ప్రేమికుల రోజున సర్‌ప్రైజ్ ఇవ్వాలా? ఈ 5 చోట్లకు తీసుకెళ్తే ఫిదా అవుతారు

2026 ప్రేమికుల రోజు శనివారం రావడంతో అద్భుతమైన వీకెండ్ ప్లాన్ చేసుకునే అవకాశం దొరికింది. ఆఫీసు పనులతో బిజీగా ఉండి ఇప్పటి వరకు ట్రిప్ ప్లాన్ చేయలేకపోయారా? చింతించకండి. మీకోసం 5 అద్భుతమైన రొమాంటిక్ ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి.

Published on: Feb 06, 2026 3:47 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రేమలో మునిగి తేలేందుకు సిద్ధమా? వాలెంటైన్స్ డే అంటేనే ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే ఆత్మీయ అనుబంధాన్ని వేడుక చేసుకోవడం. 2026లో ఫిబ్రవరి 14 సరిగ్గా శనివారం నాడు రావడంతో, సెలవుల గురించి పెద్దగా ఆలోచించకుండానే ఒక చిన్నపాటి విహారయాత్రను ప్లాన్ చేసుకోవచ్చు. కొందరు ముందే రిజర్వేషన్లు చేసుకుని సిద్ధంగా ఉంటే, మరికొందరు ఆఫీసు పనుల ఒత్తిడిలో పడి ప్లానింగ్‌ను ఆఖరి నిమిషం వరకు వాయిదా వేస్తుంటారు. మీరు కూడా ఆ 'లాస్ట్ మినిట్' జాబితాలో ఉంటే, మీ భాగస్వామితో కలిసి ఏకాంతంగా గడపడానికి ఇక్కడ కొన్ని బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి.

ప్రేమికుల రోజున విహారయాత్ర (Pexel)
ప్రేమికుల రోజున విహారయాత్ర (Pexel)

సాధారణంగా వాలెంటైన్స్ డే వీకెండ్‌లో అన్ని పాపులర్ టూరిస్ట్ ప్లేస్‌లు రద్దీగా ఉంటాయి. కానీ, రొటీన్‌కు భిన్నంగా కాస్త ప్రశాంతతను, కొత్తదనాన్ని ఇచ్చే ఐదు ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. వాయనాడ్, కేరళ (Wayanad)

ప్రకృతి ఒడిలో సేదతీరాలని అనుకునే జంటలకు వాయనాడ్ ఒక స్వర్గధామం. దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు, రకరకాల వన్యప్రాణులతో ఈ ప్రాంతం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది. ముఖ్యంగా ఇక్కడి నియోలిథిక్ కాలం నాటి పురాతన గుహలు, అందమైన రిసార్టులు మీ వీకెండ్‌ను మరింత కలర్‌ఫుల్‌గా మారుస్తాయి. ప్రకృతి ప్రేమికులైతే మాత్రం వాయనాడ్ కచ్చితంగా మీ ఫస్ట్ ఛాయిస్ కావాలి.

కేరళలోని వయనాడ్ ప్రాంతం (Pexels)
కేరళలోని వయనాడ్ ప్రాంతం (Pexels)

2. కూర్గ్, కర్ణాటక (Coorg)

మీకు కొండలు, పచ్చని ప్రకృతి అంటే ఇష్టమా? అయితే కూర్గ్‌ను మించిన మరో ఆప్షన్ లేదు. పశ్చిమ కనుమల్లోని ఈ అందమైన ప్రాంతంలో ఎటు చూసినా కాఫీ తోటలు, సుగంధ ద్రవ్యాల గుబాళింపులు మీకు స్వాగతం పలుకుతాయి. ఇక్కడి హోమ్‌స్టేలు, లగ్జరీ రిసార్టులు మీ ట్రిప్‌ను మరింత రొమాంటిక్‌గా మారుస్తాయి. స్థానిక వంటకాలను రుచి చూస్తూ, జలపాతాల హోరులో మీ భాగస్వామితో గడిపే సమయం మర్చిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోతుంది.

కూర్గ్ జలపాతాలు (Unsplash)
కూర్గ్ జలపాతాలు (Unsplash)

3. హావ్ లాక్ ఐలాండ్, అండమాన్ (Havelock Island)

కేవలం ప్రకృతి మాత్రమే కాదు, కాస్త సాహసం కూడా తోడవ్వాలి అనుకునే జంటలు 'స్వరాజ్ ద్వీప్' అని పిలిచే హావ్ లాక్ ఐలాండ్‌కు వెళ్లొచ్చు. తెల్లని ఇసుక తిన్నెలు, నీలి రంగు సముద్ర తీరం మీ వాలెంటైన్స్ డేకు గ్రాండ్ లుక్ ఇస్తాయి. ఇక్కడ స్కూబా డైవింగ్, కయాకింగ్ వంటి యాక్టివిటీస్ చేస్తూ ఎంజాయ్ చేయొచ్చు. పోర్ట్ బ్లెయిర్ నుంచి కేవలం 70 కిలోమీటర్ల దూరంలోనే ఉండటం వల్ల ప్రయాణం కూడా సులభంగానే ఉంటుంది.

హావెలాక్ ఐలాండ్‌లోని రాధానగర్ బీచ్ (Hindustan Times)
హావెలాక్ ఐలాండ్‌లోని రాధానగర్ బీచ్ (Hindustan Times)

4. తవాంగ్, అరుణాచల్ ప్రదేశ్ (Tawang)

మీరు 'వైట్ వాలెంటైన్స్ డే' జరుపుకోవాలని ఉందా? అంటే చుట్టూ మంచు కురుస్తుంటే, ఆ మంచులో మీ ప్రియమైన వారితో గడపాలని ఉందా? అయితే వెంటనే అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌కు టికెట్స్ బుక్ చేసుకోండి. మంచుతో కూడిన పర్వత శిఖరాలు, నిశ్శబ్దంగా ఉండే లోయలు ప్రేమికులకు ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తాయి. ఇక్కడి పురాతన బౌద్ధ మఠాలు (Monasteries) చూస్తుంటే వేరే ప్రపంచంలో ఉన్నామా అనే భావన కలుగుతుంది.

తవాంగ్, అరుణాచల్ ప్రదేశ్ (Tawang) (Unsplash)
తవాంగ్, అరుణాచల్ ప్రదేశ్ (Tawang) (Unsplash)

5. కౌసాని, ఉత్తరాఖండ్ (Kausani)

వీకెండ్ మొత్తం ఏ హడావుడి లేకుండా ప్రశాంతంగా గడపాలని కోరుకుంటే ఉత్తరాఖండ్‌లోని కౌసాని సరైన ప్రదేశం. హిమాలయ పర్వత శ్రేణుల్లో సుమారు 1900 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ చిన్న పట్టణం నుంచి నందాదేవి, త్రిశూల్, పంచచూలి వంటి శిఖరాలను స్పష్టంగా చూడొచ్చు. దట్టమైన పైన్ వృక్షాలు, పచ్చని తోటల మధ్య ఉండే ఆశ్రమాలు మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. మీ జీవిత భాగస్వామితో కబుర్లు చెప్పుకుంటూ హిమాలయాల అందాలను ఆస్వాదించడానికి ఇది బెస్ట్ స్పాట్.

కౌసాని, ఉత్తరాఖండ్ (Kausani) (Pixabay)
కౌసాని, ఉత్తరాఖండ్ (Kausani) (Pixabay)