Naresh: ఈ20 పెట్రోల్‌తో గుండెపోటు.. బీజేపీ పనైపోయినట్లే.. నేనేేమీ దేశద్రోహిని కాదు: నటుడు నరేష్ సంచలన పోస్ట్ వైరల్
Naresh: టాలీవుడ్ నటుడు నరేష్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఈ20 పెట్రోల్ ను తొందరపడి తీసుకురావడంపై ఘాటైన విమర్శలు చేశారు. ఇది బీజేపీకి రెడ్ సిగ్నల్ అని స్పష్టం చేశారు. అంతేకాదు ఈ పెట్రోల్ తో అందరికీ గుండెపోటు వస్తోందని అన్నారు.
Naresh: సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరుడు, సీనియర్ నటుడు నరేష్ విజయ్ కృష్ణ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన E20 ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోల్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సరికొత్త ఇంధనం వాడకం వల్ల బైక్ రైడర్స్ నుంచి లగ్జరీ కార్ ఓనర్స్ వరకు అందరికీ హార్ట్ ఎటాక్స్ వస్తున్నాయని ఎక్స్ వేదికగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన రూ. 2.5 కోట్ల విలువైన పోర్షే పనామెరా కార్ ఇంజన్ దెబ్బతింటుందనే భయంతో లీటర్ రూ. 165 పెట్టాల్సి వస్తోందని మండిపడ్డారు.

బీజేపీ అభిమాని పరిస్థితే ఇలా..
నరేష్ తన సోషల్ మీడియా పోస్ట్‌లో ఒక షాకింగ్ ఉదాహరణ షేర్ చేశారు. బీజేపీ సానుభూతిపరుడైన తన ఫ్రెండ్ ఇటీవల కొన్న టయోటా కామ్రీ కార్ ఇంజన్ వాల్వ్స్ ఈ ఎథనాల్ పెట్రోల్ వల్ల పూర్తిగా పాడైపోయాయని చెప్పారు. వాటిని రిపేర్ చేయడానికి ఏకంగా రూ. 3.5 లక్షలు ఖర్చయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒకవేళ తన బ్రాండ్ న్యూ పోర్షే పనామెరా కారుకు కూడా ఇదే పరిస్థితి వస్తే ఇంజన్ మార్చడానికి కనీసం రూ. 12 లక్షలు అవుతుందని లెక్కలు కట్టారు. ఈ టెన్షన్ తట్టుకోలేక తను లీటర్ రూ. 165 ధర ఉండే హై-ఆక్టేన్ 100 పెట్రోల్ వాడటం మొదలుపెట్టినట్లు క్లారిటీ ఇచ్చారు.
సామాన్యుల కష్టాలపై నరేష్ ఆందోళన
లగ్జరీ కార్లు ఉన్నవాళ్లు సరే, మరి రోజువారీ బైకులు వాడే సామాన్య జనం పరిస్థితి ఏంటని నరేష్ ప్రశ్నించారు. హైవేలపై ప్రయాణించేటప్పుడు అసలు ఇలాంటి హై-ఆక్టేన్ పెట్రోల్ బంకులు ఎక్కడ దొరుకుతాయని నిలదీశారు. బ్రెజిల్ లాంటి చిన్న దేశాలు ఇథనాల్ ఇంధనాన్ని దశలవారీగా ప్రవేశపెట్టి సక్సెస్ అయ్యాయని, ఇండియాలో ఇంత అర్జెంట్‌గా, దూకుడుగా ఎందుకు అమలు చేస్తున్నారని అడిగారు.
నరేష్ గతంలో బీజేపీ (BJP) నాయకుడిగా కూడా పనిచేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన పార్టీ పెద్దల ఆలోచనలు బాగుంటాయని తనకు తెలుసని, కానీ పర్యావరణాన్ని కాపాడే పేరుతో కోట్ల మంది వాహనదారులను ఇబ్బంది పెట్టే ఈ నిర్ణయం చాలా తొందరపాటుతో కూడుకున్నదిగా కనిపిస్తోందని విమర్శించారు. తాను దేశ ద్రోహిని కాదు కానీ ఈ సమస్య ప్రాక్టికల్ ప్రాబ్లం అని తేల్చి చెప్పారు. గత ఎన్నికల్లోనే పార్టీ సంకీర్ణంతో బయటపడిందని, ఇది కచ్చితంగా బీజేపీకి రెడ్ సిగ్నల్ అని తేల్చి చెప్పారు.
నెటిజన్ కౌంటర్‌కు నరేష్ రిటార్ట్
ఈ పోస్ట్ చూసిన ఒక నెటిజన్ అమెరికాలోనైనా పోర్షే కార్లకు ప్రీమియం ఫ్యూయల్ మాత్రమే వాడాలని, యూజర్ మాన్యువల్ చదవాలంటూ నరేష్‌ను విమర్శించారు. దానికి నరేష్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. రూ. 2.5 కోట్లు పెట్టి కార్ కొన్నప్పుడు మాన్యువల్ చూడకుండా ఉంటామా అని రిటార్ట్ ఇచ్చారు. ఇది తన వ్యక్తిగత సమస్య కాదని, హైవేస్ మీద హై ఆక్టేన్ పెట్రోల్ దొరకని పరిస్థితి ఇంకా సామాన్యుల ఇబ్బందుల గురించి మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు. నరేష్ చేసిన ఈ కామెంట్స్‌కు చాలా మంది ఫ్యాన్స్ సపోర్ట్ ఇస్తున్నారు.
టాలీవుడ్ లెజెండరీ నటి, దర్శకురాలు విజయనిర్మల కుమారుడైన నరేష్.. సూపర్ స్టార్ కృష్ణ కుటుంబంతో ఎంతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీగా ఉన్న ఆయన ఈ 2026 సంవత్సరంలోనే నారి నారి నడుమ మురారి, హే బల్వంత్, బ్యాడ్ బాయ్ కార్తీక్, సతీ లీలావతి లాంటి వరుస సినిమాలతో అలరించారు. ఇప్పుడు ఈ పెట్రోల్ ఇష్యూతో ఆయన పొలిటికల్, ఆటోమొబైల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


