Namit Malhotra: ముంబై గ్యారేజ్ నుంచి 4000 కోట్ల 'రామాయణ' దాకా.. 90 శాతం ఆస్తి పోయినా మళ్లీ ఎదిగి.. ఎవరీ నమిత్ మల్హోత్రా?

Namit Malhotra: రామాయణ మూవీ నిర్మాత నమిత్ మల్హోత్రా జీవిత ప్రయాణం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. 19 ఏళ్ల వయస్సులో ముంబైలోని ఒక చిన్న గ్యారేజ్‌లో యాపిల్ కంప్యూటర్‌తో వ్యాపారం ప్రారంభించి, ప్రపంచంలోనే అత్యుత్తమ ఆస్కార్ గ్రహీత విజువల్ ఎఫెక్ట్స్ సంస్థ ‘డీఎన్‌ఈజీ’ని స్థాపించిన ఘనత ఆయనది.

Published on: Oct 30, 2026, 19:17:05 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Namit Malhotra: భారతీయ చలనచిత్ర రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్తూ, రాబోయే నవంబర్ 5న అంతర్జాతీయంగా థియేటర్లలోకి రాబోతున్న చిత్రం 'రామాయణ' (Ramayana: Part 1). రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా అంచనా వ్యయం ఏకంగా రూ. 4,000 కోట్లు. ఇంతటి మైండ్ బ్లాకింగ్ ప్రాజెక్ట్‌ను హాలీవుడ్ స్థాయిలో నిర్మిస్తున్న నిర్మాత నమిత్ మల్హోత్రా జీవిత ప్రయాణం ఏ సినిమా కథకూ తక్కువ కాదు.

Namit Malhotra: ముంబై గ్యారేజ్ నుంచి 4000 కోట్ల 'రామాయణ' దాకా.. 90 శాతం ఆస్తి పోయినా మళ్లీ ఎదిగి.. ఎవరీ నమిత్ మల్హోత్రా? (AFP)
Namit Malhotra: ముంబై గ్యారేజ్ నుంచి 4000 కోట్ల 'రామాయణ' దాకా.. 90 శాతం ఆస్తి పోయినా మళ్లీ ఎదిగి.. ఎవరీ నమిత్ మల్హోత్రా? (AFP)

ఒక సాధారణ ముంబై యువకుడి స్థాయి నుంచి హాలీవుడ్‌ను శాసించే వీఎఫ్ఎక్స్ (VFX) విజనరీగా ఆయన ఎలా మారారో ఇటీవల లాస్ ఏంజెల్స్‌లోని ఆస్కార్ అకాడమీ మ్యూజియంలో జరిగిన ప్రదర్శన వేదికగా స్వయంగా పంచుకున్నారు. 2008 ఆర్థిక మాంద్యంలో తన ఆస్తిలో ఏకంగా 90% కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి నుంచి కోలుకుని, హాలీవుడ్ దిగ్గజాలు క్రిస్టోఫర్ నోలన్, డెనిస్ విల్లెనూవ్‌లతో కలిసి పనిచేసే స్థాయికి ఎదిగిన ఆయన స్ఫూర్తిదాయక కథనం ఇది.

19 ఏళ్ల వయస్సులో గ్యారేజ్‌లో మొదలైన ప్రయాణం

నమిత్ మల్హోత్రా సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించినప్పటికీ, సొంతంగా ఏదైనా సాధించాలనే తపనతో 1995లో కేవలం 19 ఏళ్ల వయస్సులో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ముంబైలోని ఒక చిన్న గ్యారేజ్‌లో, ఒక యాపిల్ కంప్యూటర్‌తో, తనకంటే రెండేళ్లు పెద్దవారైన ముగ్గురు టీచర్లతో కలిసి వీడియో ఎడిటింగ్, కంప్యూటర్ గ్రాఫిక్స్ బిజినెస్‌ను స్టార్ట్ చేశారు.

ఆ తర్వాత 1997లో తన తండ్రి నరేష్ మల్హోత్రాకి చెందిన కెమెరా రెంటల్ బిజినెస్‌తో దానిని విలీనం చేసి 'ప్రైమ్ ఫోకస్ లిమిటెడ్' (Prime Focus Limited)కు శ్రీకారం చుట్టారు. కష్టపడే తత్వంతో అతి తక్కువ కాలంలోనే ఇండియాలోనే అతిపెద్ద పోస్ట్-ప్రొడక్షన్ సంస్థగా ప్రైమ్ ఫోకస్‌ను తీర్చిదిద్దారు.

