మతిమరుపు సాధారణమా? డిమెన్షియా లక్షణమా? ఈ 7 హెచ్చరిక సంకేతాలు గుర్తించండి

వయసు పెరిగేకొద్దీ కొద్దిగా మతిమరుపు రావడం సహజమే అయినా, అది రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంటే నిర్లక్ష్యం చేయకూడదు. మతిమరుపు సాధారణమైనదా లేక డిమెన్షియా సంకేతమా అనేది తెలిపే 7 కీలక హెచ్చరికలను హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ న్యూరాలజిస్ట్ డాక్టర్ భరత్ కుమార్ సూరిశెట్టి వివరించారు.

Published on: Sep 21, 2026, 14:50:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వయసు పైబడే కొద్దీ పేరు మరచిపోవడం, తాళం చెవులు ఎక్కడో పెట్టి వెతకడం, మాట్లాడేటప్పుడు సరైన పదం వెంటనే గుర్తుకురాకపోవడం వంటివి సాధారణంగా జరిగేవే. ఇలాంటి చిన్నచిన్న పొరపాట్లు డిమెన్షియా (మతిమరుపు వ్యాధి) కావు. అయితే జ్ఞాపకశక్తి, ఆలోచనా విధానంలో వచ్చే మార్పులు తరచూ వేధిస్తూ, రోజురోజుకూ పెరుగుతూ, నిత్యజీవితంలో రోజువారీ పనులపై ప్రభావం చూపుతుంటే మాత్రం ఖచ్చితంగా శ్రద్ధ వహించాలి.

మతిమరుపు సాధారణమా? డిమెన్షియా లక్షణమా? ఈ 7 హెచ్చరిక సంకేతాలు గుర్తించండి
మతిమరుపు సాధారణమా? డిమెన్షియా లక్షణమా? ఈ 7 హెచ్చరిక సంకేతాలు గుర్తించండి

"మతిమరుపు అనేది కేవలం వయోభారం వల్ల వచ్చే సాధారణ మార్పు కాదు. అది రోజువారీ పనులకు ఆటంకం కలిగిస్తున్నప్పుడు కచ్చితంగా వైద్యులను సంప్రదించాలి" అని హైదరాబాద్ లక్డీకాపూల్ యశోద హాస్పిటల్స్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ భరత్ కుమార్ సూరిశెట్టి తెలిపారు. డిమెన్షియా ప్రారంభ సంకేతాలను సూచించే 7 కీలక లక్షణాలను ఆయన వివరించారు.

1. రోజువారీ పనులకు భంగం కలిగించే జ్ఞాపకశక్తి లోపం

ఇటీవల తెలుసుకున్న విషయాలను లేదా సమాచారాన్ని వెంటనే మరిచిపోవడం, అడిగిన ప్రశ్నలనే పదేపదే అడగడం, విధుల్లో లేదా రోజువారీ జీవితంలో ముఖ్యమైన అపాయింట్‌మెంట్‌లను మరిచిపోవడం డిమెన్షియా ప్రధాన సంకేతం. స్వతంత్రంగా చేసుకునే దినచర్యల కోసం ఇతరులపై ఎక్కువగా ఆధారపడటం మొదలుపెడతారు. ఏదైనా విషయాన్ని అప్పుడప్పుడు మరిచిపోయి, ఆ తర్వాత గుర్తుకు తెచ్చుకోవడం వయసుతో వచ్చే సహజమైన మార్పు. కానీ పూర్తిగా మరిచిపోవడమే ప్రమాదకరం.

2. సుపరిచితమైన పనులు చేయడం కష్టమవ్వడం

రోజూ ఇంట్లో క్రమం తప్పకుండా చేసే పనులను కూడా అకస్మాత్తుగా పూర్తి చేయలేకపోవడం మరొక హెచ్చరిక. ఎంతో కాలంగా వండుతున్న వంటకాన్ని సరిగ్గా చేయలేకపోవడం, ఇంటి పనుల్లో గందరగోళానికి గురవ్వడం, వాషింగ్ మెషిన్ లేదా టీవీ రిమోట్ వంటి పరికరాలను ఉపయోగించలేకపోవడం ఇందులో భాగమే. ఇది ఏదో కొత్త పరికరాన్ని వాడటానికి ఇబ్బంది పడటం లాంటిది కాదు.

