సీన్ హైలైట్.. రణ్‌బీర్, సాయి పల్లవిల 'రామాయణం' ఎలా ఉందంటే?
Ramayana Review: రామాయణ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ ఎపిక్ విజువల్ వండర్ ఎలా ఉంది? భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా ఆ అంచనాలను అందుకుందా లేదా అన్నది ఈ రివ్యూలో చూడండి.
Ramayana Review: భారతీయుల గుండెల్లో రామాయణానికి ఉన్న స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సుమారు 39 ఏళ్ల క్రితం రామానంద్ సాగర్ రూపొందించిన 'రామాయణ్' సీరియల్ ప్రసారమైనప్పుడు దేశమంతా స్తంభించిపోయేది. అలాంటి ఒక చారిత్రక వారసత్వాన్ని, కోట్లాది మంది భావోద్వేగాలను వెండితెరపై మరోసారి చూపించడం సాధారణ విషయం కాదు.

మరి అంతటి భారీ బాధ్యతను భుజానెత్తుకున్న నిర్మాత నమిత్ మల్హోత్రా, దర్శకుడు నితేష్ తివారీ 'రామాయణం: పార్ట్ 1' (Ramayana Part 1)తో ఆ మెరుపును మళ్లీ తీసుకరాగలిగారా? ప్రేక్షకుల అంచనాలను అందుకోగలిగారా?
‘రామాయణం పార్ట్ 1’ మూవీ విశేషాలు
నటీనటులు: రణబీర్ కపూర్, సాయి పల్లవి, యశ్, రవి దూబే, లారా దత్తా, అరుణ్ గోవిల్, శీబా చద్దా తదితరులు
దర్శకత్వం: నితేష్ తివారీ
సంగీతం: ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్
విజువల్ ఎఫెక్ట్స్ (VFX): DNEG (నమిత్ మల్హోత్రా)
రేటింగ్: 4 / 5 (4/5 stars)
కథ, స్క్రీన్‌ప్లే ఇలా..: రామాయణ మూలాలను తాకుతూ..
వాల్మీకి రాసిన రామాయణం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ సినిమాను లంకేశ్వరుడైన రావణాసురుడి (యశ్) గత చరిత్రతో ప్రారంభించడం కథకు ఒక బలమైన పునాదిని వేసింది. రాముడి ఎంట్రీకి ముందు రావణుడి శక్తియుక్తులను చూపించడం ద్వారా కథలో చక్కటి ఉత్కంఠను నెలకొల్పారు.
శ్రీధర్ రాఘవన్, నితేష్ తివారీలు అందించిన స్క్రీన్‌ప్లేలో ఎమోషన్స్, డ్రామా పుష్కలంగా ఉన్నాయి. అయితే కథను రెండు భాగాలుగా విభజించాలనే ఆలోచన వల్ల మొదటి భాగంలో పాత్రల పరిచయానికే ఎక్కువ సమయం తీసుకున్నారు. దీనివల్ల ప్రథమార్ధం కాస్త నెమ్మదిగా సాగుతుంది. కొన్ని చోట్ల AI డబ్బింగ్ సంబంధిత చిన్నపాటి లోపాలు కనిపిస్తాయి. అయితే ద్వితీయార్థంలో మాత్రం యాక్షన్ మోడ్ స్టార్ట్ అయి, సినిమా వేగాన్ని అందుకోవడమే కాకుండా ప్రేక్షకులను వేరే లోకంలోకి తీసుకెళ్తుంది.
యశ్ రచ్చ.. రణబీర్, సాయి పల్లవిల నటన ఎలా ఉందంటే?
ఈ చిత్రానికి బిగ్గెస్ట్ హైలైట్ అంటే అది యశ్ (Yash) నటన అని చెప్పక తప్పదు. 'టాక్సిక్' తర్వాత రావణాసురుడిగా యశ్ చూపించిన రాజసం, గర్వం, గంభీరమైన గొంతు ప్రేక్షకులను మైమరిపిస్తాయి. రావణుడి పది తలలను తెరపై చూపించిన విధానం అద్భుతం.
ఇక రాముడి పాత్రలో రణబీర్ కపూర్ యాక్షన్ సీన్స్‌లో చాలా సునాయాసంగా నటించారు. అయితే గతంలో అరుణ్ గోవిల్ పండించిన భక్తిభావాన్ని రణబీర్ పూర్తిస్థాయిలో అందుకోలేకపోయారనే భావన కలుగుతుంది. విశేషమేమిటంటే, ఆనాటి రాముడు అరుణ్ గోవిల్ ఇక్కడ దశరథుడిగా కనిపించడం ప్రేక్షకులను ఆకట్టుకుంది.
అటు సీతాదేవిగా సాయి పల్లవి కాస్టింగ్ పై మొదట్లో వచ్చిన అనుమానాలన్నింటినీ తన నటనతో పటాపంచలు చేసింది. తెరపై ఆమె కనిపించిన క్షణాలన్నీ అమాయకత్వం, గౌరవంతో నిండిపోయాయి.
లక్ష్మణుడిగా రవి దూబే భావోద్వేగాలను, కోపాన్ని చక్కగా పండించారు. కైకేయిగా లారా దత్తా, మంధరగా శీబా చద్దా తమ పాత్రల్లో ఒదిగిపోయారు.
విజువల్ వండర్: 4000 కోట్ల బడ్జెట్ కనిపించింది.. ఆ సీన్ గూస్బంప్స్
హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీ DNEG అందించిన VFX ఈ సినిమాకి ప్రాణవాయువు. రూ. 4000 కోట్ల అంచనా బడ్జెట్లో 70 శాతానికి పైగా సాంకేతిక విభాగానికే ఖర్చు చేశారనే ప్రచారానికి తగ్గట్లే, ప్రతి ఫ్రేమ్ హాలీవుడ్ స్థాయి విజువల్ వండర్లా ఉంది. కుబేరుడి నుంచి లంకను రావణుడు చేజిక్కించుకోవడం, కైకేయి తప్పు తెలుసుకునే సన్నివేశాలు ప్రేక్షకుడిని కథలోకి లాక్కుపోతాయి.
ముఖ్యంగా క్లైమాక్స్‌కు ముందు వచ్చే జటాయు సీన్ సినిమాకే హైలైట్. సీతాదేవిని కాపాడేందుకు జటాయువు రావణుడితో పోరాడే ఘట్టం (అనుపమ్ ఖేర్ వాయిస్ ఓవర్) ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పిస్తుంది.
మ్యూజిక్, టెక్నికల్ అంశాలు: ఎక్కడ తగ్గింది?
హాలీవుడ్ లెజెండ్ హన్స్ జిమ్మర్, భారతీయ సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ కలయికలో వచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వినడానికి ఆహ్లాదకరంగా ఉంది. అయితే వీరిద్దరి కాంబినేషన్ అనగానే ఆకాశాన్నంటిన అంచనాలను మాత్రం పూర్తిస్థాయిలో అందుకోలేకపోయిందనే చెప్పాలి. కొన్ని పాటలు కథా గమనానికి అడ్డుపడినట్లు అనిపిస్తాయి.
పార్ట్ 2 కోసం ఫైర్వర్క్స్ సిద్ధం
పది తలల రావణుడిని ఎదిరించడం ఎంత కష్టమో, ఒక దేశం మొత్తం ఉన్న అంచనాలను తట్టుకుని సినిమా తీయడం అంతకంటే కష్టం. కానీ నితేష్ తివారీ అండ్ టీమ్ ‘రామాయణం పార్ట్ 1’తో ఆ సవాలును ఘనంగా అధిగమించారు. హనుమంతుడిగా సన్నీ డియోల్ ఎంట్రీ, సంజీవని పర్వతం సీన్, అసలైన లంకాయుద్ధం అంతా పార్ట్ 2లోనే ఉండబోతోంది. పార్ట్ 1 ఇచ్చిన ఈ సాలిడ్ పునాదితో పార్ట్ 2పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


