GTA 6 : జీటీఏ 6 ప్రీ-ఆర్డర్లు ఎప్పుడు? ధర ఎంత? లాంచ్​ డేట్ ఫిక్స్ అయ్యిందా? గేమర్స్​ ఇవి తెలుసుకోండి..

GTA 6 pre orders : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది గేమర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘గ్రాండ్ థెఫ్ట్ ఆటో 6’ ప్రీ-ఆర్డర్ డేట్ ఖరారైంది. రికార్డు స్థాయి బడ్జెట్‌తో వస్తున్న ఈ గేమ్ విశేషాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

Published on: Jun 20, 2026, 07:28:31 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గేమింగ్ ప్రపంచంలో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు ‘గ్రాండ్ థెఫ్ట్ ఆటో’ (జీటీఏ) సిరీస్ నుంచి మరో సంచలన గేమ్ రాబోతోంది. రాక్‌స్టార్ గేమ్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ‘జీటీఏ 6’.. ఈ ఏడాదిలోనే అత్యంత భారీ గేమింగ్ లాంచ్‌గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ గేమ్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న గేమర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు ఈ గేమ్ గురించి అధికారిక వివరాలు తక్కువగా ఉన్నప్పటికీ, తాజాగా డెవలపర్లు ఒక క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. జూన్ 25 నుంచి జీటీఏ 6 ప్రీ-ఆర్డర్లు ప్రారంభం కానున్నాయని రాక్‌స్టార్ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

జీటీఏ 6 వచ్చేస్తోంది..
జీటీఏ 6 వచ్చేస్తోంది..

ఈ యాక్షన్ అడ్వెంచర్ గేమ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గేమ్‌గా రికార్డు సృష్టించనుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. దీని నిర్మాణ వ్యయం దాదాపు 1 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 9,430 కోట్లు) కంటే ఎక్కువ ఉంటుందని అంచనా. ఈ గేమ్‌కు సంబంధించి మీరు తెలుసుకోవాల్సిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాము.

జీటీఏ 6 రిలీజ్ ఎప్పుడు?

జీటీఏ 6 గేమ్ నవంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రాక్‌స్టార్ సంస్థ జూన్ 25 నుంచే ప్రీ-ఆర్డర్లను ఓపెన్ చేస్తుండటంతో ఈ రిలీజ్ డేట్ మారే అవకాశం లేదని స్పష్టమవుతోంది. నిజానికి ఈ గేమ్ గతంలో రెండు సార్లు వాయిదా పడింది. మొదట 2025 చివరలో, ఆ తర్వాత 2026 మే నెలలో విడుదల చేయాలని భావించారు.

ఏయే ప్లాట్‌ఫారమ్స్‌లో ఆడవచ్చు? జీటీఏ 6 ధర ఎంత?

ఈ సిరీస్‌లో వస్తున్న ఈ ఆరో ప్రధాన గేమ్ ప్లేస్టేషన్ 5, ఎక్స్‌బాక్స్ సిరీస్ ఎక్స్, ఎస్​లలో అందుబాటులోకి రానుంది. అయితే పీసీ వెర్షన్ ఎప్పుడు వస్తుందనే దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. అలాగే నింటెండో స్విచ్ 2 కన్సోల్‌కు ఇది సపోర్ట్ చేస్తుందా లేదా అనేది కూడా ప్రస్తుతానికి సస్పెన్సే.

జీటీఏ 6 ధర ఎంత ఉంటుంది అనే విషయాన్ని రాక్‌స్టార్, దాని మాతృ సంస్థ టేక్-టూ ఇంకా వెల్లడించలేదు. జూన్ చివరలో ప్రీ-సేల్స్ ప్రారంభమైనప్పుడే ధర తెలిసే అవకాశం ఉంది. ఈ గేమ్ ధర సుమారు 100 డాలర్లు (దాదాపు రూ. 9,400) ఉండవచ్చని, గేమింగ్ చరిత్రలోనే ఈ స్థాయి ధర పలకడం ఇదే మొదటిసారి కానుందని కొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు!

మరోవైపు గేమ్ లాంచ్ అయిన వెంటనే అప్‌డేటెడ్ ఆన్‌లైన్ మోడ్ అందుబాటులోకి వస్తుందా లేదా అనేది కంపెనీ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. కానీ ‘జీటీఏ ఆన్‌లైన్’ సాధించిన విజయాన్ని బట్టి చూస్తే, ఖచ్చితంగా ఏదో ఒక దశలో ఆన్‌లైన్ మోడ్ ఉంటుందని భావించవచ్చు.

