స్వదేశీ ‘కామికేజ్‌’కు మరో బలం.. మ్యూనిషన్స్‌ ఇండియా–డ్రోగో ఏరోస్పేస్‌ మధ్య కీలక ఒప్పందం

భారత రక్షణ రంగంలో స్వదేశీ సాంకేతికతకు మరింత ఊతమిచ్చే కీలక పరిణామం చోటుచేసుకుంది. రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డిఫెన్స్‌ పబ్లిక్‌ సెక్టార్‌ అండర్‌టేకింగ్‌ (డీపీఎస్‌యూ) అయిన మ్యూనిషన్స్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎంఐఎల్‌)తో డ్రోగో ఏరోస్పేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది.

Published on: Sep 4, 2026, 15:16:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దేశీయంగా అభివృద్ధి చేసే మానవరహిత వైమానిక వాహనాలు (యూఏవీలు), లోయిటరింగ్‌ మ్యూనిషన్‌ వ్యవస్థల రూపకల్పన, అభివృద్ధి, సమీకరణపై రెండు సంస్థలు ఇక నుంచి కలిసి పనిచేయనున్నాయి. ఈ ఒప్పందంపై డ్రోగో ఏరోస్పేస్ నుంచి సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ యశ్వంత్‌ బొంతు, ఎం ఐ ఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కుమార్ వైభవ్ గౌర్ పూణే లో శుక్రవారం సంతకాలు చేశారు.

పుణెలో శుక్రవారం ఎంవోయూపై సంతకాలు చేసిన డ్రోగో ఏరోస్పేస్‌ వ్యవస్థాపకుడు, సీఈవో యశ్వంత్‌ బొంతు, ఎంఐఎల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కుమార్‌ వైభవ్‌ గౌర్‌
పుణెలో శుక్రవారం ఎంవోయూపై సంతకాలు చేసిన డ్రోగో ఏరోస్పేస్‌ వ్యవస్థాపకుడు, సీఈవో యశ్వంత్‌ బొంతు, ఎంఐఎల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కుమార్‌ వైభవ్‌ గౌర్‌

రెండు సంస్థల నైపుణ్యాలు ఒక్కటిగా..

ఈ భాగస్వామ్యంలో డ్రోగో ఏరోస్పేస్‌ యూఏవీ ప్లాట్‌ఫామ్‌ రూపకల్పన, అభివృద్ధి, తయారీతో పాటు సంబంధిత ఖాళీ పేలోడ్‌ హార్డ్‌వేర్‌ అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి సారించనుంది. మరోవైపు ఎంఐఎల్‌ తనకు ఉన్న రక్షణ మందుగుండు సామగ్రి, వార్‌హెడ్‌ సాంకేతికతలోని నైపుణ్యాన్ని అందించనుంది.

ఎంఐఎల్‌ భారత ప్రభుత్వ యాజమాన్యంలోని రక్షణ రంగ తయారీ సంస్థ. దీని ప్రధాన కార్యాలయం పూణేలో ఉంది. 2021 లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్‌ను ఏడు వేర్వేరు ప్రభుత్వ రంగ సంస్థలుగా పునర్నిర్మించినపుడు దీన్ని స్థాపించారు. భారత సాయుధ దళాలు, విదేశీ మిలిటరీలు, దేశీయ పౌర అవసరాల కోసం ఇక్కడ మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలు, రాకెట్లు, బాంబులను తయారు చేస్తారు. మ్యూనిషన్స్‌ డిజైన్‌, పేలుడు పదార్థ వ్యవస్థలు, పేలోడ్‌ ఫిల్లింగ్‌, ఫ్యూజింగ్‌, మాడ్యులర్‌ మ్యూనిషన్‌ అభివృద్ధి వంటి విభాగాల్లో ఎంఐఎల్‌ తన సాంకేతిక సామర్థ్యాన్ని ఒప్పందంలో భాగంగా వినియోగించనుంది.

