Kia Sorento : 7 సీటర్ కియా సోరెంటో ఎస్యూవీ లాంచ్ రేపే- ఇంజిన్, ధర వివరాలు..
భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి కియా ఇండియా తన మోస్ట్ ప్రెస్టీజియస్ 3-రో ఎస్యూవీ 'సోరెంటో'ను రేపు, శుక్రవారం అధికారికంగా విడుదల చేయనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం ప్లాంట్‌లో తయారవుతున్న ఈ ప్రీమియం కారు ధర, హైబ్రిడ్ ఇంజిన్, అడ్వాన్స్‌డ్ ఫీచర్ల వివరాలను ఇక్కడ చూసేయండి..
భారత కార్ల మార్కెట్లో తనదైన ముద్ర వేసిన దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం ‘కియా’.. మరో భారీ ఆఫరింగ్‌తో కస్టమర్లను పలకరించేందుకు సిద్ధమైంది. ఆటో ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న 3-రో ఎస్యూవీ “కియా సోరెంటో”.. రేపు (సెప్టెంబర్ 17న) భారత మార్కెట్లో అధికారికంగా విడుదల కానుంది. ఈ శక్తివంతమైన 7-సీటర్ ఎస్యూవీ కోసం కంపెనీ ఇప్పటికే ప్రీ-బుకింగ్స్‌ను ప్రారంభించింది. ఆసక్తి గల వినియోగదారులు రూ. 25,000 టోకెన్ అడ్వాన్స్ చెల్లించి తమ కారును బుక్ చేసుకోవచ్చని సంస్థ ప్రకటించింది.

ఈ కొత్త సోరెంటో ఎస్‌యూవీని పెట్రోల్-హైబ్రిడ్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులోకి తెస్తున్నారు. అంతేకాకుండా, ఎలాంటి రోడ్డు పరిస్థితులనైనా తట్టుకునేలా 'ఆల్-వీల్ డ్రైవ్' (ఏడబ్ల్యూడీ) టెక్నాలజీని కూడా ఇందులో అందిస్తున్నారు.
కియా సోరెంటో- అనంతపురంలోనే తయారీ.. ఊహించని ధర!
తెలుగు ప్రజలకు గర్వకారణంగా, ఈ ప్రీమియం కారు మన ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా పెనుకొండ వద్ద ఉన్న కియా తయారీ కేంద్రంలోనే అసెంబుల్ అవుతోంది. విడిభాగాలను స్థానికంగానే అసెంబుల్ చేస్తుండటంతో, తయారీ వ్యయం గణనీయంగా తగ్గి వినియోగదారులకు అందుబాటు ధరలోనే లభించనుంది.
కియా సోరెంటో ఎస్యూవీ ఎక్స్-షోరూమ్ అంచనా ధరలు రూ. 28 లక్షల నుంచి రూ. 36 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. ఇందులో డీజిల్ వేరియంట్ ధర కాస్త తక్కువగా, స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్ ధర కొద్దిగా ఎక్కువగా ఉండనుంది.
కాగా, భారత్‌లో కియా విడుదల చేస్తున్న మొదటి హైబ్రిడ్ మోడల్ మాత్రమే కాకుండా, ఫస్ట్ ఐసిఈ 7-సీటర్ ఎస్యూవీ కూడా ఇదే కావడం విశేషం. మార్కెట్లో ఇది నేరుగా జీప్ మెరిడియన్, స్కోడా కోడియాక్, టాటా సఫారీ, మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ వంటి ప్రముఖ కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.
కియా సోరెంటో అత్యాధునిక ఫీచర్లు, భద్రత..
కియా సోరెంటోలో కస్టమర్లను ఆకట్టుకునేలా అగ్రశ్రేణి సాంకేతికతను అందించారు:
ఇంటీరియర్ అండ్ ఇన్ఫోటైన్మెంట్: డ్యూయల్ 12.3-ఇంచ్ పనోరమిక్ కర్వ్‌డ్ డిస్‌ప్లేలు, వైర్‌లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, బిల్ట్-ఇన్ నేవిగేషన్, బాస్ ఆడియో సిస్టమ్.
కంఫర్ట్: డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, హెడ్స్-అప్ డిస్‌ప్లే.
సేఫ్టీ (భద్రత): ప్రమాదాలను ముందుగానే ఊహించే 'లెవెల్-2 అడాస్' (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్), 360-డిగ్రీ కెమెరా, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఎఈస్సీ), హిల్ స్టార్ట్ అసిస్ట్.
కియా సోరెంటో ఇంజిన్ సామర్థ్యం, పర్ఫార్మెన్స్..
కియా సోరెంటో ఎస్యూవీ రెండు విభిన్న ఇంజిన్ ఆప్షన్లతో వస్తోంది:
1.6ఎల్ టర్బో పెట్రోల్-హైబ్రిడ్: ఎలక్ట్రిక్ మోటార్, చిన్న బ్యాటరీ, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కలిసి పనిచేస్తుంది. ఇది 238 పీఎస్ పవర్, 380 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
2.2ఎల్ టర్బో డీజిల్: ఇప్పటికే కియా కార్నివాల్‌లో నిరూపితమైన ఈ 4-సిలిండర్ ఇంజిన్ 202 పీఎస్ పవర్, 441 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.
ఏడబ్ల్యూడీ సిస్టమ్‌తో వస్తున్న ఈ ఎస్యూవీ కేవలం 9 సెకన్లలోనే 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 196 కిలోమీటర్లు. విభిన్న రకాల రహదారులపై ప్రయాణించడానికి వీలుగా ఇందులో మల్టిపుల్ డ్రైవ్, టెర్రైన్ మోడ్‌లను అందించారు.
రేపటి లాంచ్ ఈవెంట్లో ఈ కియా సోరెంటోకి సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులోకి వస్తాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


