Sandeep Reddy Vanga: అలాంటి చేతగాని నటులు, డైరెక్టర్లే ఈ పని చేసేది.. నేరాలు జరిగితే సినిమాపై ఎందుకు ఏడుపు: సందీప్ వంగా
Sandeep Reddy Vanga: సమాజంలో దారుణాలు జరిగిన ప్రతిసారీ సినిమాలపై నిందలు వేయడం మానుకోవాలని టాలీవుడ్ సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భయంకరమైన దారుణాలు జరిగినప్పుడు బాధితుల పట్ల సానుభూతి చూపించాల్సింది పోయి, అవకాశం కోసం చూస్తున్నారని విమర్శించారు.
Sandeep Reddy Vanga: టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ 'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్', ‘యానిమల్’ చిత్రాలతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. సమాజంలో ఏదైనా ఘోరం లేదా నేరం జరిగిన ప్రతిసారీ సినిమాలను, ముఖ్యంగా తన చిత్రాలలోని వైలెంట్‌ను వేలెత్తి చూపించే వారిపై ఆయన మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

సమాజంలో ఎవరైనా ఒక భయంకరమైన నేరానికి పాల్పడినప్పుడు, మొదట చూపించాల్సింది ఆ ఘోరానికి గురైన బాధితుల పట్ల సానుభూతి అని ఆయన స్పష్టం చేశారు. ఆ సమస్య వెనుక ఉన్న అసలు కారణాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలే తప్ప, ప్రచార ఆర్భాటం కోసం సినిమాలను బలిపశువుగా మార్చడం అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు. సామాజిక సంస్కర్తలుగా నటిస్తున్న ఫెయిల్డ్ యాక్టర్లు, పరాన్నజీవులంటూ తన ఎక్స్ అకౌంట్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు.
“ఫెయిల్డ్ యాక్టర్స్, పరాన్నజీవులారా.. నేర్చుకోండి!”
సందీప్ రెడ్డి వంగా తన పోస్ట్‌లో ప్రత్యక్షంగా కొందరు వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంటూ విమర్శలు గుప్పించారు.
“ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తున్నది ఏంటంటే.. మీలోని ఆందోళన బాధితుల కోసం లేదా వారి కుటుంబాల కోసం ఎంతమాత్రం కాదు. ఒక భయంకరమైన విషాదాన్ని, దారుణాన్ని ఆసరాగా చేసుకుని వేరొకరిపై మీకున్న వ్యక్తిగత కక్షలను తీర్చుకోవడానికి దానిని ఒక సాకుగా వాడుకుంటున్నారు” అని సందీప్ రాసుకొచ్చారు.
సందీప్ అక్కడితో ఆగలేదు. ఏం చేతగాని ఫెయిలైన నటులు, మరొకరిపై ఆధారపడే పరాన్న జీవులే ఇలాంటివి చేస్తున్నారని అనడం గమనార్హం. “వేరొకరు కష్టపడి చేసిన పనిపై దాడి చేసే అవకాశం రాగానే, హఠాత్తుగా తమను తాము సామాజిక సంస్కర్తలుగా ప్రకటించుకునే కొంతమంది పనీ-పాటా లేని ఫెయిల్యూర్ నటీనటులు, కొందరు దర్శకులు, నిర్మాతలు, పరాన్నజీవులను ఉద్దేశించి నేను ఈ మాటలు చెబుతున్నాను. ఒక విషాదానికి కావాల్సింది సానుభూతి మాత్రమే.. మీ అవకాశవాదం కాదు. ముందు ఆ తేడా తెలుసుకోండి” అంటూ ఘాటుగా ముగించారు.
కల్ట్ డైరెక్టర్ వర్సెస్ సోషల్ మీడియా ట్రోలింగ్
సందీప్ రెడ్డి వంగా సినిమాలు బాక్సాఫీస్ వద్ద వందల కోట్లు కొల్లగొడుతున్నప్పటికీ, ఆయన చిత్రాలలోని హింస, పాత్రల ప్రవర్తనపై తరచూ ఇండస్ట్రీలోని కొందరు ప్రముఖులు, సోషల్ మీడియా విభాగం నుంచి విమర్శలు వ్యక్తమవుతూనే ఉన్నాయి.
అయితే ప్రతిసారీ తనదైన పదునైన శైలిలోనే సమాధానమిచ్చే సందీప్.. ఈసారి ఏకంగా నేరాల వెనుక సినిమాల ప్రమేయం ఉందనే నెపం మోపే వారి అసలు రంగును బయటపెట్టారు.
ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్‌తో తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ డ్రామా 'స్పిరిట్' (Spirit) పనుల్లో బిజీగా ఉన్న సందీప్ రెడ్డి వంగా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఫిలిం సర్కిల్స్‌తో పాటు సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