యూఏవీ–మ్యూనిషన్‌ సమీకరణపై ఉమ్మడి కసరత్తు

రెండు సంస్థలు కలిసి మ్యూనిషన్‌–యూఏవీ సమీకరణ, స్థిర భద్రతా మూల్యాంకనం, ఫీల్డ్‌/రేంజ్‌ పరీక్షలు, నాణ్యతా ధ్రువీకరణ వంటి తదుపరి దశలపై పనిచేయనున్నాయి. దీంతో యూఏవీ ఇంజినీరింగ్‌, మ్యూనిషన్‌ సాంకేతికత, పేలోడ్‌ వ్యవస్థలు, రక్షణ రంగ ప్రమాణాలకు అనుగుణమైన సమీకరణ సామర్థ్యాలను ఒకే వేదికపైకి తీసుకురానున్నాయి.

విజయవంతమైన ‘డెల్టా వింగ్‌ కామికేజ్‌’ పరీక్ష

ఈ భాగస్వామ్యానికి ఇటీవల హైదరాబాద్‌లో విజయవంతంగా పరీక్షించిన ‘డెల్టా వింగ్‌ కామికేజ్‌’ ప్రత్యేక ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. డ్రోగో ఏరోస్పేస్‌ అభివృద్ధి చేస్తున్న స్వదేశీ డెల్టా-వింగ్‌ కామికేజ్‌ యూఏవీ/లోయిటరింగ్‌ మ్యూనిషన్‌ ప్లాట్‌ఫామ్‌ ఇది.ఇవి శత్రువుల లక్ష్యాన్ని సొంతంగా గుర్తించి, దానిపైకి వేగంగా దూసుకెళ్లి తాము కూడా పేలిపోతాయి.

రక్షణ రంగంలో ఉపయోగించే ‘డెల్టా వింగ్‌ కామికేజ్‌’ అనే పదానికి తెలుగులో "త్రికోణాకార ఆత్మాహుతి (డ్రోన్/విమానం)" అని అర్థం. ఈ పదాన్ని పూర్తిగా విడదీసి చూస్తే సులభంగా అర్థమవుతుంది. డెల్టా వింగ్ అంటే 'డెల్టా' అనే గ్రీకు అక్షరం లాగా త్రికోణాకారంలో ఉండే రెక్కలు అని అర్థం. ఈ రకమైన డిజైన్ ఉన్న విమానాలు లేదా డ్రోన్లు గాల్లో చాలా స్థిరంగా, వేగంగా ప్రయాణించగలవు. కామికేజ్ అనేది ఒక జపనీస్ పదం.

రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ పైలట్లు బాంబులు ఉన్న తమ విమానాలతో శత్రువుల నౌకలను నేరుగా ఢీకొట్టి ఆత్మాహుతి దాడులు చేసేవారు. రక్షణ రంగంలో దీనిని "ఆత్మాహుతి" దాడి అంటారు. ప్రస్తుత ఆధునిక యుద్ధాల్లో ఈ పదాన్ని ఎక్కువగా "కామికేజ్ డ్రోన్లు" విషయంలో వాడుతున్నారు. త్రికోణాకార రెక్కలు కలిగి ఉండి, పేలుడు పదార్థాలతో శత్రు స్థావరాలపై నేరుగా దూసుకెళ్లి, వాటితో పాటే పేలిపోయే ఆత్మాహుతి డ్రోన్లను ‘డెల్టా వింగ్‌ కామికేజ్‌’ అని పిలుస్తారు. ఇవి ఒకసారి వెళ్తే తిరిగి రావు, లక్ష్యాన్ని తాకి తనను తాను నాశనం చేసుకుంటాయి.

దీర్ఘశ్రేణి రక్షణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నట్లు డ్రోగో ఏరోస్పేస్‌ సంస్థ వెల్లడించింది. దీనికి 1,000 కిలోమీటర్ల వరకు డిజైన్‌ చేసిన మిషన్‌ పరిధి, సుమారు 20–30 కిలోల వార్‌హెడ్‌ మోసుకెళ్లే సామర్థ్యం ఉండేలా అభివృద్ధి చేస్తున్నట్లు సంస్థ తెలిపింది.

