స్టాక్ మార్కెట్ మోసాలు: అధిక లాభాల ఆశ చూపిస్తే జాగ్రత్త

స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడుల పేరుతో జరుగుతున్న మోసాలు పెరిగిపోతున్నాయి. అధిక లాభాల హామీలు, నకిలీ యాప్‌ల పట్ల ఎలా జాగ్రత్తగా ఉండాలో, ఇన్వెస్టర్లు తీసుకోవాల్సిన రక్షణ చర్యల గురించి కోటక్ నియో ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ వివరించిన ముఖ్యాంశాలు ఇవే.

Published on: Nov 11, 2026, 14:21:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

నేటి డిజిటల్ యుగంలో ఆర్థిక మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం ఎంతో సులువగా మారింది. సరిగ్గా ఇదే పరిస్థితిని మోసగాళ్లు తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. సోషల్ మీడియా, మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లు, నకిలీ వెబ్‌సైట్ల ద్వారా సాధారణ ఇన్వెస్టర్లను బురిడీ కొట్టిస్తూ డబ్బులు కొల్లగొడుతున్నారు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడుల ప్రాథమిక సూత్రాలు తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, ఇటువంటి ఆర్థిక నేరాల సంకేతాలను గుర్తించడం కూడా అంతే కీలకమని కోటక్ నియో ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ స్పష్టం చేశారు.

కోటక్ నియో ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్
కోటక్ నియో ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్

ఇటీవలి కాలంలో సెబీ (SEBI) గుర్తింపు లేని అనేక నకిలీ సంస్థలు, ట్రేడింగ్ యాప్‌ల ద్వారా అమాయక ఇన్వెస్టర్లను మోసం చేస్తున్న ఉదంతాలు విపరీతంగా పెరిగిపోయాయి. అధిక రాబడులు ఇప్పిస్తామని నమ్మించి, వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలకు డబ్బులు బదిలీ చేయించుకుని ముంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండేందుకు ఆయన కొన్ని ముఖ్యమైన మార్గాలను పంచుకున్నారు.

అధిక రాబడుల హామీ ఇస్తే అనుమానించాల్సిందే

"తక్కువ వ్యవధిలోనే డబ్బులు రెట్టింపు చేస్తాం, రోజూ నిలకడైన లాభాలు ఇస్తాం లేదా నెలకు భారీగా ప్రాఫిట్స్ ఇప్పిస్తాం" అంటూ ఇచ్చే హామీలను ఏమాత్రం నమ్మకూడదు. స్టాక్ మార్కెట్ ఆధారిత పెట్టుబడుల్లో ఎలాంటి నష్టభయం లేని రాబడులు (Guaranteed Returns) సాధ్యం కావు. అధిక లాభాలు వచ్చే అవకాశాలు ఉన్న చోట నష్టభయం (Risk) కూడా అంతే స్థాయిలో ఉంటుంది.

ఎవరైనా అసాధారణ రాబడులు ఇస్తామని చెబితే, "ఈ లాభాలు ఎలా వస్తున్నాయి?" అని ప్రశ్నించాలి. సదరు సంస్థ లేదా వ్యక్తి వద్ద దీనికి సంబంధించిన స్పష్టమైన వివరణ, సరైన పత్రాలు లేదా గతంలో సాధించిన విశ్వసనీయమైన ట్రాక్ రికార్డ్ లేకపోతే, అటువంటి పెట్టుబడులకు దూరంగా ఉండటమే శ్రేయస్కరం.

'వెంటనే పెట్టుబడి పెట్టాలి' అనే ఒత్తిడి తేవడం

మోసగాళ్లు ఉపయోగించే మరో ప్రధాన అస్త్రం భయాన్ని, ఆతృతను సృష్టించడం. "ఈ అవకాశం పరిమిత కాలం మాత్రమే ఉంటుంది... వెంటనే డబ్బులు జమ చేయకపోతే భారీ లాభాలు కోల్పోతారు" అని ఒత్తిడికి గురిచేస్తారు. నిజమైన పెట్టుబడి నిర్ణయాల విషయంలో నిలకడగా ఆలోచించే సమయం ఉంటుంది.

ఎవరైనా త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి చేస్తే ఖచ్చితంగా వెనక్కి తగ్గాలి. సదరు ప్రొడక్ట్ ఏంటి, దాని వెనుక ఉన్న సంస్థ ఎలాంటిది, మీ ఆర్థిక లక్ష్యాలకు అది సరిపోతుందా లేదా అనేది క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అడుగు ముందుకు వేయాలి.

సంస్థ గుర్తింపును పక్కాగా తనిఖీ చేయండి

ఒక వెబ్‌సైట్ డిజైన్ బాగున్నంత మాత్రాన లేదా ప్రొఫెషనల్ లోగో ఉన్నంత మాత్రాన అది అసలైన సంస్థ కాకపోవచ్చు. పేరున్న బ్రోకింగ్ సంస్థలు, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ల పేర్లను, లోగోలను వాడుకుంటూ సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టిస్తున్నారు. అసలైన ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లను పోలిన నకిలీ యాప్‌లు, సోషల్ మీడియా గ్రూప్‌లు సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారు.

