భార్యను హత్య చేసి, చావు నాటకం ఆడి.. 15 ఏళ్ల తర్వాత ఎంబీఏ గ్రాడ్యుయేట్ అరెస్ట్!
15ఏళ్ల క్రితం, భార్యను చంపి, తన మరణంపై నాటకం ఆడిన ఓ వ్యక్తి.. ఎట్టకేలకు దిల్లీ పోలీసులకు చిక్కాడు. గుజరాత్‌లో ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
భార్యను హత్య చేసి, తాను చనిపోయినట్లు నమ్మించి ఏకంగా 15 ఏళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న ఓ ఎంబీఏ గ్రాడ్యుయేట్‌ని దిల్లీ పోలీసులు గుజరాత్‌లో అరెస్టు చేశారు! 40 ఏళ్ల వయస్సున్న ఈ నిందితుడు అరెస్టు నుంచి తప్పించుకునేందుకు తరచుగా నగరాలు మారుతున్నాడని పోలీసులు తెలిపారు.

నరోత్తమ్ ప్రసాద్ కేసు: అసలేం జరిగింది?
క్రైమ్ బ్రాంచ్ శుక్రవారం వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ నరోత్తమ్ ప్రసాద్ అనే వ్యక్తిపై 2010లో తన భార్యను హత్య చేసిన ఆరోపణ ఉంది. ఇన్నేళ్లలో, అతను వివిధ కర్మాగారాలు, దుకాణాలు, షాపులలో మేనేజర్‌గా పనిచేశాడు. అయితే, ఎక్కడా పోలీసుల దృష్టికి రాకుండా జాగ్రత్తపడ్డాడు.
పోలీసులు చెప్పిన దాని ప్రకారం, మే 2010లో ఒక తాళం వేసిన ఇంటి నుంచి దుర్వాసన వస్తుందని పొరుగువారు ఫిర్యాదు చేశారు. పోలీసులు తలుపులు పగులగొట్టి చూడగా, అక్కడ 25 ఏళ్ల మహిళ మృతదేహం కుళ్లిపోయి కనిపించింది. ఆ మహిళ ప్రసాద్ భార్యగా గుర్తించారు. ఆ మృతదేహంపై అనేక గాయాలు ఉన్నాయి. అంటే ఆమెను దారుణంగా కొట్టి, గొంతు నులిమి చంపి, ఇంట్లోనే కుళ్లిపోయేలా వదిలేసినట్లు స్పష్టమైంది.
ఆత్మహత్య లేఖతో పోలీసుల దృష్టి మళ్లింపు..
దర్యాప్తు అధికారులు సంఘటన స్థలం నుంచి ప్రసాద్ సంతకంతో కూడిన ఆత్మహత్య లేఖను ఒకటి స్వాధీనం చేసుకున్నారు. భార్యతో తరచుగా జరిగే గొడవలతో 'విసిగిపోయినట్టు, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఆ లేఖలో ఉంది. దీంతో పోలీసులు మొదట, నిందితుడు భార్యను చంపి, ఆ తర్వాత దగ్గర్లోని నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని అనుమానించారు.
ఒక దర్యాప్తు అధికారి మాట్లాడుతూ.. “మేము అతని మృతదేహం కోసం వెతికాం, కానీ దొరకలేదు. నెలల తరబడి గాలించినా సీసీటీవీ ఫుటేజీ గానీ, ఎలాంటి క్లూ గానీ లభించలేదు. అతని ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉంది. కుటుంబ సభ్యుల్లో ఎవరూ కూడా అతనితో టచ్‌లో లేరు. రెండు మూడేళ్ల తర్వాత, ప్రసాద్‌కు తెలిసిన స్థానిక వ్యక్తి ఒకరు అతన్ని దిల్లీ సమీపంలో చూశామని చెప్పడంతో కేసును మళ్లీ తెరిచాం. అప్పుడు కోర్టు ప్రసాద్‌ను ‘పరారీలో ఉన్న నేరస్తుడి’గా ప్రకటించింది,” అని తెలిపారు.
గుజరాత్‌లో ఆచూకీ.. చివరకు అరెస్ట్..
ఆ తర్వాత కొన్నేళ్లు ఈ కేసును ఎవరూ పట్టించుకోలేదు.“మేము అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు, కనిపించడానికి అవకాశం ఉన్న ప్రాంతాలపై నిఘా ఉంచాం. చివరకు, ఈ నెలలో, గుజరాత్‌లోని ఒక సబ్-ఇన్‌స్పెక్టర్‌కు సమాచారం అందింది. వడోదరలో ప్రసాద్ కనిపించాడని వారు చెప్పారు. అతను అక్కడ వేరే పేరుతో చాలా సంవత్సరాలుగా దాక్కుంటున్నాడని, తన కుటుంబాన్ని సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నాడని ఆ సమాచారం అందింది,” అని ఒక అధికారి వెల్లడించారు.
బుధవారం పోలీసులు ఒక బృందాన్ని వడోదరకు పంపి, ఒక కాటన్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న అతన్ని అరెస్టు చేశారు. విచారణలో, ప్రసాద్ తాను డబ్బు విషయంలో జరిగిన గొడవ కారణంగా భార్యను గొంతు నులిమి చంపినట్లు అంగీకరించాడు. దర్యాప్తు అధికారులను తప్పుదోవ పట్టించేందుకు ఆత్మహత్య లేఖను వదిలి వెళ్లినట్లు కూడా ఒప్పుకున్నాడు.
డీసీపీ (క్రైమ్) ఆదిత్య గౌతమ్ మాట్లాడుతూ.. "అతను సంవత్సరాలుగా గుజరాత్‌లో దాక్కున్నాడు. కుటుంబానికి పూర్తిగా దూరమయ్యాడు, ఒక కాటన్ ఫ్యాక్టరీలో మేనేజర్‌గా పనికి చేరాడు" అని తెలిపారు.ఈ విధంగా 15ఏళ్లకు నిందితుడు పోలీసులకు చిక్కాడు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


