JEE Mains 2026 : ఈ టిప్స్‌తో నెగిటివ్ మార్కింగ్‌కు చెక్ పెట్టండి.. మీ స్కోరు పెంచుకోండి
దేశంలోనే అత్యంత కఠినమైన జేఈఈ మెయిన్స్ పరీక్షలో విజయం సాధించాలంటే కేవలం తెలివితేటలు ఉంటే సరిపోదు, నెగిటివ్ మార్కులను నివారించే వ్యూహం కూడా ఉండాలి. ఇంకొన్ని రోజుల్లో జేఈఈ మెయిన్స్ 2026 సెషన్ 1 ప్రారంభంకానున్న వేళ మీ స్కోరును మెరుగుపరిచే కీలక టిప్స్‌ని ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీ, ఎన్ఐట, ట్రిపుల్ ఐటీ వంటి సంస్థల్లో ఇంజినీరింగ్ సీటు సాధించడమే లక్ష్యంగా లక్షలాది మంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్ పరీక్షకు సిద్ధమవుతుంటారు. ఇది కేవలం సబ్జెక్టు పరిజ్ఞానాన్ని పరీక్షించేది మాత్రమే కాదు, ఒత్తిడిలో మీరు ఎంత వేగంగా, ఎంత కచ్చితత్వంతో నిర్ణయాలు తీసుకుంటారో పరీక్షించే వేదిక. ఈ పరీక్షలో అభ్యర్థుల విజయానికి అడ్డుపడే ప్రధాన శత్రువు 'నెగిటివ్ మార్కింగ్'. ఒక్క మార్కు తేడాతో వేలల్లో ర్యాంకులు మారిపోతాయి. ఇంకొన్ని రోజుల్లో జేఈఈ మెయిన్స్ 2026 సెషన్ 1 ప్రారంభంకానున్న నేపథ్యంలో.. నెగిటివ్ మార్కులను తగ్గించుకునేందుకు ఉపయోగపడే టిప్స్‌ని ఇక్కడ తెలుసుకోండి..

జేఈఈ మెయిన్స్ 2026 సెషన్ 1- క్వశ్చన్ పేపర్ పాటర్న్..
జేఈఈ మెయిన్స్ పరీక్షలో మొత్తం 75 ప్రశ్నలు ఉంటాయి. గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాల నుంచి తలో 25 ప్రశ్నలు ఇస్తారు. ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు వస్తాయి, కానీ పొరపాటున తప్పు సమాధానం ఇస్తే ఒక మార్కు కోత పడుతుంది. మీరు సమాధానం ఇవ్వని ప్రశ్నలకు మార్కులు తగ్గవు.
అంటే ఇక్కడ గుడ్డిగా అంచనా వేయడం (గెస్వర్క్) కంటే, కచ్చితమైన సమాధానం గుర్తించడమే కీలకమని మర్చిపోవద్దు.
జేఈఈ మెయిన్స్ 2026 సెషన్ 1- నెగిfటివ్ మార్కులను తగ్గించే అస్త్రాలు ఇవే..
1. తెలిసిన వాటికే ప్రాధాన్యత: జేఈఈ మెయిన్స్ ప్రశ్నాపత్రం చూడగానే మొదట మీకు బాగా తెలిసిన, సులభమైన ప్రశ్నలను పూర్తి చేయండి. దీనివల్ల తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు రావడమే కాకుండా, మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కష్టమైన ప్రశ్నలతో మొదలుపెట్టి సమయాన్ని, ప్రశాంతతను వృథా చేసుకోవద్దు.
2. గుడ్డిగా అంచనా వేయకండి: "సమాధానం తెలియకపోయినా ఏదో ఒకటి పెడదాంలే" అనే ఆలోచన జేఈఈ వంటి పరీక్షల్లో అస్సలు పనికిరాదు. మీకు సమాధానంపై కనీసం 70-80 శాతం నమ్మకం లేకపోతే ఆ ప్రశ్నను వదిలేయడమే ఉత్తమం. ఒకవేళ ఎలిమినేషన్ పద్ధతిలో రెండు ఆప్షన్లను ఖచ్చితంగా తప్పు అని తేల్చగలిగితేనే, మిగిలిన వాటిలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి.
3. సమయ పాలన - మైండ్ గేమ్: మీకు ఉన్న 3 గంటల సమయాన్ని మూడు సబ్జెక్టులకు సమానంగా కేటాయించుకోవాలి. మీ బలాన్ని బట్టి ఏ సబ్జెక్టును ముందుగా పూర్తి చేయాలో ప్లాన్ చేసుకోండి. మాక్ టెస్టులు రాయడం ద్వారా ఏయే ప్రశ్నలకు ఎంత సమయం పడుతుందో మీకు ఒక అవగాహన వస్తుంది.
4. పాత ప్రశ్నపత్రాల సాధన: గత ఏళ్లలో జేఈఈ మెయిన్స్‌లో వచ్చిన ప్రశ్నలను ప్రాక్టీస్ చేయడం వల్ల ఏ చాప్టర్ల నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయో తెలుస్తుంది. ఏ తరహా ప్రశ్నల్లో నెగిటివ్ మార్కులు వచ్చే అవకాశం ఉందో మీరు ముందే పసిగట్టవచ్చు.
5. మాక్ టెస్ట్ అండ్ విశ్లేషణ: జేఈఈ మెయిన్స్ 2026 సెషన్ 1కి వెళ్లే ముందు, కనీసం 7 నుంచి 8 మాక్ టెస్టులు రాయడం తప్పనిసరి. కేవలం టెస్టు రాయడమే కాదు, పరీక్ష అయ్యాక ఎక్కడ తప్పులు చేశారో విశ్లేషించుకోండి. తప్పు చేసిన ప్రతి ప్రశ్న వెనుక ఉన్న కారణాన్ని సరిదిద్దుకుంటేనే అసలు పరీక్షలో ఆ తప్పు రిపీట్ అవ్వదు.
6. ప్రశాంతంగా ఉండండి: పరీక్షా హాల్‌లో ఆందోళన చెందితే.. తెలిసిన సమాధానాలు కూడా తప్పు పెట్టే అవకాశం ఉంటుంది. దీర్ఘ శ్వాస తీసుకుంటూ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. ఆందోళనలో చేసే చిన్న చిన్న లెక్కల తప్పులే నెగిటివ్ మార్కులకు దారితీస్తాయని గుర్తుపెట్టుకోండి.
చివరిగా ఒక్క విషయం.. సమయం మిగిలితే సబ్మిట్ చేసే ముందు ఒక్కసారి మీ సమాధానాలను సరిచూసుకోండి. ముఖ్యంగా క్యాలిక్యులేషన్స్ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేయండి.
పట్టుదల, ప్రణాళికాబద్ధమైన సాధన ఉంటే జేఈఈ మెయిన్స్‌లో నెగిటివ్ మార్కులను దాటుకుని మెరుగైన ర్యాంకు సాధించడం అసాధ్యమేమీ కాదు.
జేఈఈ మెయిన్స్ 2026 సెషన్ 1 జనవరి 21న ప్రారంభంకానుంది. అడ్మిట్ కార్డులను ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) ఇప్పటికే విడుదల చేసింది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


