‘నేపాల్​లో ఏం జరిగిందో చూడండి’- ఇండియాలో పోర్నోగ్రఫి నిషేధంపై సుప్రీంకోర్టు..

'నేపాల్‌లో ఏం జరిగిందో చూడండి' అంటూ ఇండియాలో పోర్నోగ్రఫీ నిషేధంపై దాఖలైన పిటిషన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు మొగ్గు చూపలేదు! అయితే 4 వారాల తర్వాత విచారించేందుకు అంగీకరించింది.

Published on: Nov 3, 2025, 14:00:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పోర్నోగ్రఫీని నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు మొగ్గు చూపలేదు. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. "నిషేధం విషయంలో నేపాల్‌లో ఏం జరిగిందో చూడండి," అంటూ సెప్టెంబర్‌లో పొరుగు దేశంలో జరిగిన జెన్​ జెడ్​ నిరసనలను ప్రధానంగా ప్రస్తావించింది.

పోర్నోగ్రఫీ నిషేధ పిటిషన్‌పై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు..
పోర్నోగ్రఫీ నిషేధ పిటిషన్‌పై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు..

కొన్ని నెలల ముందు నేపాల్​ ప్రభుత్వం అనేక సోషల్​ మీడియా సైట్లను నిషేధించింది. అనంతరం, ప్రభుత్వంలో అవినీతి పేరుకుపోయిందని, పాలనను కూలదోయడానికి నేపాల్​ యువత హింసాత్మక ఆందోళనలు చేశారు.

ఇండియాలో పోర్నోగ్రఫీ నిషేధంపై పిటిషన్‌ను నాలుగు వారాల తర్వాత విచారించడానికి అంగీకరించింది ప్రధాన న్యాయమూర్తి బీఆర్‌ గవాయ్​ నేతృత్వంలోని డివిజన్ బెంచ్. సీజేఐ గవాయ్​ నవంబర్ 23న పదవీ విరమణ చేయనున్నారు.

పోర్నోగ్రఫీపై నిషేధం- పిటిషనర్ విజ్ఞప్తి ఏంటి?

పిటిషనర్ తన దరఖాస్తులో కేంద్ర ప్రభుత్వానికి కింది అంశాలపై ఆదేశాలు ఇవ్వాలని కోరారు:

పోర్నోగ్రఫీని నియంత్రించడానికి ఒక జాతీయ విధానాన్ని రూపొందించడం.

ముఖ్యంగా మైనారిటీ వయస్సు వారిలో పోర్నోగ్రఫీని వీక్షించకుండా నిరోధించడానికి ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం.

ప్రజా ప్రదేశాల్లో అలాంటి కంటెంట్‌ను చూడటంపై నిషేధం విధించడం.

"డిజిటలైజేషన్ తర్వాత, ప్రతి ఒక్కరూ డిజిటల్‌గా అనుసంధానం అయ్యారు. చదువుకున్నా, చదువుకోకపోయినా పర్వాలేదు. ఒక క్లిక్‌తో అంతా అందుబాటులో ఉంది," అని పిటిషన్​లో పేర్కొన్నారు.

ఇంటర్నెట్‌లో పోర్నోగ్రఫీని ప్రోత్సహించే "బిలియన్ల" కొద్దీ సైట్‌లు అందుబాటులో ఉన్న విషయాన్ని ప్రభుత్వం కూడా అంగీకరించిందని పిటిషనర్ తెలిపారు.

"కోవిడ్ సమయంలో పాఠశాల పిల్లలు డిజిటల్ పరికరాలను ఉపయోగించారు. ఈ పరికరాల్లో పోర్నోగ్రఫీ చూడకుండా నియంత్రించే యంత్రాంగం లేదు," అని ఆందోళన వ్యక్తం చేశారు.

"ఈ సమస్యను ఎదుర్కోవడానికి సమర్థవంతమైన చట్టం లేదు. పోర్నోగ్రఫీ చూడటం వ్యక్తులపై, సమాజంపై, ముఖ్యంగా 13 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల అభివృద్ధి చెందుతున్న మనస్సులపై తీవ్ర ప్రభావం చూపుతోంది," అని వివరించారు.

'షాకింగ్ డేటా', పరిష్కార మార్గాలు..

పిటిషనర్ కొన్ని 'షాకింగ్ డేటా' వివరాలను కూడా కోర్టుకు సమర్పించారు. భారతదేశంలో 20 కోట్లకు పైగా పోర్నోగ్రాఫిక్ వీడియోలు లేదా క్లిప్‌లు (చైల్డ్ సెక్సువల్ మెటీరియల్‌తో పాాటు) అమ్మకానికి అందుబాటులో ఉన్నాయని ఈ డేటా సూచిస్తోంది.

అలాగే, సమాచార సాంకేతిక (ఐటీ) చట్టంలోని సెక్షన్ 69ఏ కింద ఈ సైట్‌లను ప్రజలు యాక్సెస్ చేయకుండా నిరోధించే అధికారం ప్రభుత్వానికి ఉందని కూడా పిటిషనర్ ప్రస్తావించారు.

పిల్లలు చూసే కంటెంట్‌ను పరిమితం చేయడానికి లేదా వారు ఏం బ్రౌజ్ చేస్తున్నారో రియల్-టైమ్‌లో ట్రాక్ చేయడానికి తల్లిదండ్రులకు లేదా సంరక్షకులకు అనుమతించే సాఫ్ట్‌వేర్‌లు అందుబాటులో ఉన్నాయని కూడా కోర్టు దృష్టికి వచ్చింది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More