అందమైన అమ్మాయిలతో వలపు వల: సిలికాన్ వ్యాలీ నిపుణులే లక్ష్యం
చైనా, రష్యా దేశాల గూఢచారులు ఆకర్షణీయమైన మహిళలను ఉపయోగించి సిలికాన్ వ్యాలీలోని టెక్ నిపుణులను, వ్యాపారవేత్తలను "సెక్స్ వార్‌ఫేర్" ద్వారా లక్ష్యంగా చేసుకుంటున్నాయని 'ది టైమ్స్' నివేదిక వెల్లడించింది.
ప్రపంచ టెక్నాలజీ కేంద్రమైన అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో పనిచేసే నిపుణులపై చైనా, రష్యాల గూఢచర్యం పంజా విసురుతున్న తీరు తాజాగా వెల్లడైంది. 'ది టైమ్స్' పత్రిక నివేదిక ప్రకారం, ఈ దేశాల గూఢచార సంస్థలు ఆకర్షణీయమైన మహిళలను ఉపయోగించి సిలికాన్ వ్యాలీ నిపుణులను వలలో వేస్తున్నాయి. దీన్నే నివేదికలో "సెక్స్ వార్‌ఫేర్"గా అభివర్ణించారు.

ఏజెంట్లు కాదు, సాధారణ వ్యక్తులే:
సాధారణంగా గూఢచర్యం అంటే శిక్షణ పొందిన సీక్రెట్ ఏజెంట్లను అనుకుంటారు. కానీ, ఇక్కడ పరిస్థితి భిన్నంగా ఉంది. గూఢచార నిపుణుల (కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎక్స్‌పర్ట్స్) అంచనా ప్రకారం, చైనా, రష్యా ప్రభుత్వాలు నేరుగా ఏజెంట్లకు బదులుగా, సాధారణ పౌరులనే వాడుకుంటున్నాయి. వారు పెట్టుబడిదారులుగా, టెక్ ఉద్యోగులుగా, విద్యావేత్తలుగా మారువేషంలో వచ్చి నిపుణుల ఆలోచనలను, రహస్యాలను దొంగిలిస్తున్నారని నివేదిక స్పష్టం చేసింది. ఇలాంటి కార్యకలాపాలను కనిపెట్టడం చాలా కష్టమని నిపుణులు చెబుతున్నారు.
యుద్ధంలో ఉన్నాం, కేజీబీ కాలం పోయింది:
"ఇది పాతకాలం నాటి కథ కాదు. జర్మనీలోని ఏదో ఒక స్మోకీ గెస్ట్‌హౌస్‌లో కేజీబీ ఏజెంట్‌ను పట్టుకునే రోజులు పోయాయి" అని అమెరికా సీనియర్ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు 'ది టైమ్స్'కు తెలిపారు.
"మన శత్రువులు - ముఖ్యంగా చైనా - మన సాంకేతికతను, పాశ్చాత్య ప్రతిభను దొంగిలించడానికి ఒక 'హోల్ ఆఫ్ సొసైటీ అప్రోచ్' (సమాజాన్ని మొత్తంగా ఉపయోగించుకునే పద్ధతి)ను ఉపయోగిస్తున్నారు" అని ఆ అధికారి పరిస్థితి తీవ్రతను వివరించారు.
చాలా విచిత్రంగా ఉంది!
విదేశీ మహిళలు అమెరికా టెక్ రహస్యాలను దొంగిలించడానికి ప్రయత్నించిన ఘటనల్లో బాధితుడు జేమ్స్ ముల్వెనన్. పమీర్ కన్సల్టింగ్ చీఫ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అయిన ఆయనకు, ఆకర్షణీయమైన యువ చైనా మహిళల నుంచి లింక్డ్‌ఇన్‌లో అనేక అత్యంత తెలివైన (సొఫిస్టికేటెడ్) అభ్యర్థనలు వచ్చాయట. ఈ తరహా ఘటనలు ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగాయని ఆయన మీడియాకు తెలిపారు.
వర్జీనియాలో జరిగిన ఒక ప్రముఖ వ్యాపార సదస్సులోకి ఇద్దరు "ఆకర్షణీయమైన" చైనా మహిళలు అతిథులకు సంబంధించిన వివరాలను ఉపయోగించి ప్రవేశించడానికి ప్రయత్నించారు. అయితే, వారిని లోపలికి అనుమతించలేదు. "ఇదో వింత. నిజం చెప్పాలంటే... ఇది చాలా విచిత్రంగా ఉంది" అని 30 ఏళ్లుగా గూఢచర్యంపై నిపుణుడిగా ఉన్న ముల్వెనన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలాంటి "హనీట్రాప్" (వలపు వల) వ్యూహాలు అమెరికాకు ఒక బలహీనతగా మారుతున్నాయని ఆయన హెచ్చరించారు.
అమెరికా సంస్కృతిపై భిన్నాభిప్రాయం:
"మన చట్టాలు, సంస్కృతి ప్రకారం మనం ఇలాంటి పద్ధతులను ఉపయోగించలేం. అందుకే, సెక్స్ వార్‌ఫేర్ విషయంలో వారికి మనకంటే ఎక్కువ అసమాన (అసిమ్మెట్రిక్) ప్రయోజనం లభిస్తుంది" అని ముల్వెనన్ అమెరికా సంస్కృతిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
స్టార్టప్‌లకు అమెరికా ప్రభుత్వం వార్నింగ్:
చైనా పెట్టుబడిదారులు నిర్వహించే అంతర్జాతీయ "పిచ్ కాంపిటీషన్స్"లో పాల్గొనవద్దని అమెరికా ప్రభుత్వం స్టార్టప్‌లను గట్టిగా హెచ్చరించింది. ఇలాంటి కార్యక్రమాలు వ్యాపార ఆలోచనలు, సున్నితమైన డేటాను దొంగిలించడానికి ఉపయోగపడతాయని అధికారులు స్పష్టం చేశారు.
ఈ పోటీల్లో గెలిచినవారు నగదు బహుమతులు లేదా పెట్టుబడులు పొందాలంటే, వారి మేధో సంపత్తిని చైనాకు తరలించాలని కొన్ని సంస్థలు షరతులు పెడుతున్నాయి. కొన్ని ఈవెంట్లు అయితే, పాల్గొనడానికి ముందే వ్యాపార వ్యూహాలు, వ్యక్తిగత వివరాలు, ఫొటోలు కూడా అడుగుతున్నాయని అధికారులు తెలిపారు.
చైనా ఇలాంటి ఆలోచనలను తమ సొంతానికి వాడుకుని లేదా వాటిపై పేటెంట్లు తీసుకుని అమెరికా ఆవిష్కర్తలకు నష్టం కలిగించవచ్చని ఓ సీనియర్ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారి హెచ్చరించారు. ముఖ్యంగా యువ పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు ఈ విషయంలో ఎక్కువ ప్రమాదంలో ఉన్నారని 'ది టైమ్స్' నివేదించింది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

E-Paper


