ప్రేమ కోసం తల్లిని హత్య చేసిన టీనేజ్ కూతురు: బెంగుళూరులో దిగ్భ్రాంతికర ఘటన
ప్రేమ వ్యవహారానికి అడ్డు చెప్పినందుకు, బెంగుళూరులో ఒక 17 ఏళ్ల టీనేజ్ కూతురు, తన ప్రియుడు, మరో ముగ్గురు మిత్రులతో కలిసి సొంత తల్లిని టవల్‌తో గొంతు నులిమి అత్యంత దారుణంగా హత్య చేసింది. ఆ తర్వాత, ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా నమ్మించడానికి ప్రయత్నించారు.
బెంగుళూరు దక్షిణ ప్రాంతంలో దిగ్భ్రాంతికరమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 17 ఏళ్ల బాలిక, ఆమె స్నేహితులు కలిసి 34 ఏళ్ల తన తల్లిని దారుణంగా చంపి, దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన ఉత్తరహళ్లిలోని వారి ఇంట్లోనే జరిగింది.

పోలీసుల వివరాల ప్రకారం.. ఆ టీనేజ్ బాలిక, ఆమె నలుగురు మిత్రులు కలిసి తల్లిని టవల్‌తో గొంతు నులిమి చంపేశారు. అనంతరం, ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు, చీర సాయంతో మృతదేహాన్ని సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడదీశారు. ఈ దారుణానికి ఒడిగట్టిన తర్వాత, బాలిక ఇంటికి తాళం వేసి కొన్ని రోజులు కనిపించకుండా పోయింది. చివరకు ఆమె తన నాయనమ్మ ఇంటికి తిరిగి వచ్చింది. అక్కడ ఆమె ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో, చివరికి నిజం ఒప్పుకున్నట్లు 'టైమ్స్ ఆఫ్ ఇండియా' పత్రిక కథనం వెల్లడించింది.
ఘటన జరిగింది ఇలా...
చనిపోయిన మహిళను నేత్రావతిగా గుర్తించారు. ఆమె ఉత్తరహళ్లిలోని సర్కిల్ మారమ్మ టెంపుల్ రోడ్‌లో నివసిస్తోంది. లోన్ రికవరీ కంపెనీలో టెలికాలర్‌గా, హెల్పర్‌గా పనిచేసేది. భర్త నుంచి విడిపోయిన నేత్రావతి.. 10వ తరగతి ఫెయిల్ అయిన తన కూతురితో కలిసి ఇంట్లోనే ఉంటోంది. బాధితురాలి అక్క అయిన అనిత ఫిర్యాదు మేరకు, భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 103 కింద హత్య కేసు నమోదు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్-వెస్ట్) అనిత బి. హద్దన్నవర్ తెలిపారు.
పోలీసుల దర్యాప్తులో ఈ నేరంలో ఐదుగురు మైనర్లు పాల్గొన్నట్లు తేలింది. వీరిలో బాలికతో పాటు, ఆమె 17 ఏళ్ల ప్రియుడు, 13 నుంచి 17 ఏళ్ల మధ్య వయస్సు గల మరో ముగ్గురు బాలురు ఉన్నారు. వీరిలో 7వ తరగతి చదువుతున్న అత్యంత చిన్న వయస్కుడిని మినహాయిస్తే, మిగతా అందరూ స్కూల్ మానేసినవారే.
ప్రేమకు అడ్డు చెప్పిందని..
పోలీస్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక, ఆమె కజిన్ ఫ్రెండ్ అయిన 17 ఏళ్ల బాలుడితో ప్రేమ సంబంధంలో ఉంది. వీళ్లంతా తరచూ నేత్రావతి ఇంటికి రావడం, తన కూతురి ప్రేమ వ్యవహారం గురించి తెలియడంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ అబ్బాయిని తన కూతురికి దూరంగా ఉండాలని గట్టిగా హెచ్చరించింది.
అక్టోబర్ 25 సాయంత్రం బాలిక, ఆమె స్నేహితులంతా ఒక మాల్ దగ్గర కలిశారు. తర్వాత అంతా కలిసి బాలిక ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో నేత్రావతి మద్యం సేవించి నిద్రపోతోంది. వారు లోపలికి వెళ్లినప్పుడు ఆమె మేల్కొని చూసింది. తన కూతురు ప్రియుడిని చూసి ఆమె కోపంతో మండిపడింది. అతడిని తీవ్రంగా తిట్టి, అతడి ఫోన్‌ను లాక్కొని పోలీసులకు ఫోన్ చేస్తానని బెదిరించింది.
దీంతో భయపడిన బాలురు, వెంటనే ఆమెపై దాడి చేశారు. ఆమెను అదుపులోకి తీసుకుని టవల్‌తో గొంతు నులిమి చంపేశారు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత, అనుమానం రాకుండా ఆత్మహత్యగా నమ్మించాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం చీరతో ఆమె మృతదేహాన్ని సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడదీసి, ఆ తర్వాత ఇంట్లో నుంచి వెళ్లిపోయారు.
అనుమానంతో బయటపడ్డ నిజం
హత్య తర్వాత బాలిక తన ప్రియుడికి పరిచయమున్న ఒక స్నేహితురాలి ఇంట్లో మూడు రోజులు ఉంది. తన తల్లి పని నిమిత్తం బయటకు వెళ్లిందని చెప్పింది. కానీ, ఆమె ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో, ఆ స్నేహితురాలు బాలికను వెళ్లిపోవాలని చెప్పింది.
మరోవైపు, గత ఐదేళ్లుగా నేత్రావతితో సంబంధంలో ఉన్న ఆమె భాగస్వామి ట్రిప్ నుంచి తిరిగి వచ్చారు. ఇంటికి తాళం వేసి ఉండటంతో, ఆమె బయటకు వెళ్లి ఉంటుందని భావించి వెళ్లిపోయారు. తర్వాత కుటుంబ సభ్యులు కిటికీలోంచి చూడగా, ఆమె ఉరివేసుకుని కనిపించింది. మొదట దాన్ని ఆత్మహత్యగా భావించారు. తమ కూతురు ప్రియుడితో పారిపోయి ఉంటుందని అనుమానించి అక్టోబర్ 29న కిడ్నాప్ కేసు కూడా పెట్టారు.
అయితే, ఆ తర్వాత బాలిక కాగ్గలిపురలోని తన నాయనమ్మ ఇంటికి వెళ్లింది. అక్కడ ఆమె అసాధారణంగా ప్రవర్తించడంతో, ఆమె అత్తయ్య నిలదీసింది. దీంతో, ఆ బాలిక తానే తన స్నేహితులతో కలిసి హత్య చేసినట్లు ఒప్పుకుంది. ఆ వెంటనే, పోలీసులు ఆ 13 ఏళ్ల చిన్న బాలుడిని మినహాయించి, ఈ ఘటనలో పాల్గొన్న మిగతా మైనర్లందరినీ అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

E-Paper


