మమ్దానీ తల్లి మీరా నాయర్ సినిమాలు: OTT లో తప్పక చూడాల్సిన 5 అద్భుత చిత్రాలు!

ప్రముఖ దర్శకురాలు మీరా నాయర్ కుమారుడు జోహ్రాన్ మమ్దానీ న్యూయార్క్ మేయర్ గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా, ఆమె అద్భుతమైన ఫిల్మోగ్రఫీని ఓసారి గుర్తు చేసుకుందాం. మీరా నాయర్ దర్శకత్వం వహించిన 5 ముఖ్యమైన సినిమాలు, వెబ్ సిరీస్‌ల వివరాలు OTT ప్లాట్‌ఫామ్‌లతో సహా ఇక్కడ తెలుసుకోండి.

Published on: Nov 5, 2025, 15:43:07 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రపంచ చలనచిత్ర రంగంలో భారతీయ దర్శకులలో మీరా నాయర్ స్థానం ప్రత్యేకమైనది. ఒడిశాలో జన్మించిన మీరా నాయర్.. ముంబైలో జన్మించిన స్కాలర్ మహమూద్ మమ్దానీని వివాహం చేసుకున్నారు. కాగా, నవంబర్ 4న వారి కుమారుడు జోహ్రాన్ మమ్దానీ (34) న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఈ నేపథ్యంలో, అత్యంత ప్రభావవంతమైన దర్శకులలో ఒకరిగా పేరుగాంచిన మీరా నాయర్ మేధస్సు, సృజనాత్మకత ఉట్టిపడే ఆమె అద్భుత చిత్రాలను OTT లో చూసే అవకాశం మీకుంది.

మమ్దానీ తల్లి మీరా నాయర్ సినిమాలు: OTT లో తప్పక చూడాల్సిన 5 అద్భుత చిత్రాలు! (REUTERS/Shannon Stapleton)
మమ్దానీ తల్లి మీరా నాయర్ సినిమాలు: OTT లో తప్పక చూడాల్సిన 5 అద్భుత చిత్రాలు! (REUTERS/Shannon Stapleton)

1. సలామ్ బాంబే (Salaam Bombay)

1988లో మీరా నాయర్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఇది. ముంబై వీధుల్లోని పదేళ్ల బాలకృష్ణ కళ్లల్లోంచి నగరంలో నివసించే వీధి బాలల కఠోర వాస్తవాన్ని చాలా శక్తిమంతంగా, కదిలించేలా చూపించారు.

కథాంశం: తల్లి వదిలేయడంతో ఒక సర్కస్‌లో చేరిన కృష్ణ, ఆ తర్వాత ఒంటరిగా బాంబే చేరుకుంటాడు. తన ఇంటికి తిరిగి వెళ్లడానికి రూ. 500 పోగు చేయాలని టీ స్టాల్‌లో పనిచేస్తాడు. వీధుల్లో అతనికి డ్రగ్ ఎడిక్ట్ అయిన చిల్లమ్, వేశ్యాగృహానికి అమ్మేసిన సోలా సాల్, భయంతో జీవిస్తున్న మంజు స్నేహితులవుతారు. మనుగడ, స్నేహం, ఆశ కోసం కృష్ణ చేసే పోరాటం... పట్టణ దారిద్య్రాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపిస్తుంది.

నటీనటులు: నానా పటేకర్, ఇర్ఫాన్ ఖాన్, షఫీక్ సయ్యద్.

OTT ప్లాట్‌ఫామ్: జియో సినిమా (JioHotstar), అమెజాన్ ప్రైమ్ వీడియో.

2. మాన్‌సూన్ వెడ్డింగ్ (Monsoon Wedding)

కుటుంబ అనుబంధాలు, రహస్యాలు, ప్రేమను ఆవిష్కరిస్తూ మీరా నాయర్ తీసిన రొమాంటిక్ డ్రామా 'మాన్‌సూన్ వెడ్డింగ్'. ఢిల్లీలోని పంజాబీ కుటుంబం నాలుగు రోజుల పాటు జరుపుకునే ఒక సంప్రదాయ వివాహం నేపథ్యాన్ని సరదాగా, భావోద్వేగంగా చూపించారు.

కథాంశం: వరుడు హేమంత్ రాయ్‌ను (హ్యూస్టన్ ఇంజనీర్) సరిగా తెలియకపోయినా, పెళ్ళికి ఒప్పుకుంటుంది పెళ్ళి కూతురు అదితి వర్మ. కానీ, అంతకుముందే పెళ్లైన తన మాజీ బాస్‌తో ఆమెకు ఎఫైర్ ఉంటుంది. దాని గురించి హేమంత్‌కు చెప్పడానికి అపరాధ భావంతో తల్లడిల్లుతుంది. మరోవైపు, పెళ్ళి ఖర్చులు, కుటుంబ సమస్యలతో ఆమె తండ్రి లలిత్ వర్మ ఇబ్బంది పడతాడు.

