రాష్ట్రంలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో సీట్ల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ఇటీవలే ముగిసిన సంగతి తెలిసిందే. కౌన్సెలింగ్ అనంతరం 4 ట్రిపుల్ ఐటీల్లో కలిపి 598 సీట్లు మిగిలాయి. దీంతో ఈ సీట్ల భర్తీకి జూలై 17వ తేదీన సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు.
వెబ్ సైట్ లో వివరాలు…

కౌన్సెలింగ్ కు అర్హత సాధించిన విద్యార్థుల వివరాలను వెబ్ సైట్ https://www.rgukt.in/ లో పొందుపరిచారు. అంతేకాకుండా విద్యార్థులకు కూడా సమాచారం పంపించారు. ట్రిపుల్‌ఐటీకి ఎంపికైన విద్యార్థులు నూజివీడు, ఇడుపులపాయ క్యాంపస్ కేంద్రాల్లో నిర్వహించే కౌన్సెలింగ్ కు హాజరుకావాల్సి ఉంటుంది. ఎన్‌సీసీ, క్రీడా కోటాకు సంబంధించిన ఎంపిక జాబితా ప్రకటించాల్సి ఉంది.
రాష్ట్రంలోని ఒక్కో ట్రిపుల్ ఐటీలో 1,010 సీట్లు ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ తర్వాత… నూజివీడులో 139, ఇడుపులపాయలో 132, శ్రీకాకుళంలో 144, ఒంగోలులో అత్యధికంగా 183 సీట్లు మిగిలాయి. ఈ సీట్లను భర్తీ చేసేందుకు ఈ నెల 17వ తేదీన రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. కాగా ఫస్ట్ ఫేజ్ లో సీట్లు పొందిన వారికి ఇవాళ్టి నుంచే (జూలై 14)తరగతులను ప్రారంభించనున్నారు.
పదో తరగతిలో మార్కుల ఆధారంగా 6 ఏళ్ల బీటెక్ కోర్సులో నేరుగా ప్రవేశాలు కల్పిస్తారు. ఈసారి ట్రిపుల్ ఐటీల్లో 94.78 శాతం సీట్లను(మొదటి విడత) ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు సాధించినట్లు అధికారులు వెల్లడించారు.
మొదటి రెండేళ్లు ప్రీ యూనివర్సిటీ కోర్సుగా (యూపీసీ) పరిగణిస్తారు. మిగతా నాలుగేళ్లు బీటెక్ చదువుతారు. ఈసారి ఆర్జీయూకేటీలో ప్రవేశాలకు మొత్తం 50,541 దరఖాస్తులు రాగా.. వాటిల్లో నుంచి నాలుగు క్యాంపస్‌లకు కలిపి మెరిట్ జాబితాలను ఇటీవలనే విడుదల చేశారు.ఆ తర్వాత ధ్రువపత్రాల పరిశీలన తర్వాత… సీట్లను ఖరారు చేశారు.