ఎంఐఎల్‌తో కుదిరిన తాజా ఒప్పందం ద్వారా ఈ ప్లాట్‌ఫామ్‌కు అవసరమైన మ్యూనిషన్‌, వార్‌హెడ్‌ సమీకరణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు తదుపరి అభివృద్ధి, సమీకరణ, ధ్రువీకరణ దశలకు ముందుకు తీసుకెళ్లేందుకు సహకారం అందనుంది.

భారత రక్షణ అవసరాలకు స్వదేశీ పరిష్కారాలే లక్ష్యం

ఈ సందర్భంగా డ్రోగో ఏరోస్పేస్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ యశ్వంత్‌ బొంతు మాట్లాడుతూ.. భారత రక్షణ అవసరాల కోసం అధునాతన స్వదేశీ మానవరహిత వ్యవస్థలను అభివృద్ధి చేయడంలో తమ డెల్టా వింగ్‌ కామికేజ్‌ కీలక ముందడుగని పేర్కొన్నారు.

డ్రోగో ఏరోస్పేస్‌కు ఉన్న యూఏవీ ఇంజినీరింగ్‌ సామర్థ్యాలు, మ్యూనిషన్స్‌ ఇండియా లిమిటెడ్‌కు ఉన్న మందుగుండు సామగ్రి, వార్‌హెడ్‌ సాంకేతిక నైపుణ్యాలు కలవడం ద్వారా ఈ భాగస్వామ్యానికి మరింత బలం చేకూరుతుందని తెలిపారు.

ఇటీవల డెల్టా వింగ్‌ కామికేజ్‌ విజయవంతమైన పరీక్ష తమకు మంచి ఊపునిచ్చిందని, తదుపరి దశలో సమీకరణ, ధ్రువీకరణ, మిషన్‌ సిద్ధత దిశగా ముందుకు సాగేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.

ఎం ఐ ఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కుమార్ వైభవ్ గౌర్ మాట్లాడుతూ “డ్రోగోతో సహకారం ద్వారా భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేయడంలో భాగస్వామ్యం కల్పిస్తున్న ఈ ఎంవోయూలో భాగమైనందుకు మేము సంతోషిస్తున్నాం.” అన్నారు.

స్వదేశీ రక్షణ తయారీకి ఊతం

భారత్‌లోనే అధునాతన రక్షణ వ్యవస్థల అభివృద్ధి, తయారీని ప్రోత్సహించాలనే లక్ష్యానికి ఈ ఎంవోయూ అనుగుణంగా ఉంది. యూఏవీ ఇంజినీరింగ్‌, లోయిటరింగ్‌ మ్యూనిషన్‌ టెక్నాలజీ, పేలోడ్‌ వ్యవస్థలు, రక్షణ రంగ సమీకరణ సామర్థ్యాలను కలిపి దేశీయ రక్షణ తయారీ వ్యవస్థను బలోపేతం చేయడమే ఈ భాగస్వామ్య ప్రధాన ఉద్దేశం.

ఈ భాగస్వామ్యం ద్వారా భారత సాయుధ దళాలు, ఇతర అధీకృత రక్షణ అవసరాల కోసం తదుపరి తరం స్వదేశీ మానవరహిత వ్యవస్థల అభివృద్ధికి రెండు సంస్థలు దోహదపడాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.

రక్షణ రంగంలో మరో స్వదేశీ అడుగు

యూఏవీ సాంకేతికతతో పాటు మ్యూనిషన్‌ సాంకేతికతను దేశీయంగా సమీకరించే దిశగా డ్రోగో ఏరోస్పేస్‌, మ్యూనిషన్స్‌ ఇండియా లిమిటెడ్‌ భాగస్వామ్యం ప్రాధాన్యం సంతరించుకుంది. స్వదేశీ రక్షణ ఉత్పత్తుల అభివృద్ధి, సాంకేతిక స్వావలంబన, దేశీయ తయారీ సామర్థ్యాల పెంపునకు ఇది మరో ముందడుగుగా నిలవనుంది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More