New Army Chief : భారత సైన్యానికి కొత్త బాస్.. ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్

New Army Chief Lt Gen Dhiraj Seth : భారత తదుపరి ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ నియమితులయ్యారు. సీనియారిటీ ప్రాతిపదికన కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. జూన్ 30న ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు.

Published on: Jun 14, 2026, 06:48:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత రక్షణ రంగంలో సరికొత్త అధ్యాయం మొదలుకానుంది. భారత సైన్యం (ఇండియన్ ఆర్మీ) తదుపరి చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ నియమితులయ్యారు. ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం రాత్రి అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.

ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ధీరాజ్ సేథ్
ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ధీరాజ్ సేథ్

ప్రస్తుత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది జూన్ 30న పదవీ విరమణ చేయనుండటంతో.. అదే రోజు మధ్యాహ్నం లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ ఆర్మీ చీఫ్‌గా (COAS) బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ నియామకంలో కేంద్ర ప్రభుత్వం సీనియారిటీ సూత్రాన్ని పాటించింది.

వైస్ చీఫ్ నుంచి అత్యున్నత పదవికి..

లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ ప్రస్తుతం భారత సైన్యానికి వైస్ చీఫ్‌గా సేవలందిస్తున్నారు. సైన్యంలో ఆధునికీకరణను వేగవంతం చేయడం, వ్యూహాత్మక ప్రణాళికలు రచించడంలో ఆయనకు పెట్టింది పేరు. ఖడక్వాస్లాలోని ప్రతిష్టాత్మక నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) పూర్వ విద్యార్థి అయిన ధీరజ్ సేథ్, 1986 డిసెంబర్‌లో ఆర్మోర్డ్ కోర్స్‌లో చేరడం ద్వారా తన సైనిక ప్రస్థానాన్ని ప్రారంభించారు.

  • ఎడారి ప్రాంతంలో ఆర్మోర్డ్ రెజిమెంట్‌కు, పశ్చిమ థియేటర్‌లో ఆర్మోర్డ్ బ్రిగేడ్‌కు నాయకత్వం వహించారు. జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద నిరోధక దళానికి (కూడా ఆయన కమాండర్‌గా వ్యవహరించారు.
  • భారత సైన్యంలోనే అత్యంత శక్తివంతమైన స్ట్రైక్ ఫార్మేషన్‌లలో ఒకటైన 'సుదర్శన్ చక్ర కార్ప్స్'కు ఆయన కమాండర్‌గా వ్యవహరించారు. అలాగే ఢిల్లీ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్‌గా సేవలు అందించారు.
  • భారత సైన్యానికి చెందిన రెండు కీలక ఆపరేషనల్ కమాండ్‌లు అయిన సౌత్ వెస్ట్రన్ కమాండ్, సదరన్ కమాండ్‌లకు నేతృత్వం వహించిన అరుదైన ఘనత లెఫ్టినెంట్ జనరల్ ధీరాజ్ సేథ్ సొంతం. రెండున్నరేళ్లకు పైగా ఈ వ్యూహాత్మక థియేటర్లలో ఆయన రక్షణ పర్యవేక్షణ బాధ్యతలు చూశారు.

తన సుదీర్ఘ సర్వీసులో సైన్యానికి సంబంధించిన వ్యూహాత్మక ప్రణాళికలు, దళాల నిర్వహణ, సరికొత్త సాంకేతిక సామర్థ్యాల అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించారు. దేశ భద్రతకు ఆయన చేసిన విశేష సేవలకు గాను పరమ విశిష్ట సేవా మెడల్ (PVSM), ఉత్తమ యుద్ధ సేవా మెడల్ (UYSM), అతి విశిష్ట సేవా మెడల్ (AVSM) వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలు లభించాయి.

మిలిటరీ విద్యలో లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ ఎప్పుడూ టాపర్‌గా నిలిచారు. ఎన్నో రక్షణ కోర్సుల్లో ఆయన అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. హయ్యర్ కమాండ్ కోర్స్, నేషనల్ డిఫెన్స్ కాలేజీ (NDC) గ్రాడ్యుయేట్ అయిన ఆయన.. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ప్రతిష్టాత్మక 'కమాండ్ అండ్ స్టాఫ్ కోర్స్'కు కూడా హాజరై అంతర్జాతీయ రక్షణ వ్యూహాలపై పట్టు సాధించారు. ఈయన నియామకం పట్ల రక్షణ రంగ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More