రూపేష్, ఆకాంక్ష సింగ్ హీరోహీరోయిన్లుగా నటించిన షష్టిపూర్తి మూవీ మే 30న (శుక్రవారం) థియేటర్లలో రిలీజైంది. సీనియర్ యాక్టర్స్ రాజేంద్రప్రసాద్, అర్చన ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీకి ఇళయరాజా మ్యూజిక్ అందించాడు. పవన్ ప్రభ దర్శకుడు. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? అంటే?
షష్టిపూర్తి రివ్యూ
శ్రీరామ్ ప్రేమకథ...
శ్రీరామ్ (రూపేష్) నిజాయితీపరుడైన లాయర్. న్యాయాన్ని కాపాడటమే తన వృత్తి అని నమ్ముతుంటాడు. అబద్ధం ఆడటం అంటే ఇష్టం ఉండదు. అతడు చెప్పే నిజాల వల్ల అన్ని సమస్యలే ఎదురవుతుంటాయి. అలాంటి శ్రీరామ్ లైఫ్‌లోకి అనుకోకుండా జానకి (ఆకాంక్ష సింగ్) ఎంట్రీ ఇస్తుంది. ఓ సమస్యలో నుంచి జానకికి కాపాడుతాడు శ్రీరామ్. ఇద్దరి మధ్య మొదలైన పరిచయం ప్రేమగా మారుతుంది. అబద్ధాలు ఆడితేనే ప్రేమిస్తానని శ్రీరామ్‌కు కండీషన్ పెడుతుంది జానకి.
ప్రియురాలి కోసం కోర్టులో అబద్ధాలు ఆడి కొన్ని కేసుల్లో గెలుస్తాడు శ్రీరామ్. కొడుకు గురించి నిజం తెలిసి అతడిని ద్వేషిస్తుంది తల్లి భువన(అర్చన). నువ్వు కూడా నీ తండ్రిలాగే అబద్దాల కోరువంటూ నిందలు వేస్తుంది. భువన, దివాకర్ (రాజేంద్రప్రసాద్) మధ్య గొడవలకు కారణం ఏంటి? అసలు జానకి ఎవరు? దివాకర్‌పై పగతో జానకి రగిలిపోవడానికి కారణం ఏమిటి?
జానకి తండ్రి మరణానికి దివాకర్‌కు ఉన్న సంబంధం ఏమిటి? తల్లిదండ్రులను కలపడానికి శ్రీరామ్ ఏం చేశాడు? జానకి తన తప్పును ఎలా తెలుసుకుంది? దివాకర్, భువనల షష్టిపూర్తి జరపాలనేశ్రీరామ్ కల తీరిందా? లేదా? అన్నదే ఈ మూవీ కథ.
క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్...
అశ్లీలతకు, అసభ్యతకు తావు లేని క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీస్ సంఖ్య బాగా తగ్గింది. ఆ లోటును భర్తీ చేస్తూ వచ్చిన సినిమానే షష్టిపూర్తి. ఓ తల్లి, తండ్రి...కొడుకు...వారి జీవితాల్లోకి వచ్చే ఓ అమ్మాయి కథతో... ఫ్యామిలీ ఎమోషన్స్‌కు లవ్‌స్టోరీని జోడించి దర్శకుడు పవన్ ప్రభ షష్టిపూర్తి కథను రాసుకున్నాడు.
అంతర్లీనంగా ఓ రివేంజ్ డ్రామాతో థ్రిల్లింగ్ను పంచారు. షష్టిపూర్తి వేడుకకు ఉన్న ప్రత్యేకతను ఈ మూవీలో చూపించాడు. అనవసరపు కమర్షియల్ హంగుల జోలికి పోకుండా తాను చెప్పాలనుకున్న కథను నిజాయితీగా స్క్రీన్‌పై ఆవిష్కరించారు దర్శకుడు.
నాచురల్ ఎమోషన్స్...
హీరోహీరోయిన్లతో పాటు సినిమాలోని క్యారెక్టర్స్, ఎమోషన్స్ నాచురల్‌గా ఉండేలా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు. నిత్యం జీవితంలో కనిపించే వ్యక్తులను పోలి పాత్రలు సాగుతాయి. ఎక్కడ ఓవర్ సినిమాటిక్ అనే భావన కనిపించదు. నిజానికి అబద్ధానికి మధ్య ఉన్న తేడాను, వాటి వల్ల ఎదురయ్యే కష్టాల నుంచి కామెడీని పండిస్తూనే మనసులను కదిలిస్తాయి.
ట్విస్ట్ బాగుంది...
ఫస్ట్ హాఫ్‌లో హీరోహీరోయిన్ల మధ్య పరిచయం, ప్రేమ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఇళయరాజా మ్యూజిక్ తోడవ్వడంతో స్క్రీన్‌పై వారి కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది. హీరోయిన్ క్యారెక్టర్‌కు సంబంధించి వచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. ఆర్చన, రాజేంద్రప్రసాద్ ఫ్లాష్‌బ్యాక్ సీన్స్ వింటేజ్ టైమ్‌లోకి తీసుకెళతాయి. తన తల్లిదండ్రులను కలపడానికి శ్రీరామ్ ఏం చేశాడనే అంశాలతో సెకండాఫ్‌ను ఎమోషనల్ రైడ్‌గా నడిపించారు. కథలో స్పీడు లోపించడం మైనస్‌గా మారింది.
వంద శాతం న్యాయం...
దివాకర్ పాత్రలో రాజేంద్రప్రసాద్ జీవించాడు. డిఫరెంట్ వేరియేషన్స్‌తో సాగే పాత్రలో ఒదిగిపోయాడు. ఎమోషనల్ సీన్లలో చెలరేగిపోయాడు. భువన పాత్రకు అర్చన వంద శాతం న్యాయం చేసింది. హీరో రూపేష్ మెచ్యూర్డ్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఫైట్స్ సీన్స్‌లో బాగున్నా...డ్యాన్సుల్లో కొంత తడబడ్డాడు. పాజిటివ్‌గా కనిపించే నెగెటివ్ షేడ్ క్యారెక్టర్‌లో ఆకాంక్ష సింగ్ మెప్పించింది.
తెర వెనుక హీరో...
ఈ సినిమాకు తెర వెనుక హీరోగా ఇళయరాజా నిలిచాడు. ఇరు కనులు కనులుతో పాటు మిగిలిన పాటలు బాగున్నాయి. తోట తరణి సెట్స్, రామ్ విజువల్స్ కూడా ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి.
ఎమోషనల్ ఎంటర్‌టైనర్
కుటుంబమంతా కలిసి చూసే బ్యూటీఫుల్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ మూవీ ఇది. రాజేంద్రప్రసాద్ అర్చన యాక్టింగ్‌తో పాటు ఇళయరాజా మ్యూజిక్ కోసం ఈ సినిమాను చూడొచ్చు.