జర్మనీలో లక్షల జీతం వదులుకొని... దోశ బండి పెట్టిన భారతీయ యువకుడు
జర్మనీలో పెద్ద జీతం వచ్చే టెక్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, దోశమా రెస్టారెంట్‌ను ప్రారంభించిన మోహన్ కథ ఇప్పుడు వైరల్ అవుతోంది. పారిస్, లండన్‌లలో శాఖలు తెరిచి, తాజాగా పుణెలో బ్రాంచ్ ఓపెన్ చేసిన ఆయన, ఆరోగ్యకరమైన దోశలను ప్రపంచానికి అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
జర్మనీలో మంచి జీతం వచ్చే టెక్ ఉద్యోగం... ఎవరికైనా ఇదొక కల. కానీ, ఒక భారతీయ యువకుడికి మాత్రం ఈ కలలో సంతృప్తి దొరకలేదు. ప్యాషన్‌తో, పిండి వంటకాల ప్రేమతో మరో దారిని ఎంచుకున్నాడు. జర్మనీలో అధిక వేతనం వచ్చే ఉద్యోగాన్ని వదిలిపెట్టి, దోశ రెస్టారెంట్ ప్రారంభించిన ఆ వ్యవస్థాపకుడి అనుభవాలను ఆయన స్వయంగా ఒక వీడియోలో పంచుకున్నారు. ఈ సాహసోపేతమైన నిర్ణయం వెనుక ఉన్న సవాళ్లను ఆయన వివరించగా, ఆయన కథ ప్రజల మనసులను గెలుచుకుంది.

దోశమా (Dosamaa) సహ వ్యవస్థాపకుడైన మోహన్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో తమ ప్రయాణాన్ని వివరించారు. "జర్మనీలో పెద్ద జీతం వచ్చే టెక్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, దోశ రెస్టారెంట్ ఎలా ప్రారంభించాం? ఈ క్రమంలో ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? పారిస్ నుంచి లండన్ వరకు, ఇప్పుడు పుణె వరకు ఎలా విస్తరించాం? ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ఆరోగ్యకరమైన, గ్లూటెన్-ఫ్రీ దోశలను అందించడమే మా లక్ష్యం" అని ఆయన చెప్పుకొచ్చారు. ఆయన 2023లో ఈ రెస్టారెంట్‌ను స్థాపించారు. ఆయన లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ ప్రకారం, ప్రస్తుతం ఆయన మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు.
వీడియోలో ఏముంది?
"నేను జర్మనీలో నా అధిక-వేతన ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ఇది చేయడానికి వచ్చాను" అని మోహన్ దోశ తయారు చేస్తున్న వీడియోలో చెబుతారు. మొదట్లో స్కాలర్‌షిప్‌తో పారిస్‌లో చదువుకున్నానని, ఆ తర్వాత మంచి జీతం వచ్చే ఉద్యోగాలు సంపాదించానని ఆయన వివరించారు. అయితే, త్వరలోనే ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, తన స్నేహితులతో కలిసి దోశ రెస్టారెంట్ ప్రారంభించినట్లు పేర్కొన్నారు.
ఉద్యోగం మారడం వినడానికి బాగానే ఉన్నా, వాస్తవంలో మార్పు చాలా కష్టమైందని ఆయన అన్నారు. "అది చాలా అలసిపోయేదిగా ఉండేది. నిద్రలేని రాత్రులు, ఆపరేషనల్ ఇబ్బందులు" అని తాను ఎదుర్కొన్న అడ్డంకులను వివరించి, వాటిని ఎలా అధిగమించామో తెలిపారు. ప్రస్తుతం తన సంస్థకు ప్రపంచంలోని వివిధ నగరాల్లో శాఖలు ఉన్నాయని, తాజాగా భారతదేశంలో పుణెలో కూడా ఒక బ్రాంచ్ ప్రారంభించినట్లు మోహన్ వెల్లడించారు.
సోషల్ మీడియా స్పందనలు ఎలా ఉన్నాయి?
మోహన్ కథనంపై సోషల్ మీడియాలో భారీ స్పందన వచ్చింది. ఒక నెటిజన్ "ఈ అబ్బాయి ఆలోచనా విధానానికి మనసు కరిగిపోయింది. భారతదేశపు ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నందుకు మీకు అపారమైన గౌరవం. మీరు అద్భుతంగా చేస్తున్నారు" అని పోస్ట్ చేశారు.
మరొకరు, "మీకు ఆల్ ది బెస్ట్. నేను కూడా పారిస్, సాక్లే నుంచే" అని శుభాకాంక్షలు తెలిపారు. మూడో వ్యక్తి "గ్రేట్ బ్రిటన్ నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. మీరు ఎప్పుడైనా యూకేకి వస్తే నాకు తెలియజేయండి" అని కామెంట్ చేశారు. నాల్గవ వ్యక్తి, "బ్రదర్, మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది. మీరు మీ కలను నిజం చేసుకుంటున్నారు. కొందరు మాత్రమే ఇలా చేయగలరు" అని తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.
దోశమా తన పుణె బ్రాంచ్‌ను ఎఫ్‌సీ రోడ్‌లో ప్రారంభించింది. ఆ భారతీయ నగరంలో తమ ఓపెనింగ్ డేను చూపుతూ రెస్టారెంట్ ఒక వీడియోను కూడా పంచుకుంది.














