నేను కాదు ఇండియన్ క్రికెటే ముఖ్యం.. ఛాంపియన్స్ ట్రోఫీ, ఏషియా కప్ గెలిపించింది కూడా నేనే అని గుర్తుంచుకోవాలి: గంభీర్
టీమిండియా హెడ్ కోచ్ గా కొనసాగుతారా అని అడిగినప్పుడు గౌతమ్ గంభీర్ ఇచ్చిన సమాధానం ఆసక్తి రేపుతోంది. తన కన్నా ఇండియన్ క్రికెటే ముఖ్యమని, ఆ నిర్ణయం బీసీసీఐదే అని అన్నాడు. అంతేకాదు తాను పదవి చేపట్టిన తర్వాత ఇండియన్ టీమ్ సాధించిన విజయాల గురించీ చెప్పాడు.
సౌతాఫ్రికా చేతిలో అత్యంత దారుణమైన పరాభవం తర్వాత కూడా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ రాజీనామా చేసే మూడ్‌లో లేనట్లుగా కనిపిస్తోంది. గత ఏడాది కాలంలో స్వదేశంలో అతని నేతృత్వంలో టెస్ట్ జట్టు ఏడు మ్యాచ్‌లలో ఐదింటిలో ఓడిపోయింది. గత అక్టోబర్‌లో న్యూజిలాండ్ చేతిలో 0-3తో వైట్‌వాష్ ఎదుర్కొన్న భారత జట్టు, ఇప్పుడు సౌతాఫ్రికా చేతిలో 0-2తో సిరీస్‌ను కోల్పోవడంతో గంభీర్ పై విమర్శలు వెల్లువెత్తడమే కాదు.. అతడు దిగిపోవాలన్న డిమాండూ పెరుగుతోంది. అయినా గంభీర్ మాత్రం తాను దిగిపోవడం లేదని స్పష్టం చేశాడు.

వైట్‌బాల్ క్రికెట్‌లో విజయాలు: రెడ్‌బాల్‌లో వైఫల్యం
ఈ ఏడాది వైట్‌బాల్ క్రికెట్‌లో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్‌లను గెలుచుకుంది. గంభీర్ కోచింగ్‌లో ఈ ఫలితాలు బాగానే వచ్చినా, టెస్టులలో మాత్రం ప్రతి సిరీస్‌తోనూ జట్టు ప్రదర్శన దిగజారుతోంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని కోల్పోవడం, వెస్టిండీస్, బంగ్లాదేశ్ వంటి జట్లపై మాత్రమే గెలవడం, ఇంగ్లాండ్‌లో టెస్ట్ సిరీస్‌ను డ్రా చేసుకోవడం మాత్రమే చెప్పుకోదగినవి.
ఈ నేపథ్యంలో "మీరు ఈ పదవికి సరైన వ్యక్తి అని మీరు అనుకుంటున్నారా?" అనే మిలియన్ డాలర్ల ప్రశ్నను విలేకరి అడిగినప్పుడు.. గంభీర్ ఈ ఓటమికి కొంత బాధ్యత తీసుకున్నాడు. అదే సమయంలో తాను సాధించిన విజయాలను గుర్తు చేశాడు.
"దీనిని నిర్ణయించాల్సింది బీసీసీఐ. నేను హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి సమావేశంలోనే చెప్పాను.. భారత క్రికెట్ ముఖ్యం.. నేను కాదు. నేను ఇప్పటికీ అదే మాటకు కట్టుబడి ఉన్నాను. ఒక యువ జట్టుతో ఇంగ్లాండ్‌లో కూడా ఫలితాలు సాధించిన వ్యక్తిని నేనే అన్న విషయం చాలా మంది మర్చిపోతున్నారు. న్యూజిలాండ్ గురించి చాలా మంది మాట్లాడుతున్నప్పటికీ, ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్‌లను భారత్ గెలిచినప్పుడు కోచ్‌గా ఉన్నది నేనే. ఈ జట్టుకు అనుభవం తక్కువగా ఉంది. ఈ వైఫల్యాల నుంచి వీరు నిరంతరం నేర్చుకోవాలి. గెలుపు వైపు మళ్లించడానికి సాధ్యమైనదంతా చేయాలి" అని గంభీర్ అన్నాడు. గువాహటిలో సౌతాఫ్రికా చేతుల్లో 408 పరుగుల ఘోర పరాజయం (భారత్‌కు పరుగుల పరంగా ఇదే అతిపెద్ద టెస్ట్ ఓటమి) అనంతరం జరిగిన పోస్ట్-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గంభీర్ మాట్లాడాడు.
ఓటమికి కారణాలు ఇవే
గంభీర్‌పై సోషల్ మీడియాతోపాటు కొంతమంది మాజీ భారత క్రికెటర్ల నుండి తీవ్ర విమర్శలు వచ్చాయి. గువాహటిలోని భారత రిపోర్టర్‌లు కోచ్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. న్యూజిలాండ్‌తో 0-3 ఓటమి, ఇప్పుడు దక్షిణాఫ్రికా చేతిలో వైట్‌వాష్ గురించి గుర్తు చేశారు.
ఈ రెండు సిరీస్‌ల మధ్య చాలా మార్పులు జరిగాయి. భారత క్రికెట్‌లో ముగ్గురు కీలక ఆటగాళ్లు.. రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైరయ్యారు. మరి వాళ్ల స్థానంలో ఇప్పుడు చేసిన మార్పులు సరైనావేనా అని కూడా గంభీర్ ను మీడియా ప్రశ్నించింది. దీనికి గంభీర్ ఇలా స్పందించాడు.
"తప్పు డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న ప్రతి ఒక్కరిది. అది నాయకుడుగా నా నుంచే మొదలవుతుంది. మేము కలిసి గెలుస్తాం, కలిసి ఓడిపోతాం. కాబట్టి నేను ఎవరిపైనా నింద వేయడం లేదు.. ఆ రూమ్‌లో ఉన్న ప్రతి ఒక్కరికీ బాధ్యత ఉంది. ఇది టీమ్ గేమ్" అని గంభీర్ అన్నాడు.
"నేను సాకులు చెప్పను. గతంలో ఎప్పుడూ చెప్పలేదు.. భవిష్యత్తులోనూ చెప్పను. కానీ ఈ టాప్ 8లో ఉన్న 4-5 మంది బ్యాటర్లు అక్షరాలా 15 కంటే తక్కువ టెస్ట్ మ్యాచ్‌లు ఆడారు. వారు తప్పకుండా ఎదుగుతారు. వారు మైదానంలో నేర్చుకుంటున్నారు. టెస్ట్ క్రికెట్ ఎప్పుడూ తేలికైనది కాదు. ముఖ్యంగా మీరు ఒక టాప్-క్వాలిటీ జట్టుతో ఆడుతున్నప్పుడు. మీరు వారికి సమయం ఇవ్వాలి" అని గంభీర్ అభిప్రాయపడ్డాడు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