ఏదైనా సంస్థలో పెట్టుబడి పెట్టేముందు, సదరు మధ్యవర్తికి సెబీ (SEBI) లేదా సంబంధిత నియంత్రణ మండలి గుర్తింపు ఉందో లేదో అధికారిక వెబ్‌సైట్ ద్వారా స్వతంత్రంగా తనిఖీ చేయాలి. మోసగాళ్లు పంపే రిజిస్ట్రేషన్ నంబర్లు, సర్టిఫికెట్లు లేదా లింక్‌లపై మాత్రమే ఆధారపడకూడదు.

సోషల్ మీడియా ఆఫర్లతో అప్రమత్తత అవసరం

వాట్సాప్ (WhatsApp), టెలిగ్రామ్ (Telegram), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) వంటి ప్లాట్‌ఫామ్‌ల ద్వారా సమాచారం వేగంగా అందుతున్నప్పటికీ, అక్కడే నకిలీ సలహాలు, మోసపూరిత స్కీమ్‌లు ఎక్కువగా ప్రచారంలోకి వస్తున్నాయి. కేవలం కొందరికే దక్కే ప్రత్యేక స్టాక్ రికమండేషన్లు, నిశ్చిత లాభాలు లేదా ప్రత్యేక ట్రేడింగ్ ఖాతాల పేరుతో వచ్చే అపరిచిత మెసేజ్‌లను పూర్తిగా విస్మరించాలి.

రిజిస్టర్డ్ సంస్థకు సంబంధం లేని వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలకు లేదా అపరిచిత సంస్థల ఖాతాలకు డబ్బులు బదిలీ చేయమని కోరితే ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించకూడదు. ఎలాంటి చెల్లింపులు చేయాలన్నా ముందుగా సదరు ప్రాసెస్ చట్టబద్ధమైనదో కాదో స్వయంగా నిర్ధారించుకోవాలి.

పాస్‌వర్డ్‌లు, ఓటీపీలు ఎవరికీ చెప్పకూడదు

పెట్టుబడుల్లో డబ్బులు నష్టపోవడమే కాకుండా, వ్యక్తిగత డిజిటల్ డేటా చోరీకి గురయ్యే ప్రమాదం కూడా ఉంది. బ్యాంక్, బ్రోకర్ లేదా ఫైనాన్షియల్ అడ్వైజర్ పేర్లతో ఎవరు ఫోన్ చేసినా మీ పాస్‌వర్డ్‌లు, ఓటీపీ (OTP), యూపీఐ పిన్ (UPI PIN), సీవీవీ (CVV) లేదా అకౌంట్ క్రెడెన్షియల్స్ షేర్ చేయకూడదు.

అపరిచిత వ్యక్తులు పంపే లింక్‌లపై క్లిక్ చేయడం గానీ, వారు చెప్పిన యాప్‌లను డౌన్‌లోడ్ చేయడం గానీ చేయవద్దు. ఎనీడెస్క్ (AnyDesk), టీమ్‌వ్యూయర్ (TeamViewer) వంటి స్క్రీన్ షేరింగ్ యాప్‌లను అపరిచితుల సూచనల మేరకు ఇన్‌స్టాల్ చేసుకుంటే ఫోన్‌లోని సున్నితమైన ఆర్థిక వివరాలన్నీ మోసగాళ్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది.

సాధారణ నష్టం వేరు... మోసం వేరు

మార్కెట్ పరిస్థితుల వల్ల పెట్టుబడుల విలువ తగ్గడం వేరు, మోసపోవడం వేరు అని ఇన్వెస్టర్లు గుర్తించాలి. మార్కెట్‌తో అనుసంధానమైన పెట్టుబడుల్లో హెచ్చుతగ్గుల వల్ల నష్టాలు రావడం సాధారణం. అది మోసం కిందకు రాదు. కానీ, తప్పుదారి పట్టించే సమాచారం ఇవ్వడం, ఇతరుల పేర్లతో నకిలీ అవతారాలు ఎత్తడం, అనుమతి లేని ఖాతాల్లోకి నిధులు సేకరించడం వంటివి చట్టవిరుద్ధమైన మోసాలు.

మూలధన పరిరక్షణే సంపద సృష్టికి మూలం

పెట్టుబడి మోసాల నుంచి రక్షణ పొందడానికి అవగాహన, ముందస్తు తనిఖీలే ఏకైక మార్గం. అధిక రాబడుల హామీలు, అపరిచిత ఆఫర్లు, అత్యవసరమంటూ తెచ్చే ఒత్తిళ్లను ఎల్లప్పుడూ అనుమానించాలి.

"ఏదైనా ఒక ఆఫర్ నమ్మశక్యం కానంత బాగుంది అనిపిస్తే, అక్కడ క్షణం ఆగి ఆలోచించడం చాలా అవసరం" అని శ్రీకాంత్ చౌహాన్ స్పష్టం చేశారు. సంపద సృష్టిలో అసలైన మూలధనాన్ని (Capital) కాపాడుకోవడం అత్యంత ముఖ్యమైన సూత్రమని, ఏ రాబడి హామీ కూడా ఆ సూత్రం కంటే ఎక్కువ కాదని గుర్తుంచుకోవాలి.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More