Bihar stampede : బీహార్‌లో విషాదం! ఆలయంలో తొక్కిసలాట- ఏడుగురు మృతి..
శ్రావణ మాసపు సోమవారం సందర్భంగా బీహార్‌లో లఖిసరాయ్ జిల్లాలోని ప్రసిద్ధ అశోక్‌ధామ్ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు భక్తులు మృతి చెందారు. మరో 12 మందికి పైగా గాయపడ్డారు.
బీహార్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది! పవిత్ర శ్రావణ మాసపు సోమవారం కావడంతో లఖిసరాయ్ జిల్లా అశోక్‌ధామ్‌లో ఉన్న పురాతన ఇంద్రమమేశ్వర్ (అశోక్‌ధామ్) ఆలయానికి భక్తులు పోటెత్తారు. సోమవారం ఉదయం సమయంలో భారీ జనసందోహం ఒక్కసారిగా ఆలయంలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ క్రమంలో బారికేడ్లు విరిగిపడటంతో జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. 12మంది గాయపడ్డారు.

బీహార్ ఆలయంలో తొక్కిసలాట- అసలేం జరిగింది?
ఉదయం సుమారు 6:40 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగిందని లఖిసరాయ్ జిల్లా కలెక్టర్ (డీఎం) శైలేంద్ర కుమార్ తెలిపారు. క్యూలైన్లలోకి కొందరు యువకులు బలవంతంగా దూసుకెళ్లేందుకు ప్రయత్నించడం, రద్దీ ఒత్తిడికి బారికేడ్లు ఒకవైపు కూలిపోవడంతో క్యూలో ఉన్న మహిళలు ఒకరిపై ఒకరు పడిపోయారని, దీనితో ఈ ప్రమాదం సంభవించిందని వివరించారు.
అంతేకాకుండా, ఆలయ పరిసర ప్రాంతంలో విద్యుత్ తీగలు తెగిపడటం లేదా కరెంట్ షాక్ తగిలిందనే వదంతులు రావడంతో భక్తుల్లో భయాందోళనలు వ్యక్తమయ్యాయని, అందరూ ఒక్కసారిగా పరుగులు తీయడం వల్ల పరిస్థితి మరింత అదుపుతప్పిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
బీహార్ ఆలయంలో తొక్కిసలాట జరిగిన వెంటనే స్పందించిన అధికారులు క్షతగాత్రులను లఖిసరాయ్ సదర్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
ఈ ఘటనపై బీహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు.
పెరిగిపోతున్న తొక్కిసలాట ఘటనలు..
దేశంలోని ఆలయాల్లో తొక్కిసలాట ఘటనలు ఆందోళకరంగా మారాయి. గత నెలలో ఒడిశా పూరీ జగన్నాథ రథయాత్ర వేళ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరో 100మంది గాయపడ్డారు. 2025లో యూపీలో ప్రయాగ కుంభమేళలో జరిగిన తొక్కిసలాటలో 30మంది ప్రాణాలు కోల్పోయారు. అదే నెలలో ఏపీలోని తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి క్యూ కాంప్లెక్స్‌లో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించారు. 35మంది గాయపడ్డారు.
2024 జులైలో ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో ఒక ప్రవచనం కోసం వేలాది మంది భక్తులు ఎగబడ్డారు. అక్కడ తొక్కిసలాట జరగడంతో సుమారు 121 మంది మరణించారు. జమ్ముకశ్మీర్‌లోని వైష్ణో దేవి ఆలయంలో 2022 జనవరిలో భక్తులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించినప్పుడు జరిగిన తొక్కిసలాటలో కనీసం 12 మంది ప్రాణాలు కోల్పోయారు.
భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే ఇలాంటి పుణ్యక్షేత్రాల్లో సరైన రద్దీ నిర్వహణ లేకపోవడం వల్లే తరచూ ఇటువంటి విషాదాలు పునరావృతమవుతున్నాయని స్థానికులు, భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


