కాలేజీలో సీనియర్ విద్యార్థినిపై అత్యాచారం.. నిందితుడి అరెస్టు
బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీ ప్రాంగణంలోనే సీనియర్ విద్యార్థినిపై జూనియర్ విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్టోబర్ 10న జరిగిన ఈ దారుణ ఘటనపై ఐదు రోజుల తర్వాత ఫిర్యాదు అందింది.
బెంగళూరు: విద్యాబుద్ధులు నేర్పే ఆలయాలుగా భావించే కళాశాలల్లో మహిళలకు రక్షణ కరువవుతోంది. బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలోనే జూనియర్ విద్యార్థి తన సీనియర్ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అక్టోబర్ 10న ఈ సంఘటన జరిగినా, విద్యార్థిని అయిదు రోజుల తర్వాత ధైర్యం చేసి తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం పోలీసుల దాకా చేరింది.

హనుమంతనగర్ పోలీసులు 21 ఏళ్ల నిందితుడు జీవన్ గౌడను అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 64 (అత్యాచారం) కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన అత్యంత భయంకరమైన వివరాలు తాజాగా వెల్లడయ్యాయి.
బెంగళూరు అత్యాచారం కేసులో 6 షాకింగ్ వివరాలు:
1. నిందితుడు-బాధితురాలు పరిచయం:
ఈ ఘటనలో బాధితురాలు ఏడో సెమిస్టర్ విద్యార్థిని కాగా, నిందితుడు జీవన్ గౌడ ఐదో సెమిస్టర్ చదువుతున్నాడు. వీరిద్దరూ ఒకే ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్నారని, ఒకరికొకరు బాగా తెలుసని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. జీవన్ గౌడ అకడమిక్ బ్యాక్‌లాగ్ కారణంగా ఒక సంవత్సరం వెనుకబడి ఉన్నట్లు గుర్తించారు.
2. లంచ్ బ్రేక్‌లో ఉచ్చు:
నిందితుడు జీవన్ గౌడ లంచ్ బ్రేక్ సమయంలో మాట్లాడాలని కోరి, విద్యార్థినిని ఏడో అంతస్తులోని ఆర్కిటెక్చర్ బ్లాక్ వద్దకు రప్పించాడు. అక్కడ ఆమెను బలవంతంగా ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.
3. బలవంతంగా పురుషుల టాయిలెట్‌లోకి ఈడ్చుకెళ్లి:
నిందితుడి చర్యలను విద్యార్థిని తీవ్రంగా ప్రతిఘటించింది. లిఫ్ట్ ద్వారా ఆ అంతస్తు నుండి కిందకు వెళ్లడానికి ప్రయత్నించగా, నిందితుడు ఆమెను వెంబడించాడు. ఆరో అంతస్తులోని పురుషుల టాయిలెట్‌లోకి బలవంతంగా లాక్కెళ్లి, తలుపు వేసి, అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దాడి సమయంలో, బాధితురాలి ఫోన్‌కు కాల్ రావడంతో నిందితుడు ఆమె ఫోన్‌ను లాక్కుని తన జేబులో పెట్టుకున్నాడని పోలీసు అధికారులు తెలిపారు.
4. 'పిల్ కావాలా?' అని కాల్ చేసి:
అత్యాచారం జరిగిన తర్వాత, నిందితుడు జీవన్ గౌడ బాధితురాలికి మళ్లీ కాల్ చేసి, “నీకు పిల్ (గర్భనిరోధక మాత్ర) కావాలా?” అని అడిగాడు. అయితే, ఆమె వెంటనే ఆ కాల్‌ను కట్ చేసిందని వార్తా సంస్థ ఏఎన్‌ఐ రిపోర్టు చేసింది.
5. ఐదు రోజుల తర్వాత ఫిర్యాదు:
ఈ దారుణం అక్టోబర్ 10న జరిగినప్పటికీ, ఆ బాధిత విద్యార్థిని మొదట్లో మానసికంగా కుంగిపోయింది. అధికారులను ఆశ్రయించడానికి భయపడింది. ఐదు రోజుల తర్వాత, ఆమె తన స్నేహితులకు విషయం చెప్పగా, వారు ధైర్యం చెప్పారు. స్నేహితుల ప్రోత్సాహంతో, తల్లిదండ్రులకు విషయం చెప్పింది. వారి మద్దతుతో అక్టోబర్ 15న హనుమంతనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు దాఖలు చేసింది.
6. సీసీటీవీ ఫుటేజ్ లేకపోవడం:
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన తరువాత, ఈ దారుణ సంఘటన జరిగిన అంతస్తులో సీసీటీవీ కెమెరాలు లేకపోవడం దర్యాప్తుకు ఒక పెద్ద అడ్డంకిగా మారింది. పోలీసులు ప్రస్తుతం ఫోరెన్సిక్ పరీక్షలను, ఇతర ఆధారాలను సేకరిస్తున్నారు.
ఈ భయంకరమైన ఘటనపై కర్ణాటకలో రాజకీయ దుమారం చెలరేగింది. కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మహిళలను రక్షించడంలో విఫలమైందని ప్రతిపక్ష నాయకులు విమర్శించారు. కళాశాల ప్రాంగణంలోనే ఇలాంటి దారుణాలు జరగడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

E-Paper


