Mumbai rain news : ముంబైలో దంచికొడుతున్న వానలు- పూణెలో భారీ వర్షాలు..
Mumbai rain news : ముంబైలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో నగరానికి రెడ్ అలర్ట్ జారీ అయ్యింది. అటు పూణెలో సైతం భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఆర్థరాత్రి నుంచి ఎడతెరపి లెకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ముంబై మహా నగరం ఉలిక్కిపడింది! మరీ ముఖ్యంగా దక్షిణ- మధ్య ముంబైలో తెల్లవారుజామున చాలా తీవ్రంగా వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో ముంబైలో ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.
ముంబైకి ఐఎండీ హెచ్చరికలు ఏమిటి?
"తెల్లవారుజాము 4:30 గంటల అప్‌డేట్. గత 3 గంటలుగా దక్షిణ, మధ్య ముంబై అంతటా అతి భారీ వర్షాలుకురుస్తున్నాయి. మరో 2 గంటల పాటు కూడా కుండపోత వర్షం కొనసాగే అవకాశం ఉంది. చాలా ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోయే అవకాశం ఉంది," అని ఎక్స్‌లో వాతావరణ అప్డేట్స్కి చెందిన పోస్ట్ కనిపించింది.
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ముంబైకి సెప్టెంబర్ 15న ఉదయం 11 గంటల వరకు 'రెడ్ అలర్ట్' జారీ చేసింది. రోజంతా ఉరుములతో కూడిన మెరుపులు, భారీ వర్షాలు ఉంటాయని అంచనా వేసింది. సెప్టెంబర్ 16 మంగళవారం వరకు యెల్లో అలర్ట్ హెచ్చరికలు కొనసాగుతాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయి, ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
ముంబై వర్షాలు: ట్రాఫిక్ మళ్లింపులు ఎలా ఉన్నాయి?
రాత్రిపూట కురిసిన వర్షానికి ముంబైలోని చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ కదలికలకు అంతరాయం కలిగింది. దక్షిణ- మధ్య ముంబైలోని పలు చోట్ల రోడ్లపై భారీగా నీరు చేరడంతో వాహనదారులుఇబ్బందులు పడ్డారు. అంధేరీ సబ్‌వేలో (ఆంధేరీ వెస్ట్) నీరు చేరడంతో ట్రాఫిక్‌ను నిలిపివేశారు. వాహనాలను గోఖలే వంతెన మీదుగా దారి మళ్లించారు.
"అంధేరీ సబ్‌వే (అంధేరీ వెస్ట్) వద్ద ఒకటి నుంచి ఒకటిన్నర అడుగుల మేర వర్షపు నీరు నిలిచిపోవడంతో అక్కడ ట్రాఫిక్ మూసివేశాం. ట్రాఫిక్‌ను గోఖలే వంతెన మీదుగా మళ్లించాం," అని ముంబై ట్రాఫిక్ పోలీసులు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. భారీ వర్షాలు కొనసాగితే దక్షిణ, మధ్య ముంబైలోని మరిన్ని ప్రాంతాల్లో నీరు నిలిచిపోయే అవకాశం ఉందని వాతావరణ సంస్థలు హెచ్చరించాయి.
మహారాష్ట్రలో వాతావరణం ఎలా ఉంది?
రాబోయే రోజుల్లో మహారాష్ట్ర ఈశాన్య ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. శనివారం కొంకణ్, గోవా, మరాఠ్వాడాలో 120–200 మి.మీ. వర్షం కురిసింది. మధ్య మహారాష్ట్ర, తూర్పు మధ్యప్రదేశ్‌లో 70–110 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఉత్తర తెలంగాణ- విదర్భపై ఏర్పడిన అల్పపీడనం, దాని అనుబంధంగా ఉన్న తుపానువాయుగుండం వాయువ్య దిశగా కదులుతోందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
పూణెలో వర్షం ఎంత తీవ్రంగా ఉంది?
మరోవైపు, పూణెలో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షాలు, ఉరుములతో కూడిన మెరుపులు వరదల భయాన్ని కలిగించాయి. "భయంకరమైన" మెరుపులకు సంబంధించిన వీడియోలతో సోషల్ మీడియా నిండిపోయింది. ఐఎండీ పూణె నగరానికి సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు 'రెడ్ అలర్ట్' జారీ చేసింది. ఇది ఉదయం 7 గంటల వరకు అమల్లో ఉంటుంది. షోలాపూర్, అహ్మద్‌నగర్‌కు కూడా రెడ్ అలర్ట్స్ జారీ చేయగా, థానే- రాయ్‌గడ్‌కు ఆరెంజ్ అలర్ట్స్, నాసిక్, పాల్ఘర్, జాల్నా మరియు నాగ్‌పూర్‌కు యెల్లో అలర్ట్స్ జారీ చేశారు.
పూణెలోని జలాశయాల పరిస్థితి ఏమిటి?
పలు మీడియా నివేదికల ప్రకారం.. పూణెకు నీరందించే నాలుగు డ్యామ్‌లలో మూడు డ్యామ్‌లకు కొత్తగా నీరు చేరింది. వారస్గావ్ డ్యామ్‌లో 21 ఎంఎం, పాన్‌షేట్ డ్యామ్‌లో 20 ఎంఎం, తెమ్‌ఘర్ డ్యామ్‌లో 3 ఎంఎం వర్షపాతం నమోదైంది. వాటి మొత్తం నిల్వ ఇప్పుడు 29.09 టీఎంసీలకు చేరింది. ఇది వాటి సామర్థ్యంలో దాదాపు 98%కు సమానం.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper



