Pavala Syamala: అయ్యో పావలా శ్యామల.. సినిమా నటి ఇప్పుడిలా నడిరోడ్డుపై దారుణమైన పరిస్థితుల్లో.. క్యాబ్ డ్రైవర్ అమానుషం!

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. గుండె సంబంధిత సమస్యతో కూకట్‌పల్లి ఆస్పత్రికి వెళ్లిన ఆమెను చేర్చుకోకపోగా, అర్ధరాత్రి వేళ క్యాబ్ డ్రైవర్ రోడ్డుపై వదిలేశాడు. పోలీసులు ఆమెను రక్షించి ఆశ్రమానికి తరలించారు.

Published on: May 16, 2026, 11:03:10 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Pavala Syamala: వెండితెరపై వందలాది సినిమాల్లో తనదైన నటనతో, హాస్యంతో ప్రేక్షకులను నవ్వించిన సీనియర్ సహాయ నటి పావలా శ్యామల జీవితం అత్యంత దయనీయ స్థితికి చేరుకుంది. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో పాటు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆమె పరిస్థితి ఇప్పుడు మరింత ఆందోళనకరంగా మారింది.

Pavala Syamala: అయ్యో పావలా శ్యామల.. సినిమా నటి ఇప్పుడిలా నడిరోడ్డుపై దారుణమైన పరిస్థితుల్లో.. క్యాబ్ డ్రైవర్ అమానుషం!
Pavala Syamala: అయ్యో పావలా శ్యామల.. సినిమా నటి ఇప్పుడిలా నడిరోడ్డుపై దారుణమైన పరిస్థితుల్లో.. క్యాబ్ డ్రైవర్ అమానుషం!

శుక్రవారం (మే 15) రాత్రి ఆమెకు గుండె సంబంధిత సమస్య తీవ్రమవడంతో చికిత్స కోసం కూకట్‌పల్లిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. అయితే చేతిలో తగినంత డబ్బు లేదనే కారణంతో సదరు ఆస్పత్రి యాజమాన్యం ఆమెను చేర్చుకోవడానికి నిరాకరించిందని ఆరోపణలు వస్తున్నాయి.

హాస్పిటల్ నిర్వాకం.. క్యాబ్ డ్రైవర్ అమానుషం

కనీసం మానవత్వం కూడా చూపకుండా ఆస్పత్రి యాజమాన్యం వ్యవహరించిన తీరు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. చికిత్స అందించకపోగా పావలా శ్యామలను అక్కడి నుంచి పంపించివేశారు. ఆ తర్వాత మరింత అమానుషమైన ఘటన జరిగింది.

ఒక క్యాబ్ డ్రైవర్ ఆమెను అర్ధరాత్రి సమయంలో కూకట్‌పల్లి వై జంక్షన్ సమీపంలోని రోడ్డు పక్కన ఉన్న ఫుట్‌పాత్‌పై ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయాడు. కదలలేని స్థితిలో, తీవ్రమైన గుండె నొప్పితో బిక్కుబిక్కుమంటూ నడిరోడ్డుపై పడి ఉన్న ఆమెను చూసి స్థానికులు చలించిపోయారు.

రంగంలోకి పోలీసులు

వెంటనే స్పందించిన స్థానికులు ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు చేరవేశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పావలా శ్యామల పరిస్థితిని గమనించారు. మానవత్వంతో స్పందించిన పోలీసులు ఆమెకు తక్షణ రక్షణ కల్పించి, సురక్షితంగా ఆర్కే ఫౌండేషన్ ఆశ్రమానికి తరలించారు. ప్రస్తుతం ఆమెను సనత్‌నగర్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.

స్టార్ నటికి ఇంత దారుణమైన పరిస్థితులా?

టాలీవుడ్ లో మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించి, ఇండస్ట్రీలో ఎందరో స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషించిన ఒక సీనియర్ నటి నడిరోడ్డుపై పడి ఉండటం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. గతంలో మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు సినీ ప్రముఖులు ఆమెకు ఆర్థిక సాయం అందించినప్పటికీ, శాశ్వత జీవనాధారం లేకపోవడం, నిరంతరం వైద్య ఖర్చులు పెరిగిపోవడంతో ఆమె, ఆమె కుమార్తె ఇద్దరూ తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు.

ఈ దారుణ పరిస్థితిపై స్పందించి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)తో పాటు చిత్ర పరిశ్రమ పెద్దలు ఆమెకు శాశ్వత ప్రాతిపదికన వైద్య సహాయం అందించాలని అభిమానులు, సినిమా ప్రేక్షకులు కోరుతున్నారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

ప్రశ్న: నటి పావలా శ్యామల ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు, ఆమె ఆరోగ్యం ఎలా ఉంది?

జవాబు: కూకట్‌పల్లి ఫుట్‌పాత్‌పై కనిపించిన పావలా శ్యామలను పోలీసులు, ఆర్కే ఫౌండేషన్ నిర్వాహకులు కాపాడారు. ప్రస్తుతం ఆమెను సనత్‌నగర్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి వైద్య సహాయం అందిస్తున్నారు. ఆమె గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు.

ప్రశ్న: పావలా శ్యామలను ప్రైవేట్ ఆస్పత్రి ఆమెను ఎందుకు చేర్చుకోలేదు?

జవాబు: శుక్రవారం రాత్రి గుండె నొప్పితో కూకట్‌పల్లిలోని ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లిన పావలా శ్యామల వద్ద చికిత్సకు అవసరమైన డబ్బు లేకపోవడంతో ఆస్పత్రి నిర్వాహకులు ఆమెకు అడ్మిషన్ నిరాకరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ప్రశ్న: పావలా శ్యామలకు గతంలో ఎవరైనా ఆర్థిక సహాయం చేశారా?

జవాబు: అవును.. గతంలో ఆమె దయనీయ స్థితిని చూసి మెగాస్టార్ చిరంజీవి లక్ష రూపాయలకు పైగా ఆర్థిక సాయం అందించారు. అలాగే నటుడు కాదంబరి కిరణ్ తన 'మనం ఫౌండేషన్' తరఫున రూ. 25 వేల ఆర్థిక సాయం అందించారు. అయినప్పటికీ నిరంతర అనారోగ్య సమస్యల వల్ల ఆమె ఆర్థిక పరిస్థితి మళ్లీ దెబ్బతింది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More