AC Safety Tips Telugu : మండుతున్న ఎండల నుంచి ఇంటికి రాగానే ఏసీ ఇచ్చే చల్లని గాలి మన అలసటను తీరుస్తుంది. కానీ….. అదే ఏసీ మన అజాగ్రత్త వల్ల పేలిపోతే? ఊహించడానికే భయంకరంగా ఉంటుంది. ఇటీవల ఢిల్లీలోని వివేక్ విహార్, గోకుల్ పురి వంటి ప్రాంతాల్లో జరిగిన ఘోర ప్రమాదాలు మనల్ని భయపెడుతున్నాయి. ఈ ప్రమాదాల్లో చిన్నారులతో సహా పలువురు ప్రాణాలు కోల్పోయారు. అసలు ఏసీ పేలుతుందా….? దానికి గల సాంకేతిక కారణాలేంటి….? మనం చేయకూడని తప్పులేవో ఇక్కడ చూద్దాం….
ఏసీలు ఎందుకు పేలుతాయి…?

సాధారణంగా ఏసీ పేలుడు అనేది ఒక్క క్షణంలో జరిగేది కాదు. దీర్ఘకాలికంగా పేరుకుపోయిన సాంకేతిక లోపాలు, 'ఓవర్ హీటింగ్' (అధికంగా వేడెక్కడం) లేదా విద్యుత్ లోపాలు దీనికి ప్రధాన కారణం. అవుట్ డోర్ యూనిట్‌కు గాలి ఆడే సౌకర్యం లేకపోవడం, ఫిల్టర్లలో దుమ్ము పేరుకుపోవడం వల్ల వేడి బయటకు వెళ్లలేక యూనిట్ లోపల ఒత్తిడి పెరుగుతుంది. అలాగే ఏసీలో వాడే ఆర్-32 వంటి గ్యాస్ లీకై, ఏదైనా చిన్న స్పార్క్ తగిలితే అది భారీ మంటలకు దారితీస్తుంది.
మనం చేసే 5 ప్రధాన తప్పులు:
- సర్వీసింగ్ నిర్లక్ష్యం : "గతేడాదే కదా కొన్నాం.. ఇప్పుడే సర్వీస్ అవసరమా?" అని చాలా మంది అనుకుంటారు. ఏసీ కొత్తదైనా, పాతదైనా ప్రతి వేసవి ప్రారంభంలో సర్వీసింగ్ చేయించడం తప్పనిసరి. సర్వీస్ చేయకపోతే లోపల దుమ్ము పేరుకుపోయి మెషిన్ మీద లోడ్ పెరుగుతుంది.
- నాణ్యత లేని వైరింగ్ : ఏసీ అనేది భారీ విద్యుత్తును వినియోగించుకునే పరికరం. దీనికి నాణ్యమైన కేబుల్స్, విడిగా ఎంసీబీ (MCB) ఉండాలి. పాతబడిన వైరింగ్ లేదా వదులుగా ఉన్న కనెక్షన్ల వల్ల షార్ట్ సర్క్యూట్ సంభవించి పేలుడుకు దారితీస్తుంది.
- నాన్-స్టాప్ వాడకం : ఏసీని గంటల తరబడి, అది కూడా విరామం లేకుండా వాడటం వల్ల కంప్రెసర్ తీవ్రంగా వేడెక్కుతుంది. అది మెషిన్ మాత్రమే.. రోబో కాదు అని గుర్తించాలి. మధ్యమధ్యలో ఏసీకి కాసేపు విరామం ఇవ్వడం వల్ల దాని ఆయుష్షు పెరగడమే కాకుండా ప్రమాదాలు తప్పుతాయి.
- అవుట్ డోర్ యూనిట్ స్థలం : అవుట్ డోర్ యూనిట్‌ను నేరుగా ఎండ తగిలే చోట లేదా గాలి ఆడని ఇరుకైన బాల్కనీల్లో ఉంచకూడదు. వేడి గాలి బయటకు వెళ్లేందుకు తగినంత ఖాళీ ప్రదేశం ఉండాలి.
- గ్యాస్ లీకేజీని గుర్తించకపోవడం : ఏసీ నుంచి చల్లని గాలి రాకపోవడమో లేదా ఏదైనా వింత వాసన, వింత చప్పుడు వస్తున్నా వెంటనే మెకానిక్‌ను పిలవాలి. గ్యాస్ లీకేజీని నిర్లక్ష్యం చేస్తే అది మంటలు వ్యాపించడానికి కారణమవుతుంది.
సురక్షితంగా ఉండటానికి చిట్కాలు:
- తక్కువ ఉష్ణోగ్రత (ఉదాహరణకు 16 డిగ్రీలు) వద్ద ఏసీని ఎక్కువ సేపు ఉంచకండి. 24-26 డిగ్రీలు ఆరోగ్యానికి మరియు ఏసీకి మంచిది.
- ఏసీ కోసం నాణ్యమైన స్టెబిలైజర్‌ను వాడాలి.
- నెలకు ఒకసారి ఫిల్టర్లను శుభ్రం చేసుకోవాలి.
- ఏదైనా అసాధారణమైన శబ్దం వినబడితే వెంటనే స్విచ్ ఆఫ్ చేయాలి.