20 మంది చిన్నారుల కోసం ప్రాణత్యాగం: అంగన్‌వాడీ కార్యకర్త సాహసానికి ఊరు కన్నీరు!
మధ్యప్రదేశ్‌లోని నీముచ్ జిల్లాలో హృదయాన్ని కదిలించే ఘటన జరిగింది. తేనెటీగల దాడి నుంచి 20 మంది చిన్నారులను రక్షించే క్రమంలో అంగన్‌వాడీ వంట మనిషి కంచన్ బాయి ప్రాణాలు కోల్పోయారు. తన ప్రాణాలను పణంగా పెట్టి పిల్లలను సురక్షితంగా లోపలికి పంపిన ఆమె సాహసానికి గ్రామస్తులు నివాళులర్పిస్తున్నారు.
పిల్లల ప్రాణాలు కాపాడటం కోసం ఓ అంగన్‌వాడీ వర్కర్ తన ప్రాణాలనే పణంగా పెట్టింది. మధ్యప్రదేశ్‌లోని నీముచ్ జిల్లా రణ్‌పూర్ గ్రామంలో జరిగిన ఈ ఘటన ప్రతి ఒక్కరినీ కలిచివేస్తోంది. కన్నతల్లి ప్రేమను మించిన సాహసంతో ఆమె చేసిన పోరాటం ఆ ఊరి పిల్లలకు పునర్జన్మ నిచ్చింది. కానీ ఆమె మాత్రం ప్రాణాలు కోల్పోయింది.

అసలేం జరిగిందంటే?
మాడవదా పంచాయతీ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రం ఆవరణలో పిల్లలంతా ఆడుకుంటున్నారు. సరిగ్గా అదే సమయంలో ఎక్కడి నుంచి వచ్చిందో గానీ ఒక్కసారిగా తేనెటీగల దండు ఆ పిల్లలపైకి దూసుకొచ్చింది. ఏం జరుగుతుందో అర్థం కాక పిల్లలు హాహాకారాలు చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న వంట మనిషి కంచన్ బాయి మేఘవాల్ ఏమాత్రం ఆలోచించలేదు. తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని తెలిసినా వెనకాడలేదు.
దగ్గరలో ఉన్న టార్పాలిన్ పట్టాలు, చాపలను తీసుకుని ఒక్కో పిల్లలని వాటితో కప్పుతూ, తన శరీరంతో కవచంలా మారి లోపలికి పంపింది. పిల్లలందరినీ సురక్షితంగా గదిలోకి పంపే వరకు ఆమె అక్కడే నిలబడింది. ఈ క్రమంలో వందలాది తేనెటీగలు ఆమెను చుట్టుముట్టాయి. వందల సంఖ్యలో ఆమె శరీరంపై కుట్టాయి. చిట్టచివరి పిల్లాడు సురక్షితంగా లోపలికి వెళ్లే వరకు ఆమె ఆ నొప్పులను భరించింది.
చికిత్స పొందుతూ కన్నుమూత..
గ్రామస్తులు అక్కడికి చేరుకునే సరికి కంచన్ బాయి స్పృహ తప్పి పడిపోయింది. కానిస్టేబుల్ కాలునాథ్, పైలట్ రాజేష్ రాథోడ్ వెంటనే ఆమెను సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆమె మృతదేహం నిండా ఉన్న తేనెటీగల కాట్లు ఆమె చేసిన పోరాటానికి, సాహసానికి సాక్ష్యంగా నిలిచాయి.
కుటుంబానికి పెద్ద దిక్కు..
కంచన్ బాయి కేవలం అంగన్‌వాడీలో వంట మనిషి మాత్రమే కాదు, ఆ గ్రామంలోని ‘జై మాతా దీ’ స్వయం సహాయక సంఘం అధ్యక్షురాలిగా కూడా సేవలందిస్తున్నారు. ఆమె కుటుంబానికి ఆమే ఏకైక ఆధారము. ఆమె భర్త శివలాల్ పక్షవాతంతో బాధపడుతున్నారు. ఆమెకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
మంగళవారం పోస్ట్‌మార్టం అనంతరం ఆమె మృతదేహం గ్రామానికి చేరుకోవడంతో రణ్‌పూర్ విషాదంలో మునిగిపోయింది. గ్రామస్తులంతా కన్నీటితో ఆమెకు వీడ్కోలు పలికారు.
భయం నీడలో గ్రామం..
ఈ ఘటన తర్వాత రణ్‌పూర్‌లో భయాందోళనలు నెలకొన్నాయి. అంగన్‌వాడీ కేంద్రం పక్కనే ఉన్న చెట్టుకు భారీ తేనె తుట్టె ఉంది. గ్రామంలో ఉన్న ఒకే ఒక్క చేతి పంపు కూడా అక్కడే ఉండటంతో, మళ్లీ ఎప్పుడు దాడి జరుగుతుందోనని ప్రజలు నీళ్లు తోడుకోవడానికి కూడా భయపడుతున్నారు. తక్షణమే ఆ తేనె తుట్టెను తొలగించాలని, తన ప్రాణాలను త్యాగం చేసిన కంచన్ బాయి కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