2008 ఆర్థిక మాంద్యం: 90% ఆస్తి ఆవిరి

తన వ్యాపారాన్ని అంతర్జాతీయంగా విస్తరించే క్రమంలో 2007లో అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో అడుగుపెట్టారు నమిత్. అయితే 2008లో వచ్చిన ప్రపంచ ఆర్థిక మాంద్యం (Global Recession) ఆయనను దారుణంగా దెబ్బతీసింది. వ్యాపార విస్తరణ కోసం చేసిన పెట్టుబడులు మునిగిపోయి, తన సంపదలో ఏకంగా 90 శాతం ఆస్తిని కోల్పోయారు.

ఆ క్లిష్ట సమయాన్ని గుర్తుచేసుకుంటూ నమిత్ ఇలా అన్నారు.. "లాస్ ఏంజెల్స్‌లో అడుగుపెట్టిన కొత్తలో 2008 మాంద్యంలో నా ఆస్తిలో 90 శాతాన్ని కోల్పోయాను. ఒక వలసదారుడిగా ఆ పరిస్థితి నుంచి మళ్లీ సున్నా నుండి మొదలుపెట్టి, ఈ రోజు ప్రపంచంలోనే అత్యంత భారీ ఇండిపెండెంట్ మూవీ అయిన 'రామాయణ'ను నిర్మించే స్థాయికి రావడం నా జీవితంలో మర్చిపోలేని అనుభూతి"

'డీఎన్‌ఈజీ' స్థాపన.. ఏకంగా 8 ఆస్కార్లు

మాంద్యం నుంచి కోలుకున్న నమిత్.. 2014లో లండన్‌కు చెందిన ప్రసిద్ధ విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియో 'డబుల్ నెగటివ్' (Double Negative)తో ప్రైమ్ ఫోకస్‌ను విలీనం చేసి 'DNEG' (డీఎన్‌ఈజీ) అనే గ్లోబల్ వీఎఫ్ఎక్స్ దిగ్గజాన్ని సృష్టించారు.

ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూడలేదు. హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్లు క్రిస్టోఫర్ నోలన్, డెనిస్ విల్లెనూవ్‌లతో కలిసి పనిచేసి 'ఇన్సెప్షన్', 'ఇంటర్ స్టెల్లార్', 'బ్లేడ్ రన్నర్ 2049', 'ఫస్ట్ మ్యాన్', 'టెనెట్', 'డ్యూన్', 'డ్యూన్: పార్ట్ 2' వంటి విజువల్ వండర్స్ కోసం ఏకంగా 8 ఆస్కార్ లను కొల్లగొట్టి భారతీయ సత్తాను ప్రపంచానికి చాటారు.

రూ. 4000 కోట్ల 'రామాయణ' కల నెరవేరుతున్న వేళ..

తమ సంస్థ సాధించిన 8 ఆస్కార్ల విజయం తర్వాత, భారత పురాణ ఇతిహాసమైన రామాయణాన్ని ప్రపంచానికి అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో చూపించాలనే లక్ష్యంతో రూ. 4,000 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. లాస్ ఏంజెల్స్‌లోని అకాడమీ మ్యూజియంలో హాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో ఈ సినిమా ఇంగ్లీష్ వెర్షన్ స్పెషల్ ప్రివ్యూ ప్రదర్శించినప్పుడు, నమిత్ మల్హోత్రా దానిని తన జీవితంలోని ఆస్కార్ మూమెంట్ గా అభివర్ణించారు.

రణబీర్ కపూర్, సాయి పల్లవి, యశ్‌లతో పాటు సన్నీ డియోల్ (హనుమంతుడు), రవి దూబే (లక్ష్మణుడు), లారా దత్తా (కైకేయి) వంటి భారీ తారాగణంతో రూపుదిద్దుకున్న 'రామాయణ: పార్ట్ 1' నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ముంబై గ్యారేజ్ నుంచి హాలీవుడ్ అకాడమీ స్టేజ్ వరకు నమిత్ మల్హోత్రా సాగించిన ఈ ప్రయాణం ప్రతి ఒక్కరికీ ఒక గొప్ప ప్రేరణ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More