నేతాజీ 129వ జయంతి: "ముందే పక్వానికి రావడం ముప్పు".. నేతాజీ చెప్పిన జీవిత సత్యం

నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి సందర్భంగా ఆయన వీరత్వాన్నే కాకుండా, ఆయనలోని తాత్విక చింతనను గుర్తుచేసుకుందాం. 'అతి త్వరగా విజయం సాధించడం కంటే, నిలకడగా ఎదగడమే మిన్న' అంటూ ఆయన చెప్పిన మాటలు నేటి యువతకు దిశానిర్దేశం చేస్తున్నాయి.

Published on: Jan 23, 2026 7:22 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత స్వాతంత్య్ర సంగ్రామంలో 'నేతాజీ'గా కోట్లాది మంది గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి నేడు. 1897 జనవరి 23న కటక్‌లో జన్మించిన ఆయన, తన ధైర్య సాహసాలతో ఆనాడు బ్రిటిష్ పాలకుల గుండెల్లో వణుకు పుట్టించారు. కేవలం ఒక విప్లవ వీరుడిగానే కాకుండా, ఒక గొప్ప దార్శనికుడిగా ఆయన ఆలోచనలు నేటికీ మనల్ని ఉత్తేజితం చేస్తూనే ఉన్నాయి.

నేతాజీ 129వ జయంతి: "ముందే పక్వానికి రావడం ముప్పు".. నేతాజీ చెప్పిన జీవిత సత్యం (Britannica)
నేతాజీ 129వ జయంతి: "ముందే పక్వానికి రావడం ముప్పు".. నేతాజీ చెప్పిన జీవిత సత్యం (Britannica)

ఆదర్శాల బాటలో నేతాజీ ప్రస్థానం

భారత జాతీయ కాంగ్రెస్‌లో కీలక నేతగా ఎదిగిన నేతాజీ, సిద్ధాంతపరమైన విభేదాల వల్ల ఆ తర్వాత బయటకు వచ్చారు. 'భారత జాతీయ సైన్యం' (INA) ద్వారా ఈశాన్య భారతం, బర్మా సరిహద్దుల్లో బ్రిటిష్ సైన్యంతో నేరుగా తలపడ్డారు. "మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్య్రాన్ని ఇస్తాను" అంటూ ఆయన ఇచ్చిన నినాదం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. అయితే, ఆయన కేవలం వీరత్వానికే కాదు, పరిణత చెందిన ఆలోచనలకు కూడా మారుపేరు.

నేతాజీ డైరీ నుంచి.. ఒక అపురూప సందేశం

నేతాజీ 1937 చివరలో తన యూరప్ పర్యటన సమయంలో 'యాన్ ఇండియన్ పిల్‌గ్రిమ్ - ఆన్ అన్‌ఫినిష్డ్ ఆటోబయోగ్రఫీ' (An Indian Pilgrim) అనే పుస్తకాన్ని రాశారు. ఇందులో ఆయన పుట్టినప్పటి నుంచి ఐసీఎస్ (ICS) ఉద్యోగానికి రాజీనామా చేసే వరకు తన జీవిత ప్రస్థానాన్ని వివరించారు. ఆ పుస్తకంలోని ఒక భాగం నేటి పోటీ ప్రపంచంలో పరుగు తీస్తున్న యువతకు కనువిప్పు కలిగిస్తుంది.

నేతాజీ ఏమన్నారంటే:

"చెట్టుకైనా, మనిషికైనా కాలం రాకముందే అతి త్వరగా పక్వానికి రావడం మంచిది కాదు. అలా జరిగితే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ప్రకృతి సిద్ధమైన క్రమ క్రమ ఎదుగుదలకు ఏదీ సాటి రాదు. ప్రారంభంలో అద్భుత ప్రతిభాపాటవాలు కనబరిచే వారు మనల్ని ఆశ్చర్యపరిచినప్పటికీ, వారు భవిష్యత్తులో తమ ఆశయాలను పూర్తిస్థాయిలో నెరవేర్చలేక విఫలమవుతుంటారు."

అతి వేగం కంటే.. నిలకడైన ఎదుగుదలే ముఖ్యం

నేతాజీ చెప్పిన ఈ మాటలను నేటి కాలానికి అన్వయించుకుంటే అద్భుతమైన అర్థం కనిపిస్తుంది. ఒక చెట్టు కాలం రాకముందే పండ్లు ఇస్తే అది ఎక్కువ కాలం తట్టుకోలేక బలహీనపడిపోతుంది. మనిషి జీవితం కూడా అంతే. నేడు ప్రతి ఒక్కరూ తమ సామాజిక హోదాను పెంచుకోవడానికి, ఇతరుల కంటే వేగంగా సక్సెస్ సాధించాలని ఉరుకులు పరుగులు తీస్తున్నారు. సోషల్ మీడియా ప్రభావంతో తమ తోటివారితో పోల్చుకుంటూ తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు.

కానీ, నేతాజీ సందేశం ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. ఏ రంగంలోనైనా పునాది బలంగా ఉండాలి. అనుభవం లేకుండా, లోతైన అవగాహన లేకుండా వచ్చే విజయాలు ఎక్కువ కాలం నిలవవు. సహనం, క్రమశిక్షణతో కూడిన నిలకడైన ఎదుగుదలే మనల్ని గమ్యం వైపు చేరుస్తుంది. తొందరపాటుతో సాధించే విజయాలు 'బర్న్ అవుట్'కు (మానసిక అలసట) దారితీస్తాయని ఆయన హెచ్చరించారు.

నిజమైన విజయం అంటే కేవలం లక్ష్యాన్ని చేరుకోవడం కాదు, ఆ ప్రయాణంలో మనల్ని మనం ఎంతగా మలుచుకున్నామన్నదే ముఖ్యం. నేతాజీ 129వ జయంతి సందర్భంగా, ఆయన నేర్పిన ఈ నిలకడ, సహనం అనే సూత్రాలను పాటిస్తూ మన జీవితాలను మెరుగుపరుచుకుందాం.