Kolkata Stampede : దుర్గా మాత సన్నిధిలో ఘోర విషాదం! కోల్‌కతా మండపం తొక్కిసలాటలో 19మంది బలి
కోల్‌కతాలోని ప్రముఖ చోర్‌బగాన్ దుర్గా పూజ మండపం వద్ద సప్తమి వేడుకల వేళ ఘోర తొక్కిసలాట చోటుచేసుకుంది. వర్షం, భారీ జనసందోహం కారణంగా జరిగిన ఈ దుర్ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోగా, 25 మంది తీవ్రంగా గాయపడ్డారు.
దసరా ఉత్సవాలు, నవరాత్రులకు పెట్టింది పేరైన పశ్చిమ బెంగాల్లో తీవ్రి విషాదం అలుముకుంది. రాజధాని కోల్‌కతాలోని ప్రసిద్ధ చోర్‌బగాన్ సార్వజనీన్ దుర్గోత్సవ సమితి పూజా మంటపం వద్ద శనివారం రాత్రి భీకర తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో 19 మంది భక్తులు దుర్మరణం చెందారు. మృతుల్లో అత్యధికులు చిన్న పిల్లలు, ఆడవారే ఉన్నారు. ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ప్రమాదంలో మరో 25 మంది తీవ్రంగా గాయపడగా, వారిని వెంటనే కోల్‌కతా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

కోల్‌కతా తొక్కిసలాట.. ఘటన ఎలా జరిగింది?
గిరీష్ పార్క్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శారదా పార్క్ (చోర్‌బగాన్) పండల్ వద్ద సప్తమి రాత్రి 7:40 గంటల సమయంలో దేవీ దర్శనం కోసం వేలాది మంది భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు! సరిగ్గా అదే సమయంలో ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వర్షం ప్రారంభమైంది. వర్షంలో తడవకుండా ఉండేందుకు పండల్ వెలుపల వేచి ఉన్న జనం ఒక్కసారిగా ఎగ్జిట్ గేటు వైపు చొచ్చుకెళ్లారు. ఇదే సమయంలో నిర్వాహకులు చేసిన ఒక ప్రకటన వల్ల గుంపులో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది! జనం ముందుకు తోసుకురావడంతో కొందరు కిందపడిపోగా, వారిపై నుంచి గుంపు తొక్కుకుంటూ వెళ్లడంతో ఈ కోల్‌కతా తొక్కిసలాట ఘటన జరిగింది.
సిట్టింగ్ జడ్జితో 'సిట్' విచారణ.. కఠిన చర్యలు!
కోల్‌కతా తొక్కిసలాట ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంఘటనా స్థలాన్ని, ఆసుపత్రిలోని బాధితులను పరామర్శించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కోల్‌కతా హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చేత ఈ విచారణ జరిపిస్తామని ప్రకటించారు. ఈ సిట్ బృందంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు ఉంటారని తెలిపారు.
మండపం వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని సీఎం అన్నారు. జనాన్ని నియంత్రించడంలో విఫలమైన పూజ కమిటీ సభ్యులు, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరినీ విడిచిపెట్టేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
కోల్‌కతా తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
రూ. 25 లక్షల పరిహారం.. ప్రభుత్వ ఉద్యోగం
దుర్గా పూజ మండపం తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు రూ. 25 లక్షల ఆర్థిక సాయంతో పాటు కుటుంబంలో ఒకరికి 'గ్రూప్-డీ' ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. గాయపడిన వారికి రూ. 5 లక్షల పరిహారంతో పాటు వారు కోరుకున్న ఆసుపత్రిలో ఉచితంగా పూర్తిస్థాయి వైద్య సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. అత్యవసర సమాచారం కోసం బెంగాల్ ప్రభుత్వం (18003455678), కోల్‌కతా పోలీసులు (03322141310) ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చారు.
ప్రధాని మోదీ సంతాపం..
కోల్‌కతా తొక్కిసలాట ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్. రవి, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ, మాజీ సీఎం మమతా బెనర్జీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర సంతాపం తెలిపారు.
"కోల్‌కతా దుర్గా పూజ పండల్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. మృతుల కుటుంబాలకు నా సానుభూతి తెలుపుతున్నాను," అని ప్రధాని కార్యాలయం (పీఎంఓ) పేర్కొంది.
ప్రమాదం జరిగిన వెంటనే చోర్‌బగాన్ పండల్‌ను పోలీసులు పూర్తిగా మూసివేశారు.
మరోవైపు నగరంలో దాదాపు 3,500 కంటే ఎక్కువ దుర్గాపూజ మంటపాలు ఉన్నందున, తదుపరి ప్రమాదాలు జరగకుండా మిగిలిన ప్రముఖ థీమ్ పండళ్ల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