జీటీఏ 6 కథేంటి? క్యారెక్టర్లు ఎవరు? లొకేషన్ ఎక్కడ?

జీటీఏ చరిత్రలోనే మొదటిసారిగా ఒక 3డీ సెట్టింగ్‌లో మహిళా ప్రధాన పాత్రను పరిచయం చేస్తున్నారు! ఆమె పేరే 'లూసియా'. ఆమెతో పాటు ఆమె జీవిత భాగస్వామి, క్రైమ్ పార్ట్​నర్ అయిన 'జాసన్' రెండో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ప్లేయర్స్ ఈ ఇద్దరి క్యారెక్టర్లతోనూ గేమ్ ఆడవచ్చు. ఇప్పటివరకు విడుదలైన రెండు గేమ్‌ప్లే ట్రైలర్లను బట్టి చూస్తే, ఈ ఇద్దరి జంట అమెరికాలోని అండర్‌వరల్డ్ నేర ప్రపంచంలో సాగించే 'బాణీ అండ్ క్లైడ్' తరహా అడ్వెంచర్ కథలా ఇది ఉండబోతోంది. ఒక ఈజీ స్కెచ్ తిరగబడటంతో వీరిద్దరి జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందనేదే ప్రధాన కథాంశంగా కనిపిస్తోంది.

గత జీటీఏ గేమ్‌ల తరహాలోనే, ఈ ఆరో చాప్టర్ కూడా అమెరికాలోని ఒక ఊహాజనిత రాష్ట్రం నేపథ్యంలో సాగుతుంది. ఈసారి 'లియోనిడా' (ఇది ఫ్లోరిడాను పోలి ఉంటుంది) అనే రాష్ట్రాన్ని క్రియేట్ చేశారు. గతంలో గేమర్లను ఎంతగానో అలరించిన, మయామి నగరం ఆధారంగా రూపొందించిన ‘వైస్ సిటీ’ మళ్లీ ఈ గేమ్‌లో ప్రధాన నగరంగా రీ-ఎంట్రీ ఇస్తుండటం విశేషం.

ఈ గేమ్ రూపొందించడానికి ఎంత కాలం పట్టింది?

జీటీఏ 6 గేమ్ తయారీ వెనుక ఎన్నో ఏళ్ల కష్టం ఉందనేది బహిరంగ రహస్యం. ఈ సిరీస్‌లో వచ్చిన పాత గేమ్ ‘జీటీఏ 5’ సెప్టెంబర్ 2013లో విడుదలై, ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన గేమ్‌లలో ఒకటిగా నిలిచింది. అయితే, గత 13 ఏళ్లుగా రాక్‌స్టార్ కేవలం ఈ ఆరో భాగం పైనే పని చేసిందా అంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే 2018లో ఈ సంస్థ నుంచి ‘రెడ్ డెడ్ రిడెంప్షన్ 2’ అనే మరో భారీ సీక్వెల్ గేమ్ వచ్చింది.

తాము జీటీఏ సిరీస్‌లో ఆరో గేమ్​పై పని చేస్తున్నట్లు రాక్‌స్టార్ సంస్థ మొదటిసారిగా ఫిబ్రవరి 2022లో అధికారికంగా ప్రకటించింది. భారీ నిర్మాణ వ్యయం, అభిమానుల నుంచి ఉన్న విపరీతమైన అంచనాలను అందుకోవాలనే ఒత్తిడి కారణంగానే గేమర్స్ ఈ గేమ్ కోసం ఇంత కాలం వేచి చూడాల్సి వచ్చింది.

ఈ గేమ్ తయారీ సమయంలో కొన్ని వివాదాలు కూడా ఎదురయ్యాయి! కొన్నేళ్ల క్రితం కొంతమంది టీనేజ్ హ్యాకర్లు కంపెనీని టార్గెట్ చేసి గేమ్ ఫుటేజ్, ఇమేజ్‌లను లీక్ చేశారు. ఆ తర్వాత ఎడిన్‌బర్గ్‌లోని రాక్‌స్టార్ నార్త్ హెడ్‌క్వార్టర్స్ నుంచి తొలగించిన కొందరు కార్మికులు సంస్థపై 'యూనియన్-బస్టింగ్' (కార్మిక సంఘాలను అణచివేయడం) ఆరోపణలు చేశారు. ఇలాంటి ఎన్నో సవాళ్లను దాటుకుంటూ, నవంబర్ రిలీజ్ డేట్‌ను అందుకోవడానికి డెవలపర్లు రాత్రింబగళ్లు శ్రమిస్తున్నారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More