Ee Nagaraniki Emayindi : అరె వివేక్.. అరె కార్తీక్.. అరె కౌశిక్.. ఈ సినిమా ఎందుకు ఇంత స్పెషల్!
EE Nagaraniki Emayindi : ఈ నగరానికి ఏమైంది? ఈ సినిమా ఒక కల్ట్ క్లాసిక్ అనడంలో సందేహమే లేదు. 8ఏళ్లు గడిచినా ఇప్పటికీ మనలో చాలా మంది దాదాపు ప్రతి నెల ఈ సినిమాను ఎందుకు చూస్తున్నారు? ఇందులో ఉన్న మ్యాజిక్ ఏంటి? అసలెందుకు ఈ సినిమాకి ఇంత క్రేజ్?
2018 జూన్ 29.. థియేటర్లలోకి ఒక చిన్న సినిమా వచ్చింది. పెద్దగా స్టార్ కాస్టింగ్ లేదు, కమర్షియల్ హంగులు లేవు, అప్పటివరకు ఇండస్ట్రీ చూసిన ఏ పాత ఫార్ములాకూ అది సరిపోలేదు. కానీ, ఈరోజు.. అంటే 2026లో కూడా.. టాలీవుడ్‌లో బెస్ట్ 'ఫ్రెండ్‌షిప్' మూవీ ఏది? అని ఎవరిని అడిగినా.. క్షణం ఆలోచించకుండా చెప్పే పేరు: "ఈ నగరానికి ఏమైంది" (ఈఎన్ఈ).

నేను ఈ సినిమాకి పెద్ద ఫ్యాన్! ఫ్యాన్ అనడం కంటే.. ఈ మూవీ నా లైఫ్‌లో ఒక భాగమైపోయింది అనడం కరెక్ట్. సంతోషం వచ్చినా, బాధొచ్చినా, సక్సెస్ వచ్చినా, ఫెయిల్ అయినా.. సందర్భం ఏదైనా, సమయం ఏదైనా, చూసే సినిమా ఈ ఈఎన్ఈ. (ఆ సినిమా ఎన్నిసార్లు చూస్తావురా అని మా నాన్న చాలాసార్లు అడిగారు కూడా!)
వాస్తవానికి నా ఒక్కడికే కాదు, నాలాంటి చాలా చాలా చాలా మందికి ఈ సినిమా ఒక అడిక్షన్! బాక్సాఫీస్ దగ్గర వందల కోట్లు కొల్లగొట్టిన సినిమాలు ఎన్నో వస్తాయి, వెళతాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రమే కాలపరీక్షను తట్టుకుని 'కల్ట్ క్లాసిక్'గా మిగిలిపోతాయన్నది నా అభిప్రాయం.
అసలు ఈ నగరానికి ఏమైంది సినిమాను ప్రతి ఒక్కరూ తమ సొంత సినిమాగా ఎందుకు ఓన్ చేసుకున్నారు? తరుణ్ భాస్కర్ క్రియేట్ చేసిన ఆ మ్యాజిక్ ఏంటి?
లెట్స్ డూ ఏ డీప్ అనాలసిస్!
నీ కథ, నా కథ, మన కథ..
ఈ సినిమా సక్సెస్‌కు ఫస్ట్ అండ్ ఫోర్‌మోస్ట్ రీజన్.. క్యారెక్టరైజేషన్స్. తరుణ్ భాస్కర్ ఈ సినిమాలో హీరోలను పెట్టలేదు. మన కాలేజీ క్లాస్‌రూమ్‌ల్లో, మన హాస్టల్ రూమ్‌ల్లో, మన పక్కింట్లో తిరిగే కుర్రాళ్లను తెచ్చి స్క్రీన్ మీద పెట్టాడు.
వివేక్ (విశ్వక్ సేన్): ఇతను ప్రతి గ్యాంగ్‌లో ఉండే ఆ 'యాంగ్రీ యంగ్ మ్యాన్'. లోపల విపరీతమైన టాలెంట్, ఎనలేని సెన్సిటివిటీ ఉంటుంది.. కానీ బయటికి మాత్రం ఈగో, కోపం, ఫ్రస్ట్రేషన్‌తో రౌడీలా బిల్డప్ ఇస్తాడు. బ్రేకప్ పెయిన్‌ని తట్టుకోలేక తనని తాను నాశనం చేసుకునే క్యారెక్టర్.
