కొలెస్ట్రాల్ తగ్గితే గుండె పదిలమేనా? ప్రముఖ డాక్టర్ కీలక సూచన
గుండె జబ్బుల నివారణకు కేవలం కొలెస్ట్రాల్ తగ్గించే మందులపైనే ఆధారపడటం సరికాదని ప్రముఖ అమెరికన్ కార్డియాలజిస్ట్ డాక్టర్ జాక్ వోల్ఫ్‌సన్ స్పష్టం చేశారు. జీవనశైలి మార్పులు, వ్యాధి మూల కారణాల గుర్తింపుతోనే పూర్ణారోగ్యం సాధ్యమని ఆయన పేర్కొన్నారు.
గుండె జబ్బులను నివారించేందుకు కొలెస్ట్రాల్ తగ్గించే మందులను వాడటం ప్రపంచవ్యాప్తంగా సర్వసాధారణంగా మారింది. అయితే, ఈ మాత్రలతో లభించే ప్రయోజనం చాలా తక్కువని, కేవలం కొలెస్ట్రాల్ గణాంకాలను తగ్గించడం వల్ల గుండెజబ్బుల మూల కారణాలు మాయం కావని ప్రముఖ అమెరికన్ కార్డియాలజిస్ట్ డాక్టర్ జాక్ వోల్ఫ్‌సన్ హెచ్చరిస్తున్నారు. కేవలం మందులపైనే ఆధారపడకుండా, సమస్య పుట్టుకొచ్చిన అసలు కారణాలను విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు.

‘వెసలియస్-సివి’ ట్రయల్ ఫలితాలపై విశ్లేషణ
ప్రతిష్టాత్మక ‘ది న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్’లో ప్రచురితమైన ‘వెసలియస్-సివి’ (VESALIUS-CV) అధ్యయన ఫలితాలను డాక్టర్ వోల్ఫ్‌సన్ ప్రస్తావించారు. గతంలో గుండెపోటు లేదా బ్రెయిన్ స్ట్రోక్ రాని, అయితే గుండెజబ్బు ముప్పు ఎక్కువగా ఉన్న 12,000 మందికి పైగా వ్యక్తులపై దాదాపు 4.6 ఏళ్ల పాటు ఈ పరిశోధన సాగింది. సాధారణ చికిత్సతో పాటు కొలెస్ట్రాల్ తగ్గించే అదనపు మందులు వాడిన వారిలో గుండె సంబంధిత ప్రమాదాలు కొంతమేర తగ్గినట్లు అధ్యయనం తెలిపింది.
మందుల వల్ల వచ్చే ప్రయోజనం స్వల్పమేనా?
ఈ ఫలితాలను విశ్లేషిస్తూ ఆయన ఒక వీడియో విడుదల చేశారు. "ఈ అధ్యయనం ప్రకారం ‘నంబర్ నీడెడ్ టు ట్రీట్’ (NNT) విలువ 56గా ఉంది. అంటే దాదాపు నాలుగున్నరేళ్ల పాటు 56 మందికి కొలెస్ట్రాల్ మందులు ఇస్తే, అందులో ఒక్కరికి మాత్రమే అదనపు ప్రయోజనం చేకూరుతుంది" అని ఆయన వివరించారు.
"రోగులు ఇప్పటికే స్టాటిన్లు, ఎజెటిమైబ్ వంటి అనేక రకాల మందులు వాడుతున్నారు. వాటికి తోడు ఈ అదనపు చికిత్స వల్ల వచ్చే ప్రయోజనం చాలా స్వల్పం" అని అభిప్రాయపడ్డారు. కొలెస్ట్రాల్‌ను అతి తక్కువ స్థాయికి తగ్గించడం దీర్ఘకాలిక ఆరోగ్యానికి సరైన మార్గం కాదని పేర్కొన్నారు. సాంప్రదాయ వైద్య విభాగం ఔషధ కంపెనీలపై విపరీతంగా ఆధారపడుతోందని ఆయన విమర్శించారు.
ఏమిటీ ‘రూట్ కాజ్ కార్డియాలజీ’?
కేవలం మందులపై ఆధారపడకుండా గుండె జబ్బులకు దారితీసే అసలు కారణాలను గుర్తించి చికిత్స చేయడమే ‘రూట్ కాజ్ కార్డియాలజీ’ అని వోల్ఫ్‌సన్ తెలిపారు. "శరీరంలో అసలు సమస్య ఎందుకు మొదలైందో తెలుసుకోవడమే నిజమైన వైద్యం" అని స్పష్టం చేశారు.
ఆరోగ్యాన్ని దెబ్బతీసే అంశాలు.. మార్చుకోవాల్సిన అలవాట్లు
అల్ట్రా-ప్రాసెస్ చేసిన ఆహారం, ప్యాక్ చేసిన నూనెలు (సీడ్ ఆయిల్స్), పురుగుమందుల అవశేషాలు, ప్లాస్టిక్స్, బారీ లోహాలు, గృహాల్లోని బూజు, రాత్రివేళల్లో కృత్రిమ వెలుతురు, నిరంతర మానసిక ఒత్తిడి, ఆరుబయట గడపకపోవడం వంటివి గుండె ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని ఆయన వివరించారు.
దీనికి ప్రత్యామ్నాయంగా సహజ సిద్ధమైన ఆహారం, ఉదయం వేళ లేత ఎండ, గాఢ నిద్ర, శరీరానికి తగిన వ్యాయామం, మానసిక ప్రశాంతత, అనుబంధాలు అలవర్చుకోవాలని సూచించారు. "మన జీవనశైలిని మార్చుకుంటే రక్తంలో కొలెస్ట్రాల్ సంఖ్యలు వాటంతట అవే అదుపులోకి వస్తాయి. దశాబ్దాలుగా శరీరానికి తప్పుడు ఆహారం ఇచ్చి, కేవలం మందుల కొరత ఉందనుకోవడం సరికాదు" అని డాక్టర్ వోల్ఫ్‌సన్ తెలిపారు.
గతంలో 16 ఏళ్ల పాటు కార్డియాక్ యాంజియోగ్రామ్స్, పేస్‌మేకర్ అమరిక వంటి ప్రక్రియలను నిర్వహించిన అనుభవం డాక్టర్ వోల్ఫ్‌సన్‌కు ఉంది. ఆయన ప్రస్తుతం 'నేచురల్ హార్ట్ డాక్టర్' సంస్థను నిర్వహిస్తున్నారు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

E-Paper