3. సమయం, స్థలం పట్ల గందరగోళం

తేదీలు, రుతువులు, కాలం ప్రవాహాన్ని గుర్తించలేకపోవడం, ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న సొంత ఊరు లేదా పరిసర ప్రాంతాల్లోనే దారితప్పిపోవడం డిమెన్షియా లక్షణాల్లో కీలకమైనవి. అప్పుడప్పుడు ఏ రోజో మరచిపోయి, కొద్దిసేపటి తర్వాత గుర్తుకుతెచ్చుకోవడం పెద్ద సమస్య కానప్పటికీ, ఉన్న స్థలాన్ని లేదా సమయాన్ని పూర్తిగా మర్చిపోవడం తీవ్రమైన విషయం.

4. సంభాషణల్లో పదాలు దొరకకపోవడం

చర్చలు లేదా సంభాషణలు సాగిస్తున్నప్పుడు మాట్లాడేందుకు సరైన పదాలు దొరక్కపోవడం, ఒక పదానికి బదులు సంబంధం లేని వేరొక పదాన్ని వాడటం లేదా సంభాషణ మధ్యలోనే దారి తప్పి ఏం మాట్లాడుతున్నారో మర్చిపోవడం వంటివి జరుగుతాయి. వయసు పెరిగే కొద్దీ అప్పుడప్పుడు ఒక పదం లేదా పేరు గుర్తుకు రాకపోవడం సహజమే అయినా, ఇది నిరంతరం జరుగుతుంటే శ్రద్ధ వహించాలి.

5. వస్తువులను వింత ప్రదేశాల్లో ఉంచడం

సాధారణంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఫోన్ లేదా తాళం చెవులు ఎక్కడో పెట్టి వెతుకుతుంటారు. అయితే డిమెన్షియా ఉన్నవారు వస్తువులను అసలు సంబంధం లేని వింత ప్రదేశాల్లో (ఉదాహరణకు ఫ్రిజ్‌లో తాళం చెవులు ఉంచడం) పెడతారు. ఆ తర్వాత తాము వచ్చిన దారిని లేదా వెళ్లిన ప్రదేశాలను గుర్తు తెచ్చుకుని వెతకలేకపోతారు.

6. నిర్ణయాధికారం, అంచనా తప్పుడం

డబ్బు నిర్వహణలో స్పష్టత లేకపోవడం, రోజువారీ నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ప్రమాదకరమైన పరిస్థితులను గుర్తుపట్టలేకపోవడం ఆలోచనా శక్తిలో వచ్చే మార్పులను సూచిస్తాయి. ఆర్థికపరమైన విషయాల్లో మోసపోవడం లేదా అకస్మాత్తుగా అనవసర ఖర్చులు చేయడం కూడా ఇందులో భాగమే.

7. ప్రవర్తన, వ్యక్తిత్వంలో మార్పులు

డిమెన్షియా వచ్చిన వారిలో మానసిక స్థితి క్రమంగా మారుతుంది. స్పష్టమైన కారణం లేకుండానే చిరాకు పడటం, ఆందోళన చెందడం, ఇతరులపై అనుమానాలు పెంచుకోవడం, కుటుంబ సభ్యులతో కలవకుండా దూరంగా ఉండటం లేదా ఎంతో ఇష్టమైన వ్యాపకాలపై ఆసక్తి కోల్పోవడం వంటి మార్పులు కనిపిస్తాయి.

లక్షణాల పట్ల అప్రమత్తత అవసరం

ఈ మార్పులు అల్జీమర్స్ సహా ఇతర రకాల డిమెన్షియా వ్యాధులకు ప్రారంభ హెచ్చరికలు కావచ్చు. ఇవి కొత్తగా కనిపిస్తూ, పదేపదే రిపీట్ అవుతూ రోజురోజుకు పెరుగుతుంటే నిర్లక్ష్యం చేయకూడదు. డిమెన్షియా అనేది జ్ఞాపకశక్తి, ఆలోచనా విధానం, సమాచార మార్పిడి, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.

అయితే జ్ఞాపకశక్తి తగ్గడానికి ప్రతిసారీ డిమెన్షియానే కారణం కాకపోవచ్చు. మానసిక ఒత్తిడి, నిద్రలేమి, డిప్రెషన్, కొన్ని రకాల మందుల వాడకం, విటమిన్ లోపం లేదా ఇతర ఆరోగ్య సమస్యల వల్ల కూడా ఇలాంటి లక్షణాలు రావచ్చు. కాబట్టి ఇలాంటి మార్పులు నిరంతరం వేధిస్తుంటే కేవలం వయోభారం అని వదిలేయకుండా, వెంటనే న్యూరాలజిస్ట్‌ను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవడం శ్రేయస్కరం.

హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ న్యూరాలజిస్ట్ డాక్టర్ భరత్ కుమార్ సూరిశెట్టి
హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ న్యూరాలజిస్ట్ డాక్టర్ భరత్ కుమార్ సూరిశెట్టి
  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More