ముంబై మున్సిపల్ పోరు: ఆరంభంలోనే హోరాహోరీ, ఆధిక్యంలో బీజేపీ!
మూడేళ్ల విరామం తర్వాత జరిగిన బీఎంసీ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠగా సాగుతోంది. తొలి ట్రెండ్స్‌లో బీజేపీ ముందంజలో ఉన్నప్పటికీ శివసేన సైతం గట్టిపోటీని ఇస్తోంది. ముంబైలోని 227 వార్డులతో పాటు మహారాష్ట్రలోని మరో 28 మున్సిపల్ కార్పొరేషన్ల ఫలితాలు నేడు వెలువడనున్నాయి.
దేశ ఆర్థిక రాజధాని ముంబై ఎవరి వశం కాబోతోంది? యావత్ భారత్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నేడు, శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. గురువారం జరిగిన పోలింగ్‌లో 52.94 శాతం ఓటింగ్ నమోదు కాగా, నేడు 227 వార్డుల అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. మూడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ ఎన్నికలు జరగడంతో రాజకీయ వర్గాల్లోనూ, సామాన్య ప్రజల్లోనూ భారీ ఉత్కంఠ నెలకొంది.

ముంబైతో పాటు పుణె, థానే, నవీ ముంబై వంటి మరో 28 ప్రధాన నగర పాలక సంస్థల ఫలితాలు కూడా వెలువడుతున్నాయి.
ముంబై స్థానిక ఎన్నికలు- ఉత్కంఠగా కౌంటింగ్ ప్రక్రియ..
ముంబై వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 23 కౌంటింగ్ కేంద్రాల్లో ఉదయం 10 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. మున్సిపల్ కమిషనర్ భూషణ్ గగ్రానీ పర్యవేక్షణలో ఈ ప్రక్రియ సాగుతోంది. అన్ని వార్డుల్లో ఒకేసారి కాకుండా విడతల వారీగా లెక్కింపు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.
కాగా ప్రస్తుతం వెలువడుతున్న ప్రారంభ ట్రెండ్స్ ప్రకారం ముంబైలో బీజేపీ, శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది. టీవీ రిపోర్టుల ప్రకారం బీజేపీ 16 వార్డుల్లో ఆధిక్యంలో ఉండగా, ఉద్ధవ్ వర్గం 11 వార్డుల్లో గట్టి పోటీ ఇస్తోంది. ముఖ్యంగా మరాఠీ
ఓటర్లు ఎక్కువగా ఉన్న 68 వార్డుల తీర్పు ఈసారి ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. బాలీవుడ్ గడ్డపై అసలైన శివసేన వారసత్వం ఎవరిది? ఏకనాథ్ షిండేదా లేక ఉద్ధవ్ థాకరేదా అనే ప్రశ్నకు ఈ ఫలితాలే సమాధానం చెప్పనున్నాయి.
గత బీఎంసీ ఎన్నికల్లో ఉమ్మడి శివసేన 84 స్థానాలను, బీజేపీ 82 స్థానాలను గెలుచుకుని హోరాహోరీగా తలపడ్డాయి. అయితే ఈసారి శివసేన రెండు ముక్కలవ్వడం, కొత్త కూటములు ఏర్పడటంతో ముంబై మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనేది మరికొద్ది గంటల్లో తేలనుంది.
మారిన రాజకీయ సమీకరణాలు..
ఈ ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయాల్లో అనేక వింత కలయికలు కనిపించాయి. దశాబ్ద కాలంగా వైరి పక్షాలుగా ఉన్న అన్నదమ్ములు ఉద్ధవ్ థాకరే, రాజ్ థాకరే గతేడాది జూన్‌లో చేతులు కలిపి ఈ పోరులో నిలిచారు. మరోవైపు రాష్ట్రస్థాయిలో అధికార పక్షమైన మహాయుతిలో ఉన్నప్పటికీ.. పుణె, పింప్రి-చించ్వాడ్ వంటి ప్రాంతాల్లో అజిత్ పవార్ వర్గం, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీతో కలిసి పోటీ చేయడం విశేషం.
పూణె మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..
పూణె మున్సిపల్ ఎన్నికల ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం.. బీజేపీ 32 చోట్ల, అజిత్ పవార్ ఎన్సీపీ 14 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. కాంగ్రెస్ 2, ఏక్నాథ్ శిండే శివసేన 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
మరోవైపు పింప్రీ- చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 8 సీట్లల్లో, అజిత్ పవర్ ఎన్సీపీ 6 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నాయి. శరద్ పవార్ ఎన్సీపీ 2 చోట్ల, ఏక్నాథ్ శిండే శివసేన 1 చోట ముందంజలో ఉన్నాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