నటీనటులు: నసీరుద్దీన్ షా, వసుంధరా దాస్, షెఫాలీ షా.

OTT ప్లాట్‌ఫామ్: యూట్యూబ్ (YouTube).

3. ది నేమ్‌సేక్ (The Namesake)

ఝుంపా లహరి నవల ఆధారంగా మీరా నాయర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం... సంప్రదాయం, ఆధునిక గుర్తింపు మధ్య సమతుల్యత కోసం పోరాడే ఒక బెంగాలీ కుటుంబం కథను చెబుతుంది. కలకత్తా నుంచి న్యూయార్క్ వెళ్లిన ఈ కుటుంబం కథ చాలా హృద్యంగా ఉంటుంది.

కథాంశం: బెంగాలీ మూలాలు, అమెరికన్ జీవనశైలికి మధ్య నలిగిపోయే గోగోల్ గంగూలీని ఈ సినిమా అనుసరిస్తుంది. తన అసాధారణ పేరుతో సిగ్గుపడి, అందరిలో కలిసిపోవడానికి పేరును నిఖిల్‌గా మార్చుకుంటాడు. తండ్రి ఆకస్మిక మరణం తర్వాత, తన కుటుంబం చేసిన త్యాగాలను అర్థం చేసుకుంటాడు. తన సంస్కృతికి మళ్లీ కనెక్ట్ అవుతాడు. తల్లి భారతదేశానికి తిరిగి వెళ్ళేందుకు సిద్ధమవుతున్నప్పుడు, గోగోల్ తన పేరును, గుర్తింపును స్వీకరిస్తాడు.

నటీనటులు: ఇర్ఫాన్ ఖాన్, టబు, కల్ పెన్.

OTT ప్లాట్‌ఫామ్: జియో సినిమా (JioHotstar).

4. మిస్సిస్సిప్పి మసాలా (Mississippi Masala)

1991లో వచ్చిన ఈ రొమాంటిక్ డ్రామా... ప్రేమ, గుర్తింపు, సంస్కృతుల మధ్య అనుబంధం గురించి చెబుతుంది.

కథాంశం: 1972లో ఇడి అమీన్ పాలనలో ఇండియన్-ఉగాండా న్యాయవాది జే, అతని కుటుంబాన్ని ఉగాండా నుండి బహిష్కరించారు. వారు సర్వం కోల్పోయి, అమెరికాలోని మిస్సిస్సిప్పిలో స్థిరపడతారు. అయినప్పటికీ జే తన పాత ఇంటి కోసం తపన పడుతుంటాడు. సంవత్సరాల తర్వాత, అతని కూతురు మీనా, ఆఫ్రికన్ అమెరికన్ వ్యాపారవేత్త డెమెట్రియస్‌తో ప్రేమలో పడుతుంది. వారి సంబంధం రెండు వర్గాల నుండి వ్యతిరేకత, పక్షపాతానికి దారితీస్తుంది.

నటీనటులు: డెంజెల్ వాషింగ్టన్, సరిత చౌదరి, షర్మిల ఠాగూర్.

OTT ప్లాట్‌ఫామ్: యూట్యూబ్ (YouTube).

5. ఎ సూటబుల్ బాయ్ (A Suitable Boy) - వెబ్ సిరీస్

విక్రమ్ సేథ్ రాసిన నవల ఆధారంగా మీరా నాయర్ దర్శకత్వం వహించిన లిమిటెడ్ వెబ్ సిరీస్ ఇది. స్వాతంత్య్రం, విభజన తర్వాత 1950ల ప్రారంభంలో భారతదేశంలో ఈ కథ జరుగుతుంది.

కథాంశం: ఈ కథ నాలుగు కుటుంబాల చుట్టూ తిరుగుతుంది. ముఖ్యంగా, తన కుమార్తె లతాకు 'తగిన అబ్బాయి'ని వెతకడానికి శ్రీమతి రూప మెహ్రా చేసే ప్రయత్నంపై ప్రధానంగా దృష్టి పెడుతుంది. సంప్రదాయం, స్వేచ్ఛ మధ్య నలిగిపోయే లత... ముగ్గురు పురుషులలో ఒకరిని ఎంచుకోవాలి. ఆమె రహస్యంగా ప్రేమించే ఛార్మింగ్ ముస్లిం క్రికెటర్ కబీర్ దురానీ, బలమైన విలువలు ఉన్న చెప్పుల తయారీదారు హరీష్ ఖన్నా, ఉన్నత కుటుంబానికి చెందిన కవి అమిత్ ఛటర్జీల మధ్య లత డైలమా భారతదేశంలోని పాత సంప్రదాయాలు, ఆధునిక ఆకాంక్షల మధ్య సంఘర్షణను ప్రతిబింబిస్తుంది.

నటీనటులు: తాన్యా మానిక్తాలా, ఇషాన్ ఖట్టర్, టబు

OTT ప్లాట్‌ఫామ్: నెట్‌ఫ్లిక్స్ (Netflix)

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More