కార్తీక్ (సాయి సుశాంత్): గ్యాంగ్‌లో ఉండే ప్రాక్టికల్ గై. లైఫ్‌లో సెటిల్ అవ్వాలి, లగ్జరీగా బతకాలి అనే కోరికతో.. నచ్చని ఉద్యోగం, నచ్చని పెళ్లికి కూడా కాంప్రమైజ్ అయిపోయే మిడిల్ క్లాస్ మైండ్‌సెట్.
కౌశిక్ (అభినవ్ గోమఠం): ప్రతి గ్యాంగ్‌కు ఇతనే ప్రాణం! యాక్టింగ్ అంటే పిచ్చి, నాన్న తిడుతున్నా లైట్ తీసుకునే కేర్‌లెస్ ఆటిట్యూడ్. సిట్యుయేషన్ ఎంత సీరియస్‌గా ఉన్నా తన వన్-లైనర్స్‌తో నవ్వించగలడు.
ఉప్పి (వెంకటేష్ కాకుమాను): ఎక్కువ మాట్లాడడు, గొడవల్లో దూకడు. కానీ ఫ్రెండ్స్ అంటే ప్రాణం. కెమెరా పట్టుకుని వెనుక నడిచే ఆ సైలెంట్ సపోర్టర్.
స్క్రీన్ మీద ఈ నలుగురిని చూస్తున్నప్పుడు.. "అరేయ్! వీడు అచ్చం మా కార్తీక్ లాగే ఉన్నాడురా", "ఆ కౌశిక్ గాడు మా గ్యాంగ్ లోని ఫలానా గాడేరా", “ఈ సినిమా ఏంటి నా స్టోరీలా ఉంది,” అని ఆడియన్స్ కనెక్ట్ అయిపోయారు.
అవి డైలాగ్స్ కావు.. రోజూ మాట్లాడుకునే మాటలు!
టాలీవుడ్‌లో అప్పటివరకు కామెడీ అంటే ఒక ప్రత్యేకమైన ట్రాక్ ఉండేది. బ్రహ్మానందంనో, వెన్నెల కిషోర్నో పెట్టి నవ్వించే (అప్పుడప్పుడు బలవంతంగా) ప్రయత్నం చేసేవారు. కానీ ఈఎన్ఈ ఆ క్లిషేని పూర్తిగా బ్రేక్ చేసింది. ఇందులో ఏ పాత్ర కూడా నవ్వించడానికి డైలాగ్ చెప్పదు. ఫ్రెండ్స్ మధ్య జరిగే క్యాజువల్ డిస్కషన్స్ నుంచే హ్యూమర్ జనరేట్ అవుతుంది.
అభినవ్ గోమఠం డైలాగ్ డెలివరీ ఒక ట్రెండ్ సెట్టర్.
"ఛీ ఏం టార్చర్ రా", “అసలు ఏందిరా మీ రెక్లెస్ బిహేవియర్”, “మస్తు షేడ్స్ ఉన్నాయిరా నీలో.. అట్ కమల్ హాసన్”, “అరె ఏంట్రా ఇది జేఎన్టూయూ క్వశ్చన్ పేపర్లా ఇంత ఉంది?” లాంటి డైలాగులు కేవలం సినిమా సీన్స్ లా మిగిలిపోలేదు. ఈరోజుకీ తెలుగు రాష్ట్రాల్లో యూత్ తమ డైలీ కాన్వర్జేషన్స్‌లో ఈ డైలాగులను వాడుతున్నారు. మీమ్ పేజీలకు ఇప్పటికీ ఈ సినిమానే ఒక పెద్ద అక్షయపాత్ర!
టెక్నికల్ బ్రిలియన్స్ అండ్ వివేక్ సాగర్ మ్యాజిక్..
ఈ సినిమా చూస్తున్నంత సేపు మనకు ఒక తెలుగు సినిమా చూస్తున్నట్టు అనిపించదు.. ఏదో ఒక ఇంటర్నేషనల్ ఇండీ ఫిలిం లేదా ఒక క్రేజీ హాలీవుడ్ రోడ్ ట్రిప్ మూవీ చూస్తున్న ఫీలింగ్ వస్తుంది! దానికి కారణం డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మేకింగ్ స్టైల్, నికేత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ. అండ్ వివేక్ సాగర్ మ్యూజిక్.
గోవాను అంతకుముందు చాలా సినిమాల్లో చూశాం, కానీ ఈ నగరానికి ఏమైందిలో చూపించిన గోవా.. చాలా రా గా, అంతే బ్యూటిఫుల్‌గా ఉంటుంది.
ఈ సినిమాకు ప్రాణం పోసింది ఎవరంటే.. వివేక్ సాగర్ అనే చెప్పుకోవాలి. ఆయన అందించిన ఆల్బమ్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఒక మాస్టర్‌పీస్. ఆగి ఆగి, పరదా జరుపుకొని, మారే కలలే, వీడిపోనిది ఒకటేలా వంటి పాటలు మన ‘గో టూ’ సాంగ్స్ అయిపోయాయి. బాధగా ఉన్నప్పుడు ఇవి వింటే చాలు! ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుంది కదా.
వీటన్నింటికి మించి.. బలమైన కథ!
డైరక్షన్ ఎంత బాగున్నా, మ్యూజిక్ అదరగొట్టినా, యాక్టర్లు యాక్టింగ్‌లో విజృంభించినా, లొకేషన్లు అదిరిపోయినా.. ఒక సినిమాకి సరైన 'కథ' లేకపోతే ప్రయోజనం లేదన్నది నా అభిప్రాయం. ఈఎన్ఈలో కథ, థీమ్ పర్ఫెక్ట్గా ఉన్నాయి.
ఈ నగరానికి ఏమైంది కేవలం గోవా ట్రిప్ గురించో, మందు తాగడం గురించో, కామెడీ గురించో కాదు.. దీని అంతర్లీనంగా ఒక బలమైన ఎమోషన్ ఉంది. అది.. "లైఫ్‌లో సెటిల్ అవ్వడం కోసం మన కలలను చంపేసుకోవాలా? లేక రిస్క్ అయినా సరే మనకు నచ్చిన దారిలో వెళ్లాలా?" అనే ట్వంటీస్‌లో ఉండే ప్రతి యువకుడి కన్‌ఫ్యూజన్.
అంతే కాదు.. డైరక్టర్ తరుణ్ భాస్కర్ ఫిలాసఫీ కూడా మనందరికి ఎక్కేస్తుంది. పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు “లైఫ్ అంటే నలుగురు నచ్చినోళ్లతో ఉంటూ, నాలుగు మెతుకుల అన్నం తింటూ, నచ్చిన పనిచేసుకోవడం. దాంట్లో ఉంటది సుకూన్” అని వివేక్ అనే మాటలతో మనలో ఎక్కడో ఒక తెలియని ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. "అరే! నేనేం చేస్తున్నా రా అనిపిస్తుంది."
నిజమే కదా! అదే కదా జీవితం అంటే!
గెలిచామా ఓడామా అనేది పక్కన పెడితే.. మనకు నచ్చిన దానికోసం ప్రయత్నించడంలోనే అసలైన కిక్ ఉంటుందని చెప్పడమే ఈ సినిమా అంతిమ సందేశం. ఆ ప్రయాణంలో మనల్ని నమ్మి, మనతో పాటు నిలబడే నలుగురు స్నేహితులు ఉంటే చాలు.. ఎలాంటి నగరానికైనా, ఎలాంటి లైఫ్‌కైనా మనం రెడీ అయిపోవచ్చు!
అందుకే గురు.. ఈఎన్ఈ ఎప్పటికీ ఒక ఎమోషన్!
మరి మీ ఫ్రెండ్స్ గ్యాంగ్‌లో వివేక్ ఎవరు? కౌశిక్ ఎవరు?
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


