ఆరు నెలలు అయినా ఖాళీగా కూర్చుంటా.. పదిలో 9 సినిమాలకు నో చెబుతాను: హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్
ఒకప్పుడు తెలుగులో కొత్త బంగారు లోకం మూవీలో నటించి మెప్పించిన నటి శ్వేతా బసు ప్రసాద్ తెలుసు కదా. తాను చాలా సెలెక్టివ్ గా కెరీర్‌లో ముందుకు సాగడంపై హిందుస్థాన్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించింది.
తెలుగు ప్రేక్షకులకు 'కొత్త బంగారు లోకం'లో అమాయకమైన పాత్రతో దగ్గరైన శ్వేతా బసు ప్రసాద్.. ప్రస్తుతం ఓటీటీ వేదికగా ప్రేక్షకులకు దగ్గరవుతోంది. ఈ ఒక్క ఏడాదే ఆమె నటించిన 'ఊప్స్.. అబ్ క్యా?', 'క్రిమినల్ జస్టిస్', తాజాగా సోనీ లివ్‌లో విడుదలైన 'మహారాణి సీజన్ 4' ప్రేక్షకులను అలరించాయి. చేతి నిండా పని ఉన్నప్పటికీ, తాను ఎంచుకునే పాత్రల విషయంలో మాత్రం చాలా కఠినంగా ఉంటానని ఆమె హిందుస్థాన్ టైమ్స్‌తో చెప్పింది.

ఆరు నెలలు ఖాళీగా ఉన్నా పర్లేదు
కథల ఎంపికలో తాను ఎంత నిక్కచ్చిగా ఉంటానో శ్వేతా బసు ప్రసాద్ వివరించింది. "నేను వరుసగా నటిస్తున్నందుకు సంతోషంగా ఉంది. కానీ నేను చాలా సెలెక్టివ్‌గా ఉంటున్నాను. అందుకే ప్రేక్షకులు నాపై నమ్మకం ఉంచారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం నాకు ముఖ్యం. భవిష్యత్తులో నా సెలెక్షన్స్ తప్పవచ్చు.. అప్పుడు వాటి నుంచి నేర్చుకుంటాను" అని ఆమె చెప్పింది.
"ప్రయోగాలు చేయడానికి నేను భయపడను. ప్రాజెక్ట్‌లకు 'నో' చెప్పడానికి అస్సలు సంకోచించను. నిజం చెప్పాలంటే నా దగ్గరకు వచ్చే ప్రతి 10 ప్రాజెక్టులలో 9 నేను తిరస్కరిస్తాను. మంచి పాత్ర కోసం ఆరు నెలలు ఇంట్లో ఖాళీగా కూర్చోవాల్సి వచ్చినా నాకు ఓకే. నేను వేచి ఉంటాను" అని తెలిపింది.
నాకు ఆ 'హడావిడి' అవసరం లేదు
సినీ పరిశ్రమలో ఉండే ఒత్తిడి, ఆర్భాటాల గురించి మాట్లాడుతూ.. తన సాధారణ జీవనశైలే తనకు ఇంత ధైర్యాన్ని ఇస్తోందని శ్వేతా తెలిపింది. "నా జీవితంలో అనవసరమైన ఖర్చులు, ఆర్భాటాలు లేవు. జనం అంచనాలకు తగ్గట్టు బతకాలని, నిత్యం ఫోటోషూట్‌లు చేయాలని నేను అనుకోను. ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండాలి. ఆ పార్టీలో కనిపించాలి అనే ఒత్తిడి నాపై లేదు. నేను ఆ పద్ధతిని నమ్మను. అందుకే పని లేనప్పుడు సైలెంట్‌గా ఉండటం, పని ఉన్నప్పుడు మాత్రమే బయటకు రావడం నాకు సులభం" అని శ్వేత చెప్పింది.
ప్రేక్షకురాలిగా ఆలోచిస్తా..
బాలనటిగా 'మక్దీ', 'ఇక్బాల్' నుంచి మొదలుకొని తెలుగులో 'కొత్త బంగారు లోకం', హిందీలో 'తాష్కెంట్ ఫైల్స్', 'జూబ్లీ' వరకు వైవిధ్యమైన పాత్రలు పోషించింది శ్వేత. పాత్రలను ఎలా ఎంచుకుంటారు అని అడిగినప్పుడు ఆమె ఇలా స్పందించింది.
"నేను ముందు ఒక ప్రేక్షకురాలిని.. ఆ తర్వాతే నటిని. నేను చూడటానికి ఇష్టపడే కథలనే ఎంచుకుంటాను. ఇప్పుడు రచయితలు ప్రయోగాలు చేస్తున్నారు. ప్రేక్షకులు అన్ని రకాల జానర్లను ఆదరిస్తున్నారు. ఒక నటిగా ఇది చాలా మంచి సమయం" అని ఆమె అభిప్రాయపడింది.
'మహారాణి' ఒక సొంత ఇల్లు లాంటిది
హుమా ఖురేషి ప్రధాన పాత్రలో నవంబర్ 7న విడుదలైన పొలిటికల్ డ్రామా ‘మహారాణి సీజన్ 4’లో శ్వేతా కీలక పాత్ర పోషించింది. ఈ అనుభవం గురించి ఆమె మాట్లాడుతూ.. "సుభాష్ కపూర్, హుమా ఖురేషి, టీమ్ ఒక అందమైన టౌన్‌షిప్‌ను నిర్మించారు. అక్కడ ఎవరైనా వచ్చి హాయిగా జీవించవచ్చు. నాకు కూడా అలాగే అనిపించింది. ఆ సెట్‌లో నేను చాలా కంఫర్టబుల్‌గా, సొంత ఇంట్లో ఉన్నట్లు ఫీలయ్యాను" అని ముగించింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


