ఇలాంటి పిచ్ మళ్లీ తయారు చేయను.. రెండు రోజుల్లోనే మ్యాచ్ ముగియడం షాక్‌కు గురి చేసింది: ఎంసీజీ పిచ్ క్యూరేటర్ కామెంట్స్

మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ పిచ్ పై వస్తున్న విమర్శలకు క్యూరేటర్ మ్యాట్ పేజ్ స్పందించాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ నాలుగో టెస్టు మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగిసిన తర్వాత అతడు మీడియాతో మాట్లాడాడు. ఇలా జరుగుతుందని ఊహించలేదని చెప్పాడు.

Published on: Dec 28, 2025, 07:44:33 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మెల్‌బోర్న్ (MCG) వేదికగా జరిగిన నాలుగో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ఊహించని విధంగా కేవలం రెండు రోజుల్లోనే ముగిసింది. 6 సెషన్లలో ఏకంగా 36 వికెట్లు పడటంతో పిచ్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇంగ్లండ్ గెలిచినప్పటికీ.. మ్యాచ్ త్వరగా అయిపోవడంతో క్రికెట్ ఆస్ట్రేలియాకు భారీగా ఆర్థిక నష్టం వాటిల్లింది. పిచ్ తీరు చూసి క్యూరేటర్ కూడా షాక్ అయ్యాడు.

ఇలాంటి పిచ్ మళ్లీ తయారు చేయను.. రెండు రోజుల్లోనే మ్యాచ్ ముగియడం షాక్‌కు గురి చేసింది: ఎంసీజీ పిచ్ క్యూరేటర్ కామెంట్స్ (AFP)
ఇలాంటి పిచ్ మళ్లీ తయారు చేయను.. రెండు రోజుల్లోనే మ్యాచ్ ముగియడం షాక్‌కు గురి చేసింది: ఎంసీజీ పిచ్ క్యూరేటర్ కామెంట్స్ (AFP)

బాక్సింగ్ డే టెస్టు ఇలా..

బాక్సింగ్ డే టెస్ట్ అంటే క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగ లాంటిది. కానీ ఈసారి మెల్‌బోర్న్ పిచ్ దెబ్బకు ఆ పండగ రెండు రోజులకే ముగిసింది. ఆస్ట్రేలియా క్రికెట్‌కు ఇదొక చేదు జ్ఞాపకంలా మిగిలిపోయింది.

మ్యాచ్ రెండో రోజు సాయంత్రం సెషన్‌లోనే ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 2011 తర్వాత ఆస్ట్రేలియాలో ఇంగ్లండ్ గెలిచిన తొలి టెస్ట్ ఇదే. కేవలం 6 సెషన్ల ఆటలో 36 వికెట్లు పడ్డాయి. 1909 తర్వాత యాషెస్ సిరీస్ మొదటి రోజే అత్యధిక వికెట్లు (20) పడటం ఇదే రికార్డు.

మ్యాచ్ ఐదు రోజులు సాగుతుందని ఆశిస్తే.. రెండు రోజులకే అయిపోవడంతో క్రికెట్ ఆస్ట్రేలియా (CA)కు గట్టి దెబ్బ తగిలింది. టికెట్లు, బ్రాడ్‌కాస్టింగ్ రూపంలో సుమారు 10 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు నష్టం వచ్చినట్లు అంచనా వేస్తున్నారు.

బెన్ స్టోక్స్ కౌంటర్

విజయం తర్వాత ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. "ఈ పిచ్ వేరే దేశంలో (ఉదాహరణకు ఇండియాలో) ఉండి ఉంటే.. జనాలు రచ్చ రచ్చ చేసేవాళ్లు" అని పిచ్‌పై వస్తున్న విమర్శలను ప్రస్తావించాడు.

క్యూరేటర్ ఏమన్నాడంటే?

సాధారణంగా మ్యాచ్ మధ్యలో క్యూరేటర్లు మాట్లాడరు. కానీ ఎంసీజీ క్యూరేటర్ మాట్ పేజ్ మాత్రం మీడియా ముందుకు వచ్చాడు. "నా లైఫ్ లో ఇలాంటి టెస్ట్ మ్యాచ్ చూడలేదు. మళ్లీ ఇలాంటి మ్యాచ్‌కు నన్ను పిలవకూడదని కోరుకుంటున్నా. మొదటి రోజు ఆట చూసి నేను షాక్ అయ్యాను" అని పేజ్ అన్నాడు.

తాము అనుకున్నట్టు పిచ్ ప్రవర్తించలేదని, వచ్చే ఏడాది కచ్చితంగా సరిదిద్దుకుంటామని అతడు చెప్పాడు. రెండు రోజుల్లోనే మ్యాచ్ ముగియడం తమకు తీవ్ర నిరాశనే మిగిల్చిందని తెలిపాడు.

టికెట్లు కొన్నవాళ్ల పరిస్థితి ఏంటి?

మెల్‌బోర్న్ క్రికెట్ క్లబ్ (MCC) సీఈవో స్టూవర్ట్ ఫాక్స్ మాట్లాడుతూ.. "రెండు రోజుల్లోనే దాదాపు 1.90 లక్షల మంది జనం వచ్చారు. మూడో రోజు టికెట్లు కొన్నవారికి నిరాశే మిగిలింది. ప్లేయర్స్ మధ్య ఏదైనా ఫ్రెండ్లీ మ్యాచ్ పెడదామని చర్చలు జరిగాయి కానీ.. అది కుదరలేదు" అని తెలిపారు. ఈ పిచ్ బ్యాటర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదని ఆయన అంగీకరించారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More