ఇంధన రంగంలో కొత్త మైలురాయి: 250 మెగావాట్ల ప్లాంట్‌ను కొనుగోలు చేసిన మేఘా

మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) అనుబంధ సంస్థ అయిన ఎంఈఐఎల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, తమిళనాడులోని నేవేలి వద్ద ఉన్న 250 మెగావాట్ల లిగ్నైట్ ఆధారిత విద్యుత్ కేంద్రాన్ని కొనుగోలు చేసింది. టీఏక్యూఏ నేవెలీ పవర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క వంద శాతం వాటాను స్వాధీనం చేసుకుంది. 

Published on: Oct 30, 2025 5:39 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్, అక్టోబర్ 30: తమిళనాడులోని నేవేలి వద్ద ఉన్న 250 మెగావాట్ల లిగ్నైట్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రుక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) కొనుగోలు చేసింది. అబుదాబి నేషనల్ ఎనర్జీ కంపెనీ పీజేఎస్‌సీ (టీఏక్యూఏ) నుంచి దాని అనుబంధ సంస్థ టీఏక్యూఏ నేవెలీ పవర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (టీఏక్యూఏ నేవెలీ) లోని 100 శాతం వాటాను ఎంఈఐఎల్ అనుబంధ సంస్థ ఎంఈఐఎల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ (ఎంఈఐఎల్ ఎనర్జీ) స్వాధీనం చేసుకున్నట్లు ఎంఈఐఎల్ గురువారం ప్రకటించింది.

ఇంధన రంగంలో కొత్త మైలురాయి: 250 మెగావాట్ల ప్లాంట్‌ను కొనుగోలు చేసిన మేఘా
ఇంధన రంగంలో కొత్త మైలురాయి: 250 మెగావాట్ల ప్లాంట్‌ను కొనుగోలు చేసిన మేఘా

వ్యూహాత్మక పరిణామం:

ఈ స్వాధీన ప్రక్రియను ఎంఈఐఎల్ గ్రూప్ యొక్క వ్యూహాత్మక పరిణామంగా పరిగణించవచ్చు. ఒక పెద్ద ఈపీసీ (ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్స్ట్రక్షన్) కాంట్రాక్టర్ నుండి, ఇప్పుడు అంతర్గతంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి, యాజమాన్యం మరియు నిర్వహణలో నిమగ్నమైన సమగ్ర ఇన్‌ఫ్రా డెవలపర్‌గా మారే దిశలో ఎంఈఐఎల్ చేసిన కీలకమైన అడుగు ఈ కొనుగోలు.

టీఏక్యూఏ నేవెలీ ప్రస్తుతం 250 మెగావాట్ల సామర్థ్యం కలిగిన లిగ్నైట్ ఆధారిత విద్యుత్ కేంద్రాన్ని తమిళనాడులోని నేవెలీ ప్రాంతంలో విజయవంతంగా నిర్వహిస్తోంది. ఈ విద్యుత్ కేంద్రానికి తమిళనాడు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థతో దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఉంది. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా నిరంతర, నమ్మదగిన విద్యుత్ సరఫరా అందించడంలో ఈ యూనిట్ స్థిరమైన పనితీరును ప్రదర్శించింది.

ఇంధన రంగంలో స్థానం పటిష్ఠం:

ప్రస్తుతం ఇంధన రంగంలో 5.2 గిగావాట్లకు పైగా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ఎంఈఐఎల్ కలిగి ఉంది. తమిళనాడు ప్లాంట్ కొనుగోలు ద్వారా సంస్థ ఈ రంగంలో తన స్థానాన్ని మరింత బలపరుచుకుంటోంది. అలాగే, దేశంలో విద్యుత్ అవసరాలను తీర్చడంతో పాటు స్థిరమైన, భారీ స్థాయిలో పనిచేసే ఉత్పత్తి ఆస్తుల పోర్ట్‌ఫోలియోను నిర్మించే లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తోంది.

ఎంఈఐఎల్ ఎనర్జీ, టీఏక్యూఏ నేవెలీని తమ ప్రస్తుత విద్యుత్ ఉత్పత్తి ఆపరేషన్లలో సులభంగా సమన్వయం చేయడాన్ని ప్రాధాన్యంగా తీసుకుంటోంది. దీని ద్వారా ఆపరేషనల్ ఎక్సలెన్స్, సమర్థవంతమైన ఆస్తి నిర్వహణ తదితరాలకు సంస్థ కట్టుబడి ఉంది.

ఎంఈఐఎల్ సీఎఫ్‌ఓ అభిప్రాయం:

ఈ సందర్భంగా ఎంఈఐఎల్ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సలిల్ కుమార్ మిశ్రా మాట్లాడారు. “ఉన్నత నాణ్యత గల విద్యుత్ ఉత్పత్తి ఆస్తులను స్వాధీనం చేసుకోవడంలో ఇది ఒక మైలురాయిగా నిలుస్తోంది. ఈపీసీ రంగంలో మా అత్యుత్తమ నైపుణ్యాన్ని మౌలిక సదుపాయాల యాజమాన్యంతో కలిపి వ్యూహాత్మక మార్పు సాధించడానికి ఈ కొనుగోలు తోడ్పడుతుంది. మా ప్రధాన దృష్టి, దేశీయ ఇంధన భద్రతను పెంపొందించే, నమ్మదగిన విద్యుత్ సరఫరా అందించే, భారతదేశ దీర్ఘకాలిక అభివృద్ధికి మద్దతు ఇచ్చే వ్యూహాత్మక పెట్టుబడులపై కొనసాగుతుంది" అని చెప్పారు.

"థర్మల్, హైడ్రో, పునరుత్పాదక శక్తి రంగాలను సమన్వయం చేసే సమతులిత, స్థిరమైన విద్యుత్ ఉత్పత్తి పోర్ట్‌ఫోలియో నిర్మాణానికి మేము కట్టుబడి ఉన్నాం. టీఏక్యూఏ నేవెలీ స్వాధీనం మా ఆర్గానిక్ మరియు ఇనార్గానిక్ వృద్ధి వ్యూహాలకు అనుగుణంగా ఉంది. భారత విద్యుత్ రంగంపై మాకు ఉన్న విశ్వాసాన్ని ఇది ప్రతిబింబిస్తోంది” అని మిశ్రా అన్నారు.

ఎంఈఐఎల్ ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తి, చమురు, సహజ వాయువు, పునరుత్పాదక శక్తి, మౌళిక సదుపాయాలు, తయారీ, నీటి నిర్వహణ తదితర రంగాల్లో గణనీయమైన పెట్టుబడులు పెట్టింది. భవిష్యత్తులో భారత ఇంధన స్వావలంబన, ఆర్థిక స్థిరత్వంకు తోడ్పడే అవకాశాలను పరిశీలించి ముందుకు సాగుతోంది